గ్రామీణ తెలంగాణతో పోలిస్తే అర్బన్ తెలంగాణలో 60 శాతం అధిక ఖర్చు
రూరల్ తెలంగాణలో సగటున నెలకు రూ. 5,675 తలసరి ఖర్చు
అదే అర్బన్ తెలంగాణలో రూ.9,131.. రెండింటి మధ్య తేడా రూ. 3,456
నెలవారీ ఖర్చు వివరాలు వెల్లడించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తలసరి ఖర్చు వ్యత్యాసం పెరుగుతోంది. గ్రామీణ తెలంగాణలో నెలవారీ తలసరి ఖర్చు రూ.5,675 కాగా, అర్బన్ తెలంగాణలో అది రూ.9,131గా ఉన్నట్లు తేలింది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ‘గృహ వినియోగ వ్యయ సర్వే–2024’పేరుతో వెల్లడించిన నివేదికలో ఈమేరకు వెల్లడైంది. దీని ప్రకారం రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం రూ.3,456 కాగా, గ్రామీణ ప్రజల కంటే పట్టణ ప్రజల తలసరి 60 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఖర్చులో తేడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం.
సిక్కిం టాప్..
దేశంలో తలసరి నెల వారీ ఖర్చులో ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం టాప్‌గా నిలిచింది. ఇక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు నెలకు రూ.9,474 ఖర్చు చేస్తుండగా, పట్టణ సిక్కిం వాసులు రూ.13,675 ఖర్చు చేస్తున్నారు. అన్నిటికంటే తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో గ్రామీణ తలసరి ఖర్చు రూ. 2,927 కాగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.5,114గా నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిశీలిస్తే చండీగఢ్‌లో అత్యధికంగా గ్రామీణ ప్రజలు రూ. 8,857, పట్టణ ప్రజలు రూ.13,425 ఖర్చు చేస్తున్నారు. అన్నింటికంటే తక్కువగా దాద్రానగర్ హవేలీ, డామన్‌డయ్యూ గ్రామీణ ప్రజలు నెలకు రూ.4,450, జమ్మూకశీ్మర్‌లోని పట్టణ ప్రజలు రూ.6,375 ఖర్చు చేస్తున్నారు. దేశ సగటును చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247, పట్టణ ప్రాంతాల్లో రూ.7,078 చొప్పున నెలకు ఖర్చవుతోంది.
తిండి ఖర్చు 40 శాతం లోపే..
తలసరి ఖర్చులో గ్రామీణ, ప్రాంతాల భారతీయులు ఆహారం కోసం ఆదాయంలో 40 శాతం లోపే ఖర్చు చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో ఇంటి అద్దెల కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ సర్వే నిర్వహించింది. ఆగస్టు 2022 నుంచి జూలై 2023 వరకు మొదటి విడత, ఆగస్టు 2023 నుంచి జూలై 2024 మధ్య రెండోవిడతలో దేశంలోని 2,61,953 కుటుంబాల నుంచి శాంపిళ్లు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారి ద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఉచితాలు కలిపి ఓ సర్వే, ఉచితాలను తీసివేసి మరో సర్వే నిర్వహించారు.
గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేయాలి
దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు మధ్య తేడా ఉంది. కేరళ, తమిళనాడులో గ్రామీణ ప్రజలకు అసంఘటిత రంగంలో ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 150 ఏళ్లుగా రెండు బ్యారేజీలు అందుబాటులో ఉండటం, విద్యా స్థాయి ఎక్కువ ఉన్న కారణంగా రెండు ప్రాంతాల మధ్య వ్యయ తారతమ్యం తక్కువ ఉంటుంది. బెంగళూరు మినహా దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ అర్బన్ ప్రాంత ఆదాయాన్ని కూడా హైదరాబాద్ ఆదాయంతో పోల్చలేం. అయితే, తెలంగాణలో గ్రామీణ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ కారణాలతోనే గ్రామీణ ప్రాంతాల తలసరి ఖర్చు తక్కువగా ఉంటోంది. గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేయడమే ఇందుకు ఏకైక మార్గమని ఈ నివేదిక ద్వారా అర్థమవుతోంది. –డాక్టర్ అందె సత్యం, ఆర్థిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment