
సుంకాలు విధిస్తే కష్టాలు తప్పవంటున్న పరిశ్రమ వర్గాలు
సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 350కి పైగా ఫార్మా కంపెనీలు
ఏటా రూ.22 వేల కోట్ల విలువైన ఎగుమతులు
ఎగుమతుల్లో అత్యధికం అమెరికాకే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలు రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమను వణికిస్తున్నాయి. ఫార్మా ఉత్పత్తులపైనా భారీగా సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఈ పరిశ్రమ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఫార్మా కంపెనీలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన యూనిట్లు ఇక్కడ ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. బల్క్ డ్రగ్ పరిశ్రమలు కూడా జిల్లాలో ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 350 పైచిలుకు ఫార్మా, బల్‌్కడ్రగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సుమారు 80 శాతం ఉత్పత్తులను అమెరికానే దిగుమతి చేసుకుంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఫార్మా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, తద్వారా పరిశ్రమల్లో పనిచేసే సుమారు 20 వేల మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి దెబ్బ తింటుందని అంచనా వేస్తున్నారు.
అయితే చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువేననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సుంకాలు పెరిగితే లాభాలు తగ్గుతాయని ఓ కంపెనీలోని హెచ్‌ఆర్ విభాగం ఉన్నతాధికారి తెలిపారు.
మల్టీనేషనల్ కంపెనీల యూనిట్లు
సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మల్టీనేషనల్ కంపెనీల యూనిట్లు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో ఎక్కువగా ఈ పరిశ్రమలు ఉన్నాయి. హానర్, గ్లెన్‌మార్క్, గ్రాన్యూల్, న్యూలాండ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెటిరో, ఎంఎస్‌ఎన్, దివీస్, సాయిల్యాబ్ సైన్సెస్, జీవీకే వంటి కంపెనీల యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రధానంగా బీపీ, డయాబెటిక్, గుండె జబ్బులు, గ్యాస్ట్రో, మైగ్రేన్, క్యాన్సర్, హెచ్‌ఐవీ రోగాలకు సంబంధించిన ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మందులను దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికానే ముందు వరుసలో ఉంది.
రూ.22 వేల కోట్ల ఎగుమతులు
ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న ఫార్మా వస్తు, సేవల విలువ సుమారు రూ.22 వేల కోట్లు ఉంటుందని అంచనా. 2023–24లో రూ.21,934 కోట్ల విలువైన ఎగుమతులు జరిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 87 శాతం ఫార్మా ఉత్పత్తులే. ఈ ఫార్మా ఉత్పత్తులను 70 శాతానికి పైగా అమెరికానే దిగుమతి చేసుకుంటుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.
సంగారెడ్డి తర్వాత మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఫార్మా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ జిల్లా నుంచి 2023–24లో వివిధ దేశాలకు రూ.25,444 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో 60 శాతం ఫార్మా ఉత్పత్తులే. అవి కూడా అమెరికానే ఎక్కువగా దిగుమతి చేసుకుందని సమాచారం.