
సాక్షి, హైదరాబాద్: ప్రజావైద్యంపై తెలంగాణ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఖర్చులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 1,698గా ఉందని పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 3,177 ఖర్చు చేస్తూ తొలి స్థానంలో నిలవగా రెండో స్థానంలో నిలిచిన కేరళ ప్రభుత్వం రూ. 2,272 ఖర్చు చేస్తోంది.
యూపీ, జార్ఖండ్ అతితక్కువగా రూ. 801 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తూ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కంటే వ్యక్తిగతంగా ప్రజలు వైద్యంపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉంది. తమ జేబు నుంచి వైద్యం ప్రజలు చేస్తున్న తలసరి ఖర్చు రూ. 2,120గా ఉంది. ఈ విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. అంటే ప్రభుత్వం, ప్రజలు కలిపి ఆరోగ్యం కోసం ఉమ్మడిగా తలసరి రూ. 3,818 ఖర్చు చేస్తున్నారు
ప్రజలు సొంతంగా చేస్తున్న తలసరి ఖర్చు కేరళలో అత్యధికంగా రూ. 6,363 ఉండటం విశేషం. ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చుకన్నా రెండింతలకుపైగా కేరళ ప్రజలు తలసరి ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. అత్యంత తక్కువగా తమ జేబు నుంచి వైద్యం కోసం తలసరి ఖర్చు చేస్తున్నది బిహార్‌వాసులు. ఆ రాష్ట్రంలో ఒక్కొక్కరు రూ. 808 ఖర్చు చేస్తున్నారు.