నెలకు సగటున రూ.8,251 ఖర్చు చేస్తున్న పట్టణ ప్రజలు
పెద్ద రాష్ట్రాలలో తెలంగాణదే అగ్రస్థానం
సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,773
హౌస్‌హోల్డ్ కన్ జంప్షన్ సర్వే వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు.
పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్‌జంప్షన్ ఎక్స్‌పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది.
గతంలో కన్జ్యూమర్ ఎక్స్‌పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్
పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment