వృద్ధాప్యంలోనూ చురుగ్గా వ్యవసాయ పనులు
ఆ పల్లెల్లో ఆరోగ్య సిరులు.. చిరుధాన్యాల ఆహారమే ఆరోగ్య రహస్యం
దరిచేరని బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు
సంగారెడ్డి జిల్లాలోని సిరిధాన్యాల సాగు గ్రామాల్లో ‘సాక్షి’ ఫీల్డ్ విజిట్
వందేళ్ల వయస్సులోనూ వ్యవసాయ పనులు..
ఆ పల్లెల్లో ఆరోగ్య సిరులు.. సిరిధాన్యాల ఆహారమే ఆరోగ్య రహస్యం
దరి చేరని బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు
కొనసాగుతున్న పాత పంటల జాతర
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి / జహీరాబాద్: జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు మూడు పదుల వయసు వచ్చేసరికే బీపీ, షుగర్, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ, కొన్ని గ్రామీణ ప్రాంతాలు నేటికీ ఆరోగ్య సిరులతో విలసిల్లుతున్నాయి. పది పదుల వయసు దాటిన వృద్ధులు సైతం నవ యువకుల్లా పనులు చేసుకుంటున్నారు. తమ ఆహారపు అలవాట్లే అందుకు కారణమని వారు చెబుతున్నారు.
చిరు ధాన్యం మహాభాగ్యం
డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) స్వచ్ఛంద సంస్థ 4 దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో 5 వేల మంది మహిళా రైతులను సంఘటితం చేసి సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. కొర్రలు, సామలు, అండుకొర్రలు, పచ్చ జొన్నలు, సాయిజొన్నలు, కంది, మినప, పెసర వంటి పంటలు సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. ఇందులో పోట్‌పల్లి, మోడ్ తండా గ్రామాలూ ఉన్నాయి.
ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సిరిధాన్యాల (మిల్లెట్స్)ను సాగు చేయడంతో పాటు, వాటినే నిత్యం ఆహారంగా తీసుకుంటున్న ఆ గ్రామాల వాసులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏటా జరిగే పాత పంటల జాతర నేపథ్యంలో ఝరాసంఘం మండలం పోట్‌పల్లి, జహీరాబాద్ మండలం మోడ్ తండా గ్రామాల్లో ‘సాక్షి’బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పాత పంటల జాతర
ఈ ప్రాంతంలో ఏటా నిర్వహించే పాత పంటల జాతర ఈ నెల 14న న్యాల్‌కల్ మండలంలోని వడ్డీ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్‌నూర్‌లో ముగుస్తుంది. జాతర 24 గ్రామాల్లో జరగనుంది. ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాధాన్యత గురించి ఈ జాతరలో ప్రచారం చేస్తున్నారు.
విలేజ్ ప్రొఫైల్స్..
గ్రామం: పోట్‌పల్లి (ఝరాసంఘంమండలం,సంగారెడ్డి జిల్లా)
జనాభా:2,263
ప్రధాన వృత్తి: వ్యవసాయం (సుమారు 90 శాతం) బీపీ, షుగర్ ఉన్నవారు సుమారు పదిమంది లోపే..
గ్రామం:మోడ్ తండా (జహీరాబాద్ మండలం,సంగారెడ్డి జిల్లా)
జనాభా: 192
ప్రధాన వృత్తి : వ్యవసాయం
బీపీ, షుగర్ ఉన్న వారు కేవలం ఇద్దరే.
వారికి రోగాలు తక్కువే..
పోట్‌పల్లి, ఎల్గొయ్ గ్రామాల్లో వ్యాధుల బారిన పడినవారి సంఖ్య చాలా తక్కువ. వీరు నిత్యం జొన్నరొట్టె, కందిపప్పుతో పాటు, కొర్రలు, సామలు తింటుంటారు. అందుకే వయసు మీదపడినా ఆరోగ్యంగా ఉంటున్నారు. – ఆలీస్, ఏఎన్‌ఎం, ఎల్గొయ్ సబ్ సెంటర్
అత్తల నుంచి కోడళ్లకు బదిలీ
చిరుధాన్యాల సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అత్తల నుంచి కోడళ్లకు వ్యవసాయాన్ని బదిలీ చేయించుకున్నాము. వేయి మందికి పైగా కోడళ్ల సంఘంలో సభ్యులు ఉన్నారు. భూమి కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో సాయిజొన్న పంట వేసుకున్నా.
–మొగులమ్మ, పోట్‌పల్లి, కోడళ్ల సంఘం అధ్యక్షురాలు
ఈయన పేరు బోంగూరు స్వామిదాసు. సంగారెడ్డి జిల్లా పోట్‌పల్లికి చెందిన స్వామిదాసు వయసు 75 ఏళ్లు. దశాబ్దాలుగా తన పొలంలో పాత పంటలు (మిల్లెట్స్) సాగు చేస్తూ, వాటినే ఆహారంగా తీసుకుంటుండటంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నానని చెబుతున్నారు. కొర్రబువ్వ, జొన్నరొట్టెను ఆహారంగా తీసుకుంటున్నానని చెప్పారు.
వందేళ్ల వయసు దాటిన ఈయన పేరు గర్మూనాయక్. భార్య జాలీబాయికి కూడా తొంౖభైæ ఏళ్లు ఉంటాయి. మోడ్ తండాకు చెందిన ఈ దంపతులు ఇప్పటికీ స్వయంగా మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్ననాటి నుంచి పచ్చజొన్న, సాయిజొన్న, సజ్జరొట్టెలు, తైద అంబలి, కంది, మినప పప్పు తినడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు.
ఇంటి ముందు సానుపు (కల్లాపి) చల్లుతున్న ఈ వృద్ధురాలు మన్నెల్లి దానమ్మ. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈమెకు సంతానం లేదు. ఇప్పటికీ తన పని తాను చేసుకుంటోంది. చిన్నప్పటి నుంచి కొర్రబువ్వ, సామలు, తైద అంబలి, సాయిజొన్న రొట్టెలు తినటం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment