ఫోన్ పోయింది/ఆగిపోతుందనే భయాలు
గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటే భయం
పెరుగుతున్న ఫోబియా బాధితుల సంఖ్య
‘మొబైల్’ ఫోబియాపై నిపుణుల ఆందోళన
పలు అధ్యయన ఫలితాల్లో వెల్లడి
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్‌ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్‌తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్‌పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.
ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరో
అప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కారణం ఏదైనా సరే.. మన ఫోన్‌కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్‌ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు.
మితమే హితం..
డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్‌లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంపై దు్రష్పభావం..
నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్‌ఫోన్‌లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్‌డేట్‌లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.
అధ్యయన విశేషాలివీ..
– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్‌లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్‌లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.
– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్‌కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.
– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.
– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.
– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.
సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్‌ఫోన్‌లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment