సిటీలైఫ్‌లో ఒత్తిడికి అభిరుచులే పరిష్కారం
విభిన్న రకాల హాబీస్ ద్వారా ఆరోగ్యలాభాలు
వయసులకతీతంగా సిటీజనులకు చేరువవుతున్న అభిరుచులు
వాస్తవమని నిర్ధారిస్తున్న వైద్యులు, అధ్యయనాలు
క్రాస్‌ఫిట్‌లో టైర్లను విసరడం, సుడోకు పజిల్‌ను పూర్తిచేయడం లేదా కిచెన్‌లో వండటం.. ఇలా నచి్చన హాబీని ఎంజాయ్ చేయడం కాలక్షేపం మాత్రమే కాదు అవి ఆరోగ్య క్షేమం కూడా అని వైద్యులు చెబుతున్నారు. న్యూజిలాండ్‌లోని ఒక అధ్యయనంలో సృజనాత్మకత వెలికితీసే కార్యకలాపాల్లో దీర్ఘకాలం పాటు పాల్గొనడం వల్ల రోగనిరోధకత పెరుగుతుందని కనుగొన్నారు. తమ హాబీల కోసం క్రమం తప్పకుండా సమయం వెచ్చించే వ్యక్తులు నిరాశకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని మానవ ఒత్తిడి హార్మోన్ కారి్టసాల్ స్థాయి తగ్గుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
డిమెన్షియాతో ఢీ.. డ్యాన్స్
శరీరానికీ.. ఇటు మనసుకు ఏకకాలంలో ఆరోగ్యాన్ని అందించే వాటిలో అత్యుత్తమమైంది డ్యాన్స్. అందుకే నగరంలో వయసులకు అతీతంగా దీనినే ఎంచుకుంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన కార్డియో వర్కవుట్‌గా ఎముకలు కండరాలను బలోపేతం చేయడానికి డ్యాన్స్ పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అనుకోకుండా తూలి పడిపోయే కొన్ని రకాల సమస్యలు నివారించడానికి డ్యాన్స్ ఉపకరిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లోని ఒక అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ డ్యాన్స్ రొటీన్ అనేది డిమెన్షియా వ్యాధి తీవ్రతను 76 శాతం తగ్గిస్తుంది.
గార్డెనింగ్.. గుండెకు మేలు..
తోటపనిలో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కలుపు మొక్కలను లాగడం, మొక్కలు నాటడం వంటి సాధారణ పనులన్నీ సూక్ష్మమైన ఏరోబిక్ వ్యాయామంలా కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆరుబయట చేసే తోటపని విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో గార్డెనింగ్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 30 శాతం తగ్గుతుందని తేలింది.
పెట్స్.. హార్ట్ బీట్స్
శునకాల వంటి పెంపుడు జంతువులు అద్భుతమైన సహచరులు కాగలవు. వాటితో గడిపే సమయం మరింత ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. పెట్స్ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి.
అవుట్ డోర్.. ఫీల్‌గుడ్..
హైకింగ్ నుంచి గార్డెనింగ్ వరకు, అవుట్‌డోర్ హాబీలు శారీరకంగా మానసికంగా సమతుల్యతతో ఉండేందుకు సహాయపడతాయి. మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫీన్ అనే రసాయనాలను శరీరంలో విడుదల చేస్తాయి. అలాగే చర్మంపై సూర్యరశ్మి మానసిక స్థితిని మెరుగుపరిచే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
చిత్రకళ.. కంటిచూపు భళా..
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ప్రచురించిన అధ్యయనం పెయింటింగ్ మన దృష్టిని మెరుగుపరుస్తుందని కనుగొంది. పెన్సిల్, వాటర్ కలర్ పెయింట్‌ల సెట్, పెయింట్ బ్రష్‌లు స్కెచ్‌బుక్‌లతో పాటు రంగులు కలపడానికి పేపర్ ప్లేట్ కాన్వాస్‌ను సమకూర్చుకుంటే చాలు రంగులతో ఆడుకోవచ్చు.. కంటిచూపు మెరుగు పర్చుకోవచ్చు.
సంగీతం.. ఔషధం..
సంగీతం పలికించడం లేదా వినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంగీతం రోగనిరోధక శక్తిని పెంచి ‘ఒత్తిడి హార్మోన్’ కారి్టసాల్‌ను తక్కువ స్థాయికి చేరుస్తుంది. దీనితో ఆందోళన స్థాయిలను, నిరాశను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల్లో మందుల కంటే సంగీతం వినడం ఆందోళనను తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది.
గాయాలను మాన్పే ‘రచనా’వ్యాసంగం..
జ్ఞాపకశక్తి పెంచడం, ఒత్తిడి స్థాయి తగ్గించడం, మంచి నిద్ర వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను వ్యస రచన అందిస్తుంది. అంటే కథలు, వ్యాసాలు రాయాలనే అనుకోవద్దు. కేవలం తమ అనుభవాల గురించి రాయడం కేన్సర్ రోగులు కోలుకోవడానికి సహాయపడిందని అధ్యయ నాలు వెల్లడించాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం రాయడం ద్వారా గాయాలు త్వరగా నయమవుతాయని తేలింది.
పఠనంతో.. ప్రశాంతత..
‘చదవడానికి సమయం వెచ్చించడం మనస్సును తేలికగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతికూల అనుచిత ఆలోచనల నుంచి మనస్సును దూరంగా ఉంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. పఠనాసక్తిని సజీవంగా ఉంచుకుంటే నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది.
హాబీస్ ద్వారా ఫీల్‌గుడ్ హార్మోన్స్..
డబ్లు్యహెచ్‌ఓ ప్రకారం ఆరోగ్యం అంటే శారీరకం, మానసికం, భావోద్వేగాలతో సహా అన్నింటినీ సరైన తీరులో ఉంచుకుంటేనే సమగ్రమైన ఆరోగ్యం. శాస్త్రీయంగా అధ్యయనాలు నిరూపించిన అంశం ఇది. శారీరకమైన ఆరోగ్యం కోసం నృత్యం, వాకింగ్, డ్యాన్స్ ఎరోబిక్స్, గార్డెనింగ్.. వంటివి అదేవిధంగా మానసిక ఆరోగ్యం కోసం సంగీతం, సినిమాలు, పుస్తక పఠనం.. వాటితో పాటు భావోద్వేగ భరిత ఆరోగ్యం కోసం సన్నిహితులతో కలిసి విందు, వినోదాలు, పారీ్టలు వంటివన్నీ వస్తాయి. ఒక తీవ్రమైన ఒత్తిడి తర్వాత తప్పనిసరిగా దాన్ని తొలగించే చక్కని హాబీని ఆస్వాదించడం అవసరం. ఉదాహరణకు ఓ సర్జన్‌గా నేను ఏదైనా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసిన తర్వాత నాకు బాగా ఇష్టమైన మంచి మ్యూజిక్ తప్పనిసరిగా వింటాను. మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందించే హాబీల వల్ల ఫీల్‌గుడ్ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అవి ఇమ్యూనిటీ లెవల్స్‌ని పెంచుతాయి. తద్వారా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కునే శక్తిని అందిస్తాయి.
– డా. కిషోర్‌రెడ్డి, అమోర్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment