ఉలిక్కిపడిన వేములవాడ
వివాహేతర సంబంధమేనని చర్చ
మృతుడి శరీరంపై 30కిపైగా గాయాలు
వేములవాడ: యువకుడి హత్యతో వేములవాడ ఉలిక్కిపడింది. తెల్లవారుజామున వేటాడి.. వెంటపడి చంపేశారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమనే చర్చ సాగుతోంది. హత్య చేసిన వారితోపాటు ఓ మహిళ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
స్థానికులు తెలిపిన వివరాలు. వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో నివసించే ఎండీ రషీద్(36) బుధవారం వేకువజామున 5.15 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. స్థానిక అర్బన్‌కాలనీ నుంచి కోనాయపల్లిరోడ్‌లోని ఓ కాలనీ వరకు వెంటాడి హతమార్చినట్లు తెలుస్తోంది. మృతుడి శరీరంపై 30కి పైగా గాయాలు ఉన్నట్లు సమాచారం. మృతుడికి భార్య శిరీన్, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఏరియా ఆస్పత్రి నుంచి నూకలమర్రికి తరలించారు.
మృతదేహాన్ని తమకు అప్పగించకుండా నూకలమర్రికి ఎందుకు తీసుకెళ్లారంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌బీ డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు, రక్తపు నమూనాలు సేకరించారు. హత్యకు పాల్ప డిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
సోదరునికి ఫోన్‌చేసి... ఆపై తుదిశ్వాస విడిచి
వేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన ఎండీ రషీద్ ఐదేళ్లుగా పట్టణంలోని సాయినగర్‌లో ఉంటున్నారు. గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలోనే గతంలో నమోదైన కేసులో రాజీపడ్డట్లు సమాచారం. బుధవారం వేకువజామున 5 గంటలకు మృతుడి రషీద్ సోదరుడు అజీమ్‌కు ఫోన్ చేసి చంపుతున్నారని, త్వరగా రావాలని చెప్పినట్లు పోలీసులకు వివరించారు. అడ్రస్ సరిగా తెలియక అజీమ్ తన మిత్రుడు శ్రీనివాస్‌ను తీసుకొని గాలించగా ఆలస్యంగా రషీద్ పడి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే కొనఊపిరితో ఉన్న రషీద్‌ను అంబులెన్స్‌లో తరలిస్తుండగానే చనిపోయినట్లు అజీమ్ తెలిపారు. తన సోదరి రబియా హైదరాబాద్‌కు వెళ్లగా.. రాత్రి వారి ఇంట్లో పడుకున్నాడని పోలీసులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment