అంతర్గతంగా ఆరోగ్యంపై ప్రభావం.. అధ్యయనాల వెల్లడి
17 శాతం గుండె జబ్బులు, స్లీప్ సైకిల్‌కు అంతరాయం
30 శాతం వ్యాధినిరోధక వ్యవస్థ తగ్గుదల
సరైన పంథా, వ్యూహాలతో కోపాన్ని నియంత్రించ వచ్చంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: భావోద్వేగాల పరంగా చూస్తే.. ఆయా సందర్భాలు, సంఘటనలను బట్టి కోపం రావడాన్ని సహజ లక్షణంగానే పరిగణిస్తుంటారు. కానీ కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైతే మాత్రం.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటున్నాయనేది అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎవరైనా తమ కోపాన్ని ఆపుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే.. దాని ప్రతికూల ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోందని స్పష్టమౌతోంది.
ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతే వివిధ రూపాల్లో ఆరోగ్యంపై ప్రభావంపడడంతో పాటు, ఏదైనా ధ్వంసం చేయాలనే ఆలోచన లేదా ఎవరిపై దాడికి పాల్పడటం, స్వీయ నియంత్రణ కోల్పోవడం, తదితర రుగ్మతలకు దారితీయడం, వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి కారణమౌతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే కోపం రావడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే.. వ్యక్తిగతంగా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ట్రాఫిక్‌లో ఇరుక్కుని వెళ్లాల్సిన ముఖ్యమైన సమావేశానికి లేదా ఫంక్షన్‌కు ఆలస్యం కావడం, చిన్న విషయానికే చిరాకు పడటం, అపరాధ భావం, కొందరిపై లేదా పరిస్థితులపై వ్యతిరేక భావం, ఏదైనా విషయమై తోటివారు, స్నేహితులు, బంధువులు, సహచరులతో భిన్నాభిప్రాయాలు ఎదురుకావడం, మానసికంగా కుంగుబాటు, కూడా కోపం రావడానికి కారణాలుగా విశ్లేష్టిస్తున్నారు.
పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లోనూ కోపం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం, ఇతర అంశాలను పరిశీలించారు. కోపోద్రిక్తులు కావడం వల్ల వెంటనే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వల్ల గుండెపై (కార్డియోవాసు్క్యలర్ స్ట్రెయిన్) ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. గుండెజబ్బుల ముప్పు కూడా 19 శాతం పెరుగుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తన పరిశీలనలో పేర్కొంది. ఏదైనా సంఘటన లేదా కారణంతో అధికంగా ఉద్రేక పడితే.. ఆ తర్వాత రెండుగంటల వ్యవధిలోనే గుండెపోటు వచ్చే అవకాశం ఎనిమిదన్నర రెట్లు పెరుగుతుందని యూరోపియన్ హార్ట్ జనరల్ వెల్లడించింది. రక్తపోటు పెరిగిపోయి ‘క్రానిక్ హైపర్‌టెన్షన్’గా మారితే హార్ట్‌స్ట్రోక్‌తో పాటు మూత్రపిండాల వ్యాధులకు దారితీయొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోపంపై నియంత్రణ కోల్పోతే రోగనిరోధక సామర్థ్యం 30 శాతం తగ్గిపోతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోపానికి గురైనపుడు కొన్ని గంటల పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనమౌతుందని వెల్లడిస్తున్నాయి. 24 గంటల పాటు ‘స్లీప్ సైకిల్స్’లో ఇబ్బందులు, కేవలం రెండు నిమిషాల కోపం అనేది 7 గంటల పాటు ‘కోర్టిసోల్’స్థాయిల్లో పెరుగుదలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నాయి.
ఆగ్రహం నియంత్రణకు ఏం చేయాలంటే..
⇒ కోపం వచ్చే సూచనలను ముందుగానే గమనించి.. దాని నియంత్రణకు అవసరమైన విధంగా స్పందించాలి
⇒ వెంటనే ప్రతిస్పందించకుండా.. ఏం చేయాలనే దానిపై కొంత సమయమిచ్చి ఆలోచించాలి. ఒకటి నుంచి పది దాకా లెక్క పెట్టడంతో పాటు కామింగ్ బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి
⇒ కోపానికి కారణం ఏమిటో తెలియజేయాలి. అందుకు కారణమైన వ్యక్తితో కాకుండా మిత్రుడు లేదా ఆప్తులతో మాట్లాడాలి
⇒ పరుగు, నడక, ఈత, యోగ వంటి ఒత్తిళ్లను తగ్గించే కార్యకలాపాలు చేయాలి
⇒ ఏదైనా సంఘటనకు వెంటనే ప్రభావితమై స్పందించకుండా.. ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి.
యాంగర్ మేనేజ్‌మెంట్ కేసులే ఎక్కువ
మా దగ్గరకు ‘యాంగర్ మేనేజ్‌మెంట్’కు సంబంధించిన కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. వైవాహిక బంధంలో తలెత్తే సమస్యలతో దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కోపోద్రిక్తులు కావడం, రోడ్డుపై వెళ్తునపుడు ఎదురయ్యే ఘటనలతో, వ్యక్తిత్వాల్లో వచ్చిన మార్పులతో ఆవేశాలు, ఇలా వివిధ కారణాలు, సంఘటనలతో ప్రభావితమై తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని వారు వస్తున్నారు. వారికి ఆయా సమస్యలకు అనుగుణంగా మందులు ఇవ్వడం, కౌన్సెలింగ్, యాంగర్ మేనేజ్‌మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో లేదా ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు ఆగ్రహానికి గురైతే మంచిదే.
కానీ ఏ చిన్న సంఘటనకైనా, చిన్నపాటి వాగ్వాదానికి ఇతరులపై కోపగించుకోవడం, రుస రుసలాడటం వంటివి చేస్తే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కోపం అనేది ‘నెగిటివ్ ఎమోషన్’అయినప్పటికీ.. ఆగ్రహం రావడానికి భావోద్వేగపరమైన అంశాలు మెదడుపై ప్రభావం చూపి (నెర్వస్ సిస్టమ్‌పై) శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసి ఒక్కసారిగా రక్తప్రసారం పెరిగిపోతుంది. వెంటనే ఏదో రూపంలో శరీరం స్పందించేలా చేస్తుంది. మామూలుగా చూస్తే ఇదొక రక్షణ వ్యవస్థ (డిఫెన్న్ మెకానిజం)గా ఉన్నా.. ఒకస్థాయి దాటాక కోపాన్ని నియంత్రించుకోలేకపోతే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల కోపంపై నియంత్రణ ఎంతైన
అవసరం. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్–డైరెక్టర్, ఆశా హాస్పటల్స్
చేయకూడనివి..
⇒ అన్నింటినీ ఒకేసారి చేయా లని ప్రయత్నించొద్దు. అందుకోగలిగే చిన్న లక్ష్యాలను ముందు నిర్దేశించుకోవాలి
⇒ మనం మార్చలేని వాటిపై దృష్టి కేంద్రీకరించొద్దు. సమయాన్ని, శక్తియుక్తులను నిర్దేశిత లక్ష్యంపై పెట్టాలి. ఎవరికి వారు స్వాంతన చేకూర్చుకుంటే మంచిది
⇒ ఏకాకిగా ఉన్నాననే భావన రానివ్వొద్దు. మిత్రులు, సహచరుల సహకారం, మద్దతు తీసుకోవాలి
⇒ కోపాన్ని తగ్గించుకునేందుకు మద్యం, సిగరెట్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ వంటి వాటిని ఎప్పటికీ ఆశ్రయించవద్దు. ఇవన్నీ కూడా మానసికంగా మరింతగా క్షీణించేలా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment