యాంటీబ‌యాటిక్స్ ఎలా పడితే అలా వాడొద్దు | World Antimicrobial Resistance Awareness Week 2024 | Sakshi
Sakshi News home page

యాంటీబ‌యాటిక్స్ ఎలా పడితే అలా వాడొద్దు

Published Sun, Nov 24 2024 3:41 PM | Last Updated on Sun, Nov 24 2024 3:48 PM

World Antimicrobial Resistance Awareness Week 2024
  • వాటివ‌ల్ల యాంటీమైక్రోబ‌య‌ల్ రెసిస్టెన్స్ వ‌చ్చే ప్ర‌మాదం
  • మందుల దుకాణానికి వెళ్లి కొనుక్కుని వాడ‌డం ప్రమాద‌క‌రం
  • ప్ర‌పంచ యాంటీమైక్రోబ‌య‌ల్ అవ‌గాహ‌న వారోత్స‌వం
  • ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి మైక్రోబ‌య‌లాజిస్ట్ డాక్ట‌ర్ ఆర్సీ బిలోరియా సూచ‌న‌

హైద‌రాబాద్: కాస్త ద‌గ్గు వ‌స్తున్నా, గొంతులో ఇబ్బంది అనిపించినా, జ్వ‌రం త‌గ్గ‌క‌పోయినా చాలామంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి త‌మ‌కు తెలిసిన‌, లేదా షాపు వాళ్లు ఇచ్చిన యాంటీ బ‌యాటిక్స్ కొనుక్కుని వాడేస్తారు. పైగా అది కూడా పూర్తి కోర్సు కాకుండా ఒక‌టి లేదా రెండు రోజులు వాడి మానేస్తారు. దీనివ‌ల్ల ఇక యాంటీబ‌యాటిక్స్ అనేవి వివిధ ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియా, ఫంగై, ప‌రాన్న జీవుల మీద ప‌నిచేయ‌డం మానేస్తాయి. దీన్నే యాంటీమైక్రోబ‌య‌ల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ప్ర‌పంచ యాంటీమైక్రోబ‌య‌ల్ అవ‌గాహ‌న వారోత్స‌వాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తియేటా న‌వంబ‌ర్ 18 నుంచి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఏఎంఆర్ గురించి ప్ర‌జ‌లు, వైద్యులు, ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో అవ‌గాహ‌న పెంచి, ఏఎంఆర్ మ‌రింత విస్త‌రించ‌కుండా నియంత్రించ‌డానికి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఈ వారోత్స‌వాల నేప‌థ్యంలో ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన‌ మైక్రోబ‌య‌లాజిస్ట్ డాక్ట‌ర్ ఆర్సీ బిలోరియా ఈ విష‌యం గురించి మీడియాతో మాట్లాడుతూ ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఏఎంఆర్ వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు, వ్యాధులు విప‌రీతంగా వ్యాపించే ప్ర‌మాదం ఉంటుంది. ప‌లుర‌కాల యాంటీబ‌యాటిక్స్‌కు లొంగ‌ని జీవుల‌ను మ‌ల్టీడ్ర‌గ్ రెసిస్టెంట్ జీవులు లేదా సూప‌ర్ బ‌గ్స్ అంటారు. ప్ర‌పంచంలోని టాప్10 ఆరోగ్య ముప్పుల్లో ఒక‌టిగా ఏఎంఆర్‌ను ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ప్ర‌క‌టించింది. 1990 నుంచి ప్ర‌తియేటా సుమారు 10 ల‌క్ష‌ల మంది ఏఎంఆర్ వ‌ల్ల మ‌ర‌ణిస్తున్నారు. ఇప్పటికీ స‌రైన చ‌ర్య‌లు తీసుకుని దీన్ని నియంత్రించ‌క‌పోతే ఇప్ప‌ట్నుంచి 2050 మ‌ధ్య 4 కోట్ల మంది ఇన్ఫెక్ష‌న్ల‌తో మ‌ర‌ణిస్తార‌ని గ్లోబ‌ల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబ‌య‌ల్ రెసిస్టెన్స్ ప‌రిశోధ‌నలో తేలింది. ఏఎంఆర్ వ‌ల్ల చికిత్స స‌మ‌ర్థ‌త త‌గ్గుతుంది, రోగులు ఆస్ప‌త్రిలో.. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండాలి. వైద్యం ఖ‌ర్చు పెరిగిపోతుంది, ఒక‌రి నుంచి మ‌రొక‌రికి మ‌ల్టీడ్ర‌గ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

యాంటీబ‌యాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడ‌డ‌మే ఏఎంఆర్‌కు ప్ర‌ధాన కార‌ణం. వైద్యులు చెప్ప‌కుండా త‌మంత‌ట తామే మందుల దుకాణాల‌కు వెళ్లి ఏదో ఒక యాంటీబ‌యాటిక్ కొని తెచ్చుకుని పూర్తికాలం వాడ‌క‌పోవ‌డం ఇక‌నైనా మానుకోవాలి. ఏర‌కం స‌మ‌స్య‌కు ఏ యాంటీబ‌యాటిక్ వాడాలో వైద్యులు సూచిస్తారు. వాటిని అదే మోతాదులో వాళ్లు చెప్పిన‌న్ని రోజులు వాడాలి. దీనివ‌ల్ల భావిత‌రాల‌కు ప్రాణాలు కాపాడే యాంటీబ‌యాటిక్స్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లవుతుంది. లేక‌పోతే అవి ఇక ప‌నిచేయ‌డం పూర్తిగా మానేస్తాయి. వైద్యులు రాయ‌క‌పోతే మీరు డిమాండ్ చేసి మ‌రీ యాంటీబ‌యాటిక్స్ రాయించుకోవ‌ద్దు. మిగిలిపోతున్నాయ‌ని చెప్పిన‌న్ని రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు వాడొద్దు. వేరేవారికి రాసిన మందులు మ‌నం వాడ‌డం మంచిది కాదు. దానివ‌ల్ల వ్యాధి పెరిగి, దుష్ప్ర‌భావాలు కూడా క‌ల‌గొచ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు చేతులు స‌బ్బు, నీళ్ల‌తో శుభ్రం చేసుకోవాలి. ద‌గ్గినా, తుమ్మినా చేతులు గానీ క‌ర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి. ఎక్కువ మంది జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, బ్రాంకైటిస్, ఆయాసం, గొంతునొప్పి లాంటివాటికి యాంటీబ‌యాటిక్స్ కొనుక్కుని వాడేస్తారు.

కొంద‌రు రోగులు త‌మ ఆర్థిక ప‌రిస్థితి కార‌ణంగా పూర్తి కోర్సు వాడ‌కుండా కొంతే తీసుకుంటారు. అలాగే ఆస్ప‌త్రిలో కూడా పూర్తి కాలం ఉండానికి త‌గినంత డ‌బ్బు లేక ముందే డిశ్చార్జి అయిపోతారు. కానీ దీనివ‌ల్ల కూడా ఇన్ఫెక్ష‌న్లు పూర్తిగా తగ్గ‌కుండా.. యాంటీబ‌యాటిక్స్ వాడినా లొంగ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

జ‌లుబు అనేది వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్‌. దాంతోపాటు వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే డ‌యేరియా కూడా దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. యాంటీబ‌యాటిక్స్ అనేవి బ్యాక్టీరియా మీద ప‌నిచేస్తాయి గానీ వైర‌స్‌ల మీద ప్ర‌భావం చూపించ‌వు. అందువ‌ల్ల జ‌లుబు, డ‌యేరియాల‌కు ఇవి వాడ‌కూడ‌దు. చాలావ‌ర‌కు బ్యాక్టీరియాల‌ను టీకాలు నిరోధిస్తాయి. టీకాలు తీసుకుంటే ఇక చాలావ‌ర‌కు యాంటీబ‌యాటిక్స్ వాడాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement