సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు
దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు.
దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు.
జాగ్రత్తలే శ్రీరామరక్ష...
- గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది.
- ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి.
- దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.
స్వైన్‌ఫ్లూ లక్షణాలు...
- తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది.
- పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్‌లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది.
- ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment