
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్‌లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్‌డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి.
ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోత
టాప్–10 డీల్స్ హవా
తొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్‌హౌసింగ్ డీల్‌ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్‌స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment