
అన్ని గ్రామాల్లోనూ ఓపెన్ జిమ్‌లు
సద్వినియోగం చేసుకుంటున్నస్థానికులు
జీవనశైలి మారింది. మారుతున్న కాలంతో పాటు జీవనంలో వేగం పెరిగింది. దీంతో అలసట, ఒత్తిడి అధికమైంది. ఆహార పానీయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. వాటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరైంది. అందుకు ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
అక్కన్నపేట(హుస్నాబాద్): జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా గ్రామాల్లోనే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో దాదాపు అన్ని గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను నిర్మించారు. వాటి నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు కేటాయించారు. మండలంలో 31 గ్రామాలు ఉండగా ఇటీవల మరో ఆరు గ్రామాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మొత్తం 37 గ్రామాలు ఉన్నాయి.
అందులో సగానికిపైగా గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జిమ్‌లను ఉదయం, సాయంత్రం వినియోగించుకొంటున్నామని, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకొన్న మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు చెప్పారు.
కొత్త అనుభూతి
బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో కసరత్తు చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్తోమతలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకొంటున్నారు.