ముంబై: వరుసగా రెండేళ్ల పాటు తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ(Private equity), వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గతేడాది మళ్లీ కొంత మెరుగయ్యాయి. 2024లో 5 శాతం పెరిగి 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, అనేక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది పెట్టుబడులకు సవాళ్లు ఎదురుకావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
‘అమెరికా నూతన ప్రభుత్వం తన పాలసీలను ఇంకా పూర్తిగా వెల్లడించాల్సి ఉంది. ఇవి అంతర్జాతీయంగా వాణిజ్యం, ఎగుమతులు, కరెన్సీ, క్రూడాయిల్ ధరలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. దీనితో భారత స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడొచ్చు’ అని ఈవై పార్ట్‌నర్ వివేక్ సోని తెలిపారు. దేశీయంగా వినియోగం నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2024లో పీఈ, వీసీ ఫండ్‌ల ఒప్పందాలు 54 శాతం పెరిగి 1,352గా నమోదయ్యాయి.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌పై ఎస్‌బీఐ అంచనాలు
నివేదికలోని మరిన్ని విశేషాలు..
మౌలిక సదుపాయాలు, రియల్టీలో గతేడాది పెట్టుబడులు స్వల్పంగా 3 శాతం క్షీణించాయి. 2023లో 21.5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
2023లో 1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ 6 నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ 9.6 బిలియన్ డాలర్లు. గతేడాది బిలియన్ డాలర్ల ఒప్పందాలు 4 కుదరగా, వీటి మొత్తం విలువ 6.1 బిలియన్ డాలర్లు. ఏటీసీ ఇండియా టవర్ కార్పొరేషన్‌ను బ్రూక్‌ఫీల్డ్‌కి చెందిన డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం.. గతేడాది నమోదైన అతి పెద్ద డీల్.
మదుపరుల నిష్క్రమణకు సంబంధించి 26.7 బిలియన్ డాలర్ల విలువ చేసే 282 డీల్స్ నమోదయ్యాయి. 2023లో ఈ పరిమాణం 24.9
బిలియన్ డాలర్లు.2023లో 95 ఫండ్లు 15.9 బి. డాలర్ల నిధులు సమీకరించగా 2024లో ఇది 34 శాతం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment