private equity deal
-
కోవిడ్‌లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్
ముంబై: దేశీయంగా కోవిడ్-19 సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నప్పటికీ ఏప్రిల్‌లో రికార్డ్ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు, కంపెనీల కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ) విషయంలో గత నెలలో మొత్తం 161 డీల్స్ కుదిరాయి. ఏ నెలను తీసుకున్నా గత దశాబ్ద కాలంలో ఇవి అత్యధికంకాగా.. వీటి విలువ 13 బిలియన్ డాలర్లుకావడం విశేషం! అంటే సుమారు రూ. 96,200 కోట్లు!! గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్టన్ నివేదిక ప్రకారం ఏప్రిల్‌లో దేశీయంగా ఎంఅండ్ఏ విభాగంలో అత్యధికంగా 30 లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 37,000 కోట్లు(5 బిలియన్ డాలర్లు). రెట్టింపునకు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన 2020 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో డీల్స్ సంఖ్య రెట్టింపునకు ఎగసింది. మొత్తం డీల్స్ విలువలో సైతం 50 శాతం వృద్ధి నమోదైనట్లు గ్రాంట్ థార్టన్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్లకు తెరలేవడం, కరోనా వైరస్ సోకిన కేసులు అత్యంత వేగంగా పెరిగిపో తుండటం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒప్పందాలు జోరందుకోవడం గమనార్హం. మరోవైపు సరికొత్త రికార్డులను తాకుతున్న కోవిడ్–19 కేసులు ఆర్థిక రికవరీని దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడి దొడుకులు ఎదుర్కొన్నప్పటికీ పటిష్ట లాభాలతో కదులుతుండటం ఆశ్చర్యకరమన్నారు. మార్చితో పోలిస్తే ఈ(2021) మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఒప్పందాల సంఖ్య 18 శాతం పుంజుకోగా.. వీటి విలువ ఏకంగా 174 శాతం ఎగసినట్లు నివేదిక తెలియజేసింది. మొత్తంగా గత నెలలో ఎంఅండ్ఏ విభాగంలో 42 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 5.5 బిలియన్ డాలర్లు. అయితే గతేడాది ఏప్రిల్‌లో 5.7 బిలియన్ డాలర్ల విలువైన ఫేస్బుక్-జియో ప్లాట్‌ఫామ్స్ డీల్ కారణంగా కొనుగోళ్లు, విలీనాల విభాగం డీల్స్ విలువ 30 శాతం క్షీణించినట్లు లెక్క. ఈ డీల్‌ను మినహాయిస్తే.. 2021 ఏప్రిల్ డీల్స్ విలువ 2.5 రెట్లు ఎగశాయని నివేదిక వివరించింది. మొత్తం ఎంఅండ్ఏ డీల్స్‌లో దేశీ వాటా 91 శాతంకాగా.. విలువరీత్యా 76 శాతాన్ని ఆక్రమించాయి. పీఈ సైతం.. ఈ ఏప్రిల్‌లో పీఈ పెట్టుబడులు జోరందుకున్నాయి. మొత్తం 119 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్ల(రూ. 56,240 కోట్లు)ను ఇన్వెస్ట్ చేశాయి. 2011 తదుపరి ఇప్పటివరకూ ఏ నెలలోనైనా ఇవే గరిష్టం! గత నెలలో ఐదు స్టార్టప్, ఈకామర్స్ కంపెనీలు యూనికార్న్ క్లబ్లో చేరాయి. తద్వారా దేశీ స్టార్టప్ వ్యవస్థ సైతం కొత్త చరిత్రకు నెలవైంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఈకామర్స్, ఎడ్యుకేషన్, తయారీ, ఇంధనం, సహజ వనరులు రంగాలు గరిష్ట పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. చదవండి: అగ్రి స్టార్టప్స్.. దున్నేస్తున్నాయ్! -
బ్లాక్ స్టోన్ చేతికి ఎంఫసిస్
♦ మెజారిటీ వాటా కొనుగోలుకు ఒప్పందం.. ♦ 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ కూడా... ♦ డీల్ మొత్తం విలువ రూ.7,071 కోట్ల వరకూ ఉండే అవకాశం ♦ దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ డీల్‌గా రికార్డు ముంబై: దేశీ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకోనుంది. ప్రస్తుతం ఎంఫసిస్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్(హెచ్‌పీఈ) నుంచి 60.5 శాతం పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం బ్లాక్‌స్టోన్ ప్రకటించింది. ఇందుకోసం ఒక్కోషేరుకి రూ. 430 చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనడానికి వీలుగా ఓపెన్ ఆఫర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి షేరు ధర రూ.457.5గా ఉంటుందని బ్లాక్‌స్టోన్ పేర్కొంది. ఓపెన్ ఆఫర్‌ను సబ్స్క్రయిబ్ అయ్యేదాన్నిబట్టి చూస్తే.. బ్లాక్ స్టోన్ ఈ కొనుగోలు కోసం రూ.5,466 కోట్ల నుంచి రూ.7,071 కోట్ల వరకూ వెచ్చించనుంది. దేశీయంగా చూస్తే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) డీల్‌గా ఇది రికార్డుకెక్కనుంది. హెచ్‌పీ నుంచి భారీ కాంట్రాక్టు... ఒప్పందంలో భాగంగా ఎంఫసిస్... హెచ్‌పీ నుంచి 11 ఏళ్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు బ్లాక్‌స్టోన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్ అమిత్ దీక్షిత్ కాన్ఫరెన్స్ కాల్లో విలేకరులకు తెలిపారు. వచ్చే ఐదేళ్లపాటు ఎంఫసిస్ నుంచి 90 కోట్ల డాలర్ల విలువైన (దాదాపు రూ.6,000 కోట్లు) ఐటీ సేవలను హెచ్‌పీ పొందనుందని వెల్లడించారు. విలువ రూ. 82.5 కోట్ల డాలర్లు డీల్ ప్రకారం తమ వాటా విలువ 82.5 కోట్ల డాలర్లుగా ఉంటుందని హెచ్‌పీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీతో తమ వాణిజ్య బంధంపై ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపబోదని కూడా తెలిపింది. టాప్ మేనేజ్మెంట్లో మార్పులుండవు... బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మధ్యస్థాయి ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను దక్కించుకోవడం కోసం దేశీ ఐటీ సేవల దిగ్గజం టెక్మహీంద్రాతో పాటు ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కూడా రేసులో పోటీపడ్డాయి. చివరకు బ్లాక్‌స్టోన్ చేతికి చిక్కింది. గడిచిన దశాబ్ద కాలంలో బ్లాక్‌స్టోన్ భారత్‌లోని పీఈ డీల్స్, రియల్టీ లావాదేవీల్లో 6 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించింది. ఐటీ పరిశ్రమ వృద్ధి అవకాశాలు చాలా బాగున్నాయని దీక్షిత్ అంటూ అందుకే ఇప్పుడు ఎంఫసిస్‌తో కలిపి మూడు కంపెనీల్లో(మిగతా రెండూ బీపీఓ సంస్థ ఇంటెలినెట్, ఐబీఎస్ సాఫ్ట్వేర్) మొత్తం 1.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టామని చెప్పారు. ఎంఫసిస్కు ఇప్పుడున్న నాయకత్వ బృందమే అతిపెద్ద బలమని.. టాప్ మేనేజ్మెంట్ను యథాతథంగా కొనసాగించనున్నట్లు దీక్షిత్ వెల్లడించారు. ఎంఫసిస్ సంగతిదీ... ♦ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఎంఫసిస్ కార్పొరేషన్‌ను తొలుత అమెరికాలో శాంటా మోనికా, జెర్రీ రావు, జెరోన్ టాస్ అనే ముగ్గురు కలసి 1998లో స్థాపించారు. ♦ 1992లో ఏర్పాటైన భారతీయ ఐటీ సేవల కంపెనీ బీఎఫ్ఎల్ సాఫ్ట్‌వేర్‌ను 2000 సంవత్సరంలో విలీనం చేసుకోవడం ద్వారా ఇప్పుడున్న ఎంఫసిస్ ఆవిర్భవించింది. ♦ 2006లో ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్ 42 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అనుబంధ సంస్థగా మార్చింది. ♦ 2008లో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ ఈడీఎస్ నుంచి ఎంఫసిస్‌ను చేజిక్కించుకుంది. ♦ దేశంలో ఏడో పెద్ద ఐటీ కంపెనీగా ఎంఫసిస్ నిలుస్తోంది. ♦ ఎంఫసిస్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో దాదాపు 3 శాతం క్షీణించి రూ. 454 వద్ద ముగిసింది. ఉద్యోగులు, మా మొత్తం మేనేజ్మెంట్ టీమ్‌కు ఈ డీల్ చాలా ఉత్సాహాన్నిచ్చింది. సంస్థ భవిష్యత్తు వృద్ధి జోరు, స్థిరత్వానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇక హెచ్‌పీలో నేను 20 ఏళ్లకుపైగానే పనిచేశా. ఇప్పుడు ఎంఫసిస్తోనూ ఏడున్నరేళ్ల అనుబంధం ఉంది. - గణేశ్ అయ్యర్, ఎంఫసిస్ సీఈఓ