private equity
-
అంకురాలకు తగ్గుతున్న ఆదరణ.. కానీ..
ముంబై: అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై మాత్రం ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దేశీ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రైవేట్ పెట్టుబడులను విశ్లేషించే వెంచర్ ఇంటెలిజెన్స్, పరిశ్రమ సమాఖ్య ఐవీసీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది (2022లో) 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే గతేడాది 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248కి, పరిమాణం 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, నిధుల ప్రవాహం మందగించడం తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో మరింత భారీగా పెట్టుబడులు రాగలవని ఐవీసీఏ (ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రజత్ టాండన్ తెలిపారు. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య తగ్గినా భారీ స్థాయి పెట్టుబడులు రావడమనేది గణనీయమైన విలువను, స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడాన్ని సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్‌లో మణిపాల్ హాస్పిటల్లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. తదుపరి జూన్‌లో హెచ్డీఎఫ్సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి. ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్‌లో అవాడా వెంచర్స్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్‌ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్‌కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది. ► రంగాలవారీగా పరిశీలించినప్పుడు హెల్త్‌కేర్.. లైఫ్ సైన్సెస్‌లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 30.2 శాతం పెరిగాయి. అలాగే ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్‌లో (199.8 శాతం) ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. ► ఐటీ..ఐటీఈఎస్ రంగంలో పెట్టుబడులు 64.5 శాతం క్షీణించాయి. అలాగే బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా)లోకి 47.6 శాతం, తయారీలోకి 43 శాతం, ఇంజినీరింగ్.. నిర్మాణ రంగాల్లోకి 64 శాతం మేర ఇన్వెస్ట్మెంట్లు పడిపోయాయి. షిప్పింగ్ .. లాజిస్టిక్స్‌లోకి 60.6 శాతం, విద్యా రంగంలోకి 78.4 శాతం, ఎఫ్ఎంసీజీలో 48.5 శాతం, అగ్రి బిజినెస్‌లోకి 81 శాతం, ఫుడ్ అండ్ బెవరేజెస్లోకి 70 శాతం, టెలికంలోకి 84 శాతం పెట్టుబడులు క్షీణించాయి. ఇదీ చదవండి: 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. ► టాప్ పీఈ నిష్క్రమణలను చూస్తే.. టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా.. ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను వాల్‌మార్ట్‌కు 1.78 బిలియన్ డాలర్లకు విక్రయించాయి. లెన్స్‌కార్ట్‌లో ఇన్వెస్టర్లు షిరాటే వెంచర్స్, ప్రేమ్‌జీఇన్వెస్ట్, యునీలేజర్ వెంచర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, టీఆర్ క్యాపిటల్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎపిక్ క్యాపిటల్ తమ వాటాలను అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 410 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ ఇన్వెస్టర్లు సోఫినా, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్, ఫైర్‌సైడ్ వెంచర్స్, షార్ప్ వెంచర్స్ .. పబ్లిక్ ఇష్యూలో తమ వాటాలను విక్రయించి 133 మిలియన్ డాలర్లు సమీకరించాయి. -
ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ కేలండర్ ఏడాది(2023) మూడో త్రైమాసికంలో 65 శాతం క్షీణించాయి. 1.81 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2022) జులై–సెప్టెంబర్(క్యూ3)లో ఏకంగా 5.23 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజీ గ్రూప్ బిజినెస్ సంస్థ రెఫినిటివ్ వివరాల ప్రకారం లావాదేవీలు సైతం భారీగా 50 శాతం నీరసించాయి. 465 నుంచి భారీగా తగ్గి 232కు పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ2)లో నమోదైన 353తో పోలిస్తే డీల్స్ 34 శాతం వెనకడుగు వేయగా.. విలువ(2.79 బిలియన్ డాలర్లు) 35 శాతం క్షీణించింది. కాగా.. 2023 జనవరి–సెప్టెంబర్‌లో డీల్స్ 414 నుంచి 283కు తగ్గాయి. ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలలో 2.8 బిలియన్ డాలర్లు, ఐటీ సంస్థలలో 1.48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు తొలి త్రైమాసికానికి(ఏప్రిల్–జూన్) స్వల్పంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) క్యూ1లో 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అధిక వడ్డీ రేట్లు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఫ్లక్స్ క్యూ1 పేరిట విడుదల చేసిన నివేదికలో రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. గతేడాది(2022–23) క్యూ1లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదైనట్లు తెలియజేసింది. అయితే నివేదిక ప్రకారం అంతక్రితం మూడేళ్లలో ఇంతకంటే తక్కువ పెట్టుబడులు నమోదుకావడం గమనార్హం! దేశ రియల్టీ రంగంలోకి 2022 క్యూ1లో 1.4 బిలియన్ డాలర్లు, 2021 క్యూ1లో 0.2 బిలియన్ డాలర్లు, 2020 క్యూ1లో 1.7 బిలియన్ డాలర్లు చొప్పున పీఈ పెట్టుబడులు ప్రవేశించాయి. కాగా.. తాజా పీఈ పెట్టుబడుల్లో విదేశీ సంస్థల నుంచి 94 శాతం లభించడం గమనార్హం! దేశీ ఫండ్స్ వాటా 6 శాతమేనని నివేదిక వెల్లడించింది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ రూపేణా 94 శాతం నిధులు సమకూరినట్లు తెలియజేసింది. -
తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత్‌లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహం మే నెలలో తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే గత నెలలో 44 శాతం, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 52 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. 3.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022 మే నెలలో ఇవి 6.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ లాబీ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చాలా మటుకు ఫండ్స్ గత ఏడాదిన్నరగా పుష్కలంగా నిధులు సమీకరించినప్పటికీ వాటిని ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. వృద్ధి, మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత పోర్ట్‌ఫోలియో కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. పెట్టుబడులపరంగా టెక్ రంగంలో కాస్త స్తబ్దత నెలకొందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆరి్థక సేవల విభాగాల్లోకి కాస్త పెట్టుబడులు వచి్చనట్లు సోని వివరించారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే పెట్టుబడుల ప్రవాహం ఆశావహంగానే కనిపిస్తోందని, 2023లో మొత్తం పెట్టుబడులు గతేడాది కన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► మే నెలలో మొత్తం 71 లావాదేవీలు జరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే 42 శాతం తగ్గాయి. ► వృద్ధి దశలోని సంస్థల్లో పెట్టుబడులు 4 శాతం తగ్గాయి. 17 డీల్స్ కుదరగా 1.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మే లో 19 ఒప్పందాలు కుదరగా, 2 బిలియన ్డాలర్లు వచ్చాయి. ► రియల్ ఎస్టేట్‌పై ఫండ్స్ అత్యధికంగా ఆసక్తి చూపాయి. ఏడు డీల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2022 మే నెలలో 12 డీల్స్ ద్వారా 1.1 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. 864 మిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15 డీల్స్‌తో టెక్నాలజీ రంగం రెండో స్థానంలో నిల్చింది. ఈ రంగంలో పెట్టుబడులు 159 శాతం పెరిగాయి. ► ఫండ్స్ గతేడాది మేలో 745 మిలియన్ డాలర్లు సమీకరించగా.. ఈసారి 2.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం.. భారత్‌లో తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
ముంబై: దేశయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో 4 శాతం నీరసించాయి. 5.3 బిలియన్ డాలర్లకు(రూ. 43,460 కోట్లు) పరిమితమయ్యాయి. 2022 మార్చితో పోలిస్తే లావాదేవీలు సైతం 125 నుంచి 82కు క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిన అంశాలివి. వీటి ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో డీల్స్ 21 శాతం తగ్గాయి. పెట్టుబడుల విలువ 13.3 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) దివాలా అనిశ్చితికి దారితీసినట్లు ఈవై పార్టనర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు నిధుల లభ్యత కఠినతరమైనట్లు తెలియజేశారు. అనిశ్చిత వాతావరణంలో స్టార్టప్‌ల విభాగంలో కన్సాలిడేషన్‌కు తెరలేచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. నగదు అధికంగా ఖర్చయ్యే కంపెనీలు నిధుల సమీకరణలో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. వెరసి సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు వంటివి నమోదుకావచ్చని తెలియజేశారు. ప్రధానంగా వాటాల మార్పిడి(షేర్ల స్వాప్) ద్వారా బిజినెస్‌లు, కంపెనీల విక్రయాలు జరిగే అవకాశమున్నట్లు వివరించారు. ధరల వ్యత్యాసం.. గత నెలలో డీల్స్ నీరసించడానికి కారణాలున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రమోటర్లు ఆశించే ధర, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన బిడ్స్ మధ్య వ్యత్యాసాలు ప్రభావం చూపినట్లు తెలియజేసింది. 2023 మార్చిలో 10 కోట్లకుపైగా విలువగల 14 భారీ డీల్స్ జరిగాయి. వీటి విలువ 4.3 బిలియన్ డాలర్లు. 2022 మార్చిలో 2.9 బిలియన్ డాలర్ల విలువైన 13 లార్జ్ డీల్స్ నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో గ్రీన్కో ఎనర్జీలో జీఐసీ, ఏడీఐఏ, ఓరిక్స్ చేపట్టిన 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూసీ పార్టనర్స్1.3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. పైప్ జోరు విలువరీత్యా గత నెలలో పబ్లిక్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రయివేట్ ఇన్వెస్ట్మెంట్(పీఐపీఈ–పైప్) జోరు చూపాయి. 10 డీల్స్ ద్వారా 2.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మార్చిలో 8 లావాదేవీల ద్వారా 70 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో మౌలికరంగం మొత్తం పెట్టుబడులను ఆకట్టుకుంది. ఇక ఈ మార్చిలో 1.75 బిలియన్ డాలర్ల విలువైన 30 అమ్మకపు(ఎగ్జిట్) లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ టాప్‌లో నిలిచింది. మరోవైపు మూడు డీల్స్ ద్వారా 1.95 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ జరిగింది. 2022 మార్చిలో దాదాపు 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే సమకూర్చుకున్నాయి. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్ధిక సంవత్సరం(2022–23)లో దేశీ రియల్టీ రంగంలోకి 4.2 బిలియన్ డాలర్ల(రూ. 34,440 కోట్లు) ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో 22 శాతం నిధులను దేశీ ఇన్వెస్టర్లు అందించగా.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి 75 శాతానికిపైగా లభించాయి. కాగా.. అంతక్రితం ఏడాది(2021–22)లోనూ రియల్టీలోకి 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులే ప్రవహించాయి. వెరసి గతేడాది పీఈ పెట్టుబడులు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. మార్చితో ముగిసిన గతేడాదికి ఫ్లక్స్ పేరిట రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ జోరు మొత్తం రియల్టీ పెట్టుబడుల్లో ఢిల్లీ– ఎన్సీఆర్ మార్కెట్లోకి అత్యధికంగా 32 శాతం ప్రవహించాయి. ఇవి 2021–22తో పోలిస్తే 18 శాతం అధికం. కార్యాలయ ఆస్తులకు 40 శాతం పెట్టుబడులు లభించాయి. పెట్టుబడుల్లో చెన్నై వాటా 7 శాతం ఎగసి 8 శాతానికి చేరగా.. బెంగళూరు, హైదరాబాద్ సైతం అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో ఈక్విటీ మార్గం 80 శాతం నుంచి 67 శాతానికి నీరసించింది. పెట్టుబడుల తీరిలా 2020–21లో దేశీ రియల్టీలోకి భారీగా 6.3 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు ప్రవహించాయి. అంతకుముందు అంటే 2019–20లో 6.3 బిలియన్ డాలర్లు, 2018–19లో 5.3 బిలియన్ డాలర్ల చొప్పున లభించడం గమనార్హం! గతేడాది పెట్టుబడుల్లో దేశీ ఇన్వెస్టర్ల వాటా 8% బలపడింది. 2021–22లో 14%గా నమోదుకాగా.. 2022– 23లో 22 శాతానికి ఎగసింది. రెసిడెన్షియల్ రియల్టీలో కార్యకలాపాలు వేగవంతం కావడంతో సగటు టికెట్ పరిమాణం 7.2 కోట్ల డాలర్లకు నీరసించింది. 2022లో 8.6 కోట్ల డాలర్లుగా నమోదైంది. -
ఎంఎఫ్‌ల స్పాన్సర్లుగా పీఈ ఫండ్స్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు స్పాన్సర్లుగా వ్యవహరించేందుకు ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. వీటిపై రూపొందించిన మార్గదర్శకాలకు బుధవారం సమావేశమైన సెబీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చింది. దీంతో వ్యూహాత్మక మార్గదర్శకత్వం, నైపుణ్యాలను అందించేందుకు అవకాశముంటుంది. అంతేకాకుండా ఏఎంసీలు సొంత స్పాన్సరింగ్‌తో ఎంఎఫ్ బిజినెస్‌ను చేపట్టవచ్చు. తద్వారా ఎంఎఫ్ పరిశ్రమ మరింత విస్తరించేందుకు వీలుచిక్కనుంది. ఈ బాటలో సెబీ బోర్డు మరికొన్ని ప్రతిపాదనలను ఓకే చేసింది. వివరాలు చూద్దాం.. శాశ్వత డైరెక్టర్లకు చెక్ లిస్టెడ్ కంపెనీల బోర్డులో వ్యక్తులు శాశ్వత డైరెక్టర్లుగా వ్యవహరించేందుకు ఇకపై వీలుండదు. మెటీరియల్ ఈవెంట్లు, సమాచారంపై బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను(30 నిమిషాలలోగా), కంపెనీలో అమలయ్యే 12 గంటల్లోగా సమాచారం అందించవలసి ఉంటుంది. దీంతో కార్పొరేట్ సుపరిపాలనకు మద్దతు లభించనుంది. స్టాక్ బ్రోకర్లు అవకతవకలకు పాల్పడకుండా నిరోధించేందుకు మార్గదర్శకాలు మెరుగయ్యాయి. మార్కెట్లలో స్టాక్ బ్రోకర్లు మోసాలు, అక్రమాలకు పాల్పడకుండా తాజా నిబంధనలు అడ్డుకోనున్నాయి. విజిల్ బ్లోవర్ పాలసీ, అంతర్గత నియంత్రణలపై సిస్టమ్స్ పర్యవేక్షణకు తెరతీయనున్నారు. అక్టోబర్ 1నుంచి సవరణలు అమలుకానున్నాయి. లిస్టెడ్ కంపెనీలు పర్యావరణం, సామాజిక, పాలనాపరమైన(ఈఎస్జీ) సమాచారమందించడంలో సరికొత్త నిబంధనలు అమలుకానున్నాయి. దీనిలో భాగంగా సెక్యూరిటీ మార్కెట్లలో ఈఎస్జీ రేటింగ్స్, ఎంఎఫ్‌ల ఈఎస్జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వీలు చిక్కనుంది. దీంతో పారదర్శకత, సరళీకరణ, సులభ నిర్వహణలకు వీలుంటుంది. సెకండరీలోనూ అస్బా పబ్లిక్ ఇష్యూలలో మాదిరిగా సెకండరీ మార్కెట్లోనూ ఫండ్ బ్లాకింగ్(ఏఎస్బీఏ తరహా) సౌకర్యాలకు తెరలేవనుంది. ఇది అటు ఇన్వెస్టర్లు, ఇటు బ్రోకర్లు ఆప్షనల్‌గా వినియోగించుకోవచ్చు. ఫలితంగా బ్లాక్ చేసిన సొమ్మును మార్జిన్, సెటిల్మెంట్ ఆబ్లిగేషన్లకు మళ్లించవచ్చు. దీంతో సభ్యులకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గే వీలుంది. తద్వారా స్టాక్ బ్రోకర్లు ఇన్వెస్టర్ల సొమ్మును అక్రమంగా వినియోగించుకోకుండా అడ్డుకట్ట పడనుంది. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు) పెట్టుబడులకు స్వతంత్ర వేల్యుయేషన్ నిర్వహించుకోవచ్చు. ఏఐఎఫ్ మేనేజర్ల కీలక బృందం సమీకృత సరి్టఫికేషన్ తీసుకోవలసి ఉంటుంది. -
గణనీయంగా తగ్గిన పీఈ పెట్టుబడులు
భారత కంపెనీల్లోకి గతేడాది 23.3 బిలియన్ డాలర్ల (రూ.1.91 లక్షల కోట్లు) ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది పెట్టుబడులతో పోలిస్తే 42 శాతం తగ్గాయి. 2019లో వచ్చిన 15.8 బిలియన్ డాలర్ల పెట్టుబడుల తర్వాత మళ్లీ కనిష్ట స్థాయి గతేడాదే నమోదైంది. అయితే చారిత్రక సగటుతో పోలిస్తే మెరుగైన పెట్టుబడులు వచ్చనట్టేనని రెఫినిటివ్ సీనియర్ అనలిస్ట్ ఎలైన్‌ట్యాన్ పేర్కొన్నారు. 2022 డిసెంబర్ త్రైమాసికంలో 3.61 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలతో (3.93 బిలియన్ డార్లు) పోలిస్తే 8.1 శాతం తగ్గాయి. 2021 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన 11.06 బిలియన్ డాలర్లతో పోలిస్తే 67 శాతం తగ్గిపోయాయి. డిసెంబర్ క్వార్టర్లో 333 పీఈ పెట్టుబడుల డీల్స్ నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 443 డీల్స్‌తో పోలిస్తే 25 శాతం తగ్గాయి. 2021 డిసెంబర్లో పీఈ డీల్స్ 411గా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, ఆర్థిక మాంద్యం ఆందోళనలు తదితర అంశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసినట్టు ఎలైన్‌ట్యాన్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్–సాప్ట్వేర్ కంపెనీలకు ఆదరణ గతేడాది అత్యధిక పీఈ పెట్టుబడులను ఇంటర్నెట్ ఆధారిత, సాఫ్ట్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలు ఆకర్షించాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలోని కంపెనీలు 2021తో పోలిస్తే రెట్టింపు పెట్టుబడులను రాబట్టాయి. చైనాలో అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డైవర్సిఫై చేస్తున్నారని.. ఇక ముందూ భారత్, దక్షిణాసియా దీన్నుంచి లాభపడతాయని ఎలైన్‌ట్యాన్ అంచనా వేశారు. చదవండి: Maruti Suzuki Jimny: మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే -
పీఈ, వీసీ పెట్టుబడులు వీక్
ముంబై: గత నెలలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు వార్షికంగా 42 శాతం నీరసించాయి. 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే నెలవారీగా చూస్తే అంటే 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఇవి 18 శాతం పుంజుకున్నట్లు పారిశ్రామిక సంస్థ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ పెట్టుబడులు బలపడినట్లు తెలియజేసింది. ఈ వివరాలు ప్రకారం గత నెలలో నమోదైన లావాదేవీల సంఖ్య 2021 నవంబర్‌తో పోలిస్తే 15 శాతం తక్కువగా 88కు చేరగా.. అక్టోబర్‌తో చూస్తే 13 శాతం అధికమయ్యాయి. కాగా.. 2022 నవంబర్‌లో 29 అమ్మకం(ఎగ్జిట్) డీల్స్ జరిగాయి. వీటి విలువ 1.8 బిలియన్ డాలర్లుకాగా.. 2021 నవంబర్‌లో 3.1 బిలియన్ డాలర్ల విలువైన 21 లావాదేవీలు జరిగాయి. ఇక 2022 అక్టోబర్‌లో 1.6 బిలియన్ డాలర్ల విలువైన 15 ఎగ్జిట్ డీల్స్ నమోదుకావడం గమనార్హం. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
క్షీణించిన కొనుగోళ్లు, విలీనాల డీల్స్ ..నవంబర్‌లో ఎంత శాతం అంటే
ముంబై: గత నెలలో కొనుగోళ్లు, విలీనాల (ఎంఅండ్ఏ) డీల్స్ విలువ 37 శాతం క్షీణించింది. 2021 నవంబర్‌తో పోలిస్తే 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గణాంకాల ఆధారంగా గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక ప్రకారం డీల్స్ పరిమాణం సైతం 40 శాతం తగ్గి 119కు చేరాయి. అయితే ఈ ఏడాదిలోనే అత్యధికంగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తాయి. గత 11 ఏళ్లలో నాలుగోసారి గరిష్టస్థాయిలో కంపెనీలు లిస్టింగ్‌ను సాధించాయి. 2022 నవంబర్‌లో ఎంఅండ్ఏ పరిమాణంలో స్టార్టప్‌లదే హవా. 21 శాతం లావాదేవీలు నమోదయ్యాయి. -
పీఈ పెట్టుబడులు 77 శాతం డౌన్
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 3.84 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏకంగా 77.5 శాతం క్షీణించాయి. సీక్వెన్షియల్‌గా జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 43.5 శాతం తగ్గాయి. 2021 మూడో త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు 17.05 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.80 బిలియన్ డాలర్లు వచ్చాయి. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ గ్రూప్‌లో భాగమైన రెఫినిటివ్ సమీకరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో పీఈ పెట్టుబడులు 33 శాతం క్షీణించి 19.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, భారత్ ఆధారిత పీఈ ఫండ్స్ తొలి తొమ్మిది నెలల్లో 8.98 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 123 శాతం అధికం. తగ్గిన డీల్స్.. : డేటా ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో డీల్స్ 14.6 శాతం తగ్గాయి. 478 నుంచి 408కి పడిపోయాయి. అయితే, జూన్ త్రైమాసికంలో నమోదైన 356 డీల్స్‌తో పోలిస్తే 14.6 శాతం పెరిగాయి. తొలి తొమ్మది నెలల్లో ఇంటర్నెట్ సంబంధ కంపెనీల్లోకి పెట్టుబడులు 52 శాతం తగ్గి 7.47 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి 29 శాతం పెట్టుబడులు తగ్గాయి. అటు ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీల్లోకి వచ్చే నిధులు 25.7 శాతం, ఇండస్ట్రియల్స్‌లోకి 12.4 శాతం క్షీణించాయి. రవాణా రంగంలోకి మాత్రం 56.8 శాతం, కమ్యూనికేషన్స్‌లో 950 శాతం, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంస్థల్లోకి 197 శాతం పెరిగాయి. టాప్ డీల్స్‌లో కొన్ని.. వెర్స్ ఇన్నోవేషన్ (827.7 మిలియన్ డాలర్లు), థింక్ అండ్ లెర్న్ (800 మిలియన్ డాలర్లు), బండిల్ టెక్నాలజీస్ .. భారతి ఎయిర్టెల్ (చెరి 700 మిలియన్ డాలర్లు), టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (494.7 మిలియన్ డాలర్లు) మొదలైనవి టాప్ డీల్స్‌లో ఉన్నాయి. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీ మార్కెట్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. గత నెల(ఆగస్ట్)లో 80 శాతం పడిపోయి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇవి 19 నెలల కనిష్టంకాగా.. 2021 ఆగస్ట్‌లో 11.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించినట్లు ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నెలవారీ నివేదిక వెల్లడించింది. 2022 జులైలో 4.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించగా.. ఈ ఆగస్ట్‌లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ 3.1 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. నివేదిక ప్రకారం గత నెలలో 83 డీల్స్ ద్వారా పెట్టుబడులు లభించగా.. దేశీ కంపెనీలలో 97.2 కోట్ల డాలర్ల విలువైన ఐదు భారీ లావాదేవీలు నమోదయ్యాయి. హెల్త్‌కేర్‌ను మినహాయిస్తే అధిక రంగాలలో పెట్టుబడులు క్షీణించినట్లు ఈవై పార్టనర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు 485 శాతం జంప్‌చేయగా.. 3.1 బిలియన్ డాలర్ల విలువైన 25 ఎగ్జిట్ డీల్స్ జరిగినట్లు నివేదిక వివరించింది. జులైలో 32.2 కోట్ల డాలర్ల విలువైన 9 అమ్మకపు డీల్స్ మాత్రమే నమోదయ్యాయి. అయితే 2021 ఆగస్ట్‌లోనూ 7.4 బిలియన్ డాలర్ల విలువైన 42 లావాదేవీలు నమోదుకావడం గమనార్హం! -
ప్రథమార్ధంలో పెట్టుబడుల జోరు!
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే 28 శాతం ఎగిసి 34.1 బిలియన్ డాలర్లకు చేరాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై .. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2022 ప్రథమార్ధంలో 714 డీల్స్ కుదిరాయి. వీటిలో 92 ఒప్పందాల విలువ సుమారు 23.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వార్షికంగా చూస్తే పెరిగినప్పటికీ సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం పీఈ, వీసీ పెట్టుబడులు 32 శాతం తగ్గినట్లు ఈవై ఇండియా పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. గతేడాది ద్వితీయార్థంలో ఇవి 50.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ♦కొత్త పెట్టుబడుల్లో అత్యధికంగా 54 శాతం వాటాను అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. 506 డీల్స్ ద్వారా 13.3 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది ప్రథమార్ధంలో 327 ఒప్పందాల ద్వారా వీటిలోకి 8.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ♦ రంగాలవారీగా చూస్తే ఆర్థిక సేవల విభాగంలో అత్యధికంగా 152 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 7.3 బిలియన్ డాలర్లు. చెరి 4 బిలియన్ డాలర్లతో ఈ–కామర్స్, టెక్నాలజీ రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ–కామర్స్‌లో 101 డీల్స్, టెక్నాలజీ రంగంలో 121 ఒప్పందాలు కుదిరాయి. ఈ–కామర్స్‌లోకి పెట్టుబడులు 16 శాతం, టెక్నాలజీలోకి 20 శాతం తగ్గాయి. ♦మీడియా .. వినోదం, లాజిస్టిక్స్, విద్య రంగాలపై ఆసక్తి పెరిగింది. విద్యా రంగంలోకి 2.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. 42 డీల్స్ కుదిరాయి. ♦ప్రథమార్ధంలో వార్షికంగా చూస్తే కుదిరిన ఒప్పందాలు 37 శాతం పెరిగాయి. 522 డీల్స్ నుంచి 714కి చేరాయి. అయితే, 2021 ద్వితీయార్థంతో పోలిస్తే 748 నుంచి 4 శాతం తగ్గాయి. ♦92 భారీ ఒప్పందాలు (100 మిలియన్ డాలర్ల పైబడి) కుదిరాయి. వీటి విలువ 23.7 బిలియన్ డాలర్లు. గతేడాది ప్రథమార్ధంలో 19.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 70 డీల్స్ నమోదయ్యాయి. తాజాగా కుదిరిన ఒప్పందాల్లో వయాకామ్18లో బోధి ట్రీ 40 శాతం వాటాలు తీసుకోవడం (విలువ 1.8 బిలియన్ డాలర్లు), డైలీహంట్‌లో సుమేరు వెంచర్స్ మొదలైన ఇన్వెస్టర్లు 805 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిన డీల్స్ ఉన్నాయి. ♦ఐపీవోలు, ఇతరత్రా మార్గాల్లో వాటాలు విక్రయించుకుని పీఈ/వీసీలు కొన్ని సంస్థల నుంచి నిష్క్రమించాయి. ఈ కోవకు చెందిన 120 డీల్స్ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ♦ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు, కఠిన పరపతి విధానాలు, ధరల పెరుగుదల వంటి ప్రతికూలాంశాలతో సీక్వెన్షియల్‌గా పోలిస్తే పెట్టుబడులు తగ్గినప్పటికీ ప్రథమార్ధంలో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. నెలకు దాదాపు 6 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. -
క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో 6.72 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ గ్రూప్ కంపెనీ రెఫినిటివ్ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్ డాలర్లను తాకాయి. టెక్నాలజీ స్పీడ్ 2022 జనవరి–జూన్ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్ డాలర్లను టెక్ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్ రెట్టింపునకుపైగా 7 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్– హెల్త్ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్‌లో వెర్సే ఇన్నోవేషన్(82.77 కోట్ల డాలర్లు), థింక్ అండ్ లెర్న్(80 కోట్ల డాలర్లు), బండిల్ టెక్నాలజీస్(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్‌టెక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి. -
యస్ బ్యాంక్‌లో కార్లయిల్ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌డీఐ మార్గంలో విదేశీ పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్‌డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్బీఐ పరిమితులు విధించింది. చర్చల దశలో యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్‌కల్లా ఎస్బీఐ కార్డ్స్‌లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది. -
స్టార్టప్స్‌లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు
ముంబై: గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో అంకుర సంస్థల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్‌లో 1.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్‌లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్ వివరించారు. పెట్టుబడులకు రిస్కులు.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఏప్రిల్‌లో వర్స్ ఇన్నోవేషన్స్ అత్యధికంగా 805 మిలియన్ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్. ► భారీ స్థాయి డీల్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 2.7 బిలియన్ డాలర్లు. ► ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది. ► ఏప్రిల్‌లో 16 ఫండ్లు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్ డాలర్లు సేకరించాయి. భారత్‌లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్ క్యాపిటల్ ఫండ్ ఈసారి అత్యధికంగా 670 మిలియ్ డాలర్లు దక్కించుకుంది. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: ఈ మార్చిలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు 22 శాతం క్షీణించాయి. 107 డీల్స్ ద్వారా 4.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక జనవరి–మార్చి కాలంలో లావాదేవీల పరిమాణం 54 శాతం జంప్‌చేసి 15.5 బిలియన్ డాలర్లను అధిగమించింది. 360 డీల్స్ జరిగాయి. ప్రధానంగా స్టార్టప్ విభాగం ఇందుకు దోహదపడినట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నెలవారీ నివేదిక పేర్కొంది. పీఈ, వీసీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ మార్కెట్‌గా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు అభిప్రాయపడింది. స్థూల ఆర్థికాంశాలలో పురోభివృద్ధి, పాలసీ నిలకడ ఇందుకు మద్దతివ్వనున్నప్పటికీ భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కఠిన పరపతి విధానాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తదితర రిస్క్లున్నట్టు ఈవై పార్టనర్ వివేక్ సోనీ వివరించారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి అమ్మకాలు వీక్ గత ఐదు త్రైమాసికాల్లోనే అత్యంత తక్కువగా ఎగ్జిట్ డీల్స్ 16 శాతం నీరసించి 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. భారీ వ్యూహాత్మక, సెకండరీ డీల్స్ లోపించడం ప్రభావం చూపింది. పీఈ పెట్టుబడులుగల ఐపీవోలు సైతం తగ్గడంతో పీఈ, వీసీ విక్రయాలు మందగించాయి. పెట్టుబడుల విషయానికివస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో 10.1 బిలియన్ డాలర్ల విలువైన 45 భారీ డీల్స్ జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 6.7 బిలియన్ డాలర్ల విలువైన 30 భారీ డీల్స్ నమోదయ్యాయి. ఇక అంతక్రితం త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన 53 భారీ డీల్స్ జరిగాయి. 77 శాతం అధికం రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి చూస్తే మార్చి క్వార్టర్లో మొత్తం పెట్టుబడులు(బెట్స్) 13.9 బిలియన్ డాలర్లను తాకాయి. ఇది 77 శాతం వృద్ధికాగా.. గతేడాది ఇదే కాలంలో 7.8 బిలియన్ డాలర్లు మాత్రమే నమోదయ్యాయి. అయితే డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 21.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 36 శాతం తక్కువ. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ 255 డీల్స్ ద్వారా 7.7 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది జనవరి–మార్చిలో 175 డీల్స్ ద్వారా 2.8 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. డిసెంబర్ త్రైమాసికంలో 233 డీల్స్ ద్వారా 9.6 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల విషయంలో ఐదు రంగాలు వీటిని అందుకున్నాయి. 71 డీల్సద్వారా ఫైనాన్షియల్ సర్వీసులు గరిష్టంగా 3.2 బిలియన్ డాలర్లు పొందాయి. ఈ బాటలో 47 డీల్స్ ద్వారా ఈకామర్స్ 2.7 బిలియన్ డాలర్లు, 59 లావాదేవీల ద్వారా టెక్నాలజీ రంగం 2.6 బిలియన్ డాలర్లు సాధించాయి. మార్చి క్వార్టర్లో నిధుల సమీకరణ 4.6 బిలియన్ డాలర్లకు జంప్‌చేసింది. గతేడాది ఇదే కాలంలో ఇవి కేవలం 1.7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ క్వార్టర్లోనూ 1.6 బిలియన్ డాలర్ల సమీకరణ మాత్రమే జరిగింది. -
డబ్బే డబ్బు!! స్టార్టప్లోకి పెట్టుబడుల వరద!
ముంబై: ఇటీవల దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి భారీగా తరలి వస్తున్న ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు ఫిబ్రవరిలో మరింత జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో రెట్టింపై 5.8 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది(2021) ఫిబ్రవరిలో ఇవి 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఐవీసీఏ–ఈవై రూపొందించిన నెలవారీ గణాంకాలివి. వీటి ప్రకారం ఫిబ్రవరిలో డీల్ పరిమాణం 33 శాతం ఎగసి 117కు చేరాయి. అయితే 2022 జనవరిలో నమోదైన 122 డీల్స్‌తో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. కాగా.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో 88 శాతం రియల్టీ, ఇన్ఫ్రా రంగాలను మినహాయించి ప్యూర్‌ప్లే ఇన్వెస్ట్మెంట్స్ కావడం గమనార్హం! గతేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 79 శాతమే. 17 భారీ డీల్స్ గత నెలలో మొత్తం 4.4 బిలియన్ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్ జరిగాయి. నెలవారీగా చూస్తే ఇవి 24 శాతం అధికం. మొత్తం పెట్టుబడుల్లో దాదాపు సగం అంటే 2.5 బిలియన్ డాలర్లు స్టార్టప్లలోకే ప్రవహించడం విశేషం! కాగా.. 85 డీల్స్ ద్వారా అత్యధిక పెట్టుబడులను స్టార్టప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఏడు డీల్స్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మరోపక్క 1.4 బిలియన్ డాలర్ల విలువైన 10 విక్రయ డీల్స్ సైతం జరిగాయి. వీటిలో మూడు డీల్స్ 1.2 బిలియన్ డాలర్ల విలువైన సెకండరీ విక్రయాలు కావడం గమనార్హం! చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు! -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది. -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
ఈ రంగంలోనే ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారంట
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు గత నెలలో భారీగా ఎగశాయి. జూలైలో రెట్టింపునకు పైగా జంప్‌చేసి 9.5 బిలియన్ డాలర్లను(సుమారు రూ. 70,530 కోట్లు) తాకాయి. వెరసి గరిష్ట పెట్టుబడులుగా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 2020 జూలైలో ఇవి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రధానంగా ఈకామర్స్ రంగం పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించుకుంటున్నట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ సంస్థలు పీఈ, వీసీ పెట్టుబడులపై నెలవారీ నివేదికను విడుదల చేసే సంగతి తెలిసిందే. కాగా.. ఈ(2021) జూన్‌లో నమోదైన 5.4 బిలియన్ డాలర్లతో పోల్చినా.. తాజా పెట్టుబడులు 77 శాతం వృద్ధి చెందాయి. జూలైలో 10 కోట్ల డాలర్లకుపైబడిన 19 భారీ డీల్స్ ద్వారా 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. 2020 జులైలో 10 భారీ డీల్స్ ద్వారా 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదుకాగా.. జూన్‌లో 12 డీల్స్‌తో 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. జులైలో కొత్త రికార్డుకు తెర తీస్తూ మొత్తం 131 లావాదేవీలు జరిగాయి. 2020 జులైలో ఇవి 77 మాత్రమే కాగా.. ఈ జూన్‌లో 110 లావాదేవీలు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి పీఈ, వీసీ పెట్టుబడుల్లో 96 శాతం(9.1 బిలియన్ డాలర్లు) ప్యూర్ప్లేగా నివేదిక వెల్లడించింది. 2020 జులైలో ఇవి 3.8 బిలియన్ డాలర్లుకాగా.. ఈ జూన్‌లో 4.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ జూలై పెట్టుబడుల్లో ఈకామర్స్ రంగం 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! దీంతో 2021 జూన్‌కల్లా ఈకామర్స్‌లో పీఈ, వీసీ పెట్టుబడులు 10.5 బిలియన్ డాలర్లను తాకాయి. 22 డీల్స్ జూలైలో వాటా విక్రయం ద్వారా పీఈ, వీసీ సంస్థలు వైదొలగిన(ఎగ్జిట్) డీల్స్ 22కు చేరాయి. వీటి విలువ 96.5 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2020 జులైలో ఇవి 13.4 కోట్ల డాలర్లు మాత్రమే. అయితే ఈ జూన్‌లోనూ ఎగ్జిట్ డీల్స్ విలువ భారీగా 3.2 బిలయన్ డాలర్లను తాకింది. చదవండి : ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్ -
చైనా పెట్టుబడులకు బ్రేక్..
ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్ అండ్ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్ నోట్ 3 (పీఎన్3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్లకు భారత్‌తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థలు మాత్రమే భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడులు 72 శాతం డౌన్.. చైనా, హాంకాంగ్ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్‌లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 814 డీల్స్ కుదిరినట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్ రిటైల్, జియోలోకే వచ్చాయి. కొత్త మార్గదర్శకాలివీ .. పీఎన్3 ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది. కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ రవీంద్ర ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్, పబ్జీ వంటి 200కి పైగా చైనా యాప్‌లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు
ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో ఏకంగా 35 శాతం అధికంగా 35.1 బిలియన్ డాలర్ల (రూ.2,45,700 కోట్లు) మేర పెట్టుబడులు తరలివచ్చాయి. భారీ డీల్స్ 2017లో చోటు చేసుకోవడమే ఈ వృద్ధికి కారణం. ఇక పీఈ/వీసీల పెట్టుబడుల ఉపసంహరణ విలువ 2018లో 26 బిలియన్ డాలర్ల (రూ.1,82,000 కోట్లు) మేర ఉంది. ఇది క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది. ‘‘పీఈ/వీసీ పెట్టుబడులు, ఉపసంహరణలకు 2018 మంచి సంవత్సరం. మేము ముందుగా అంచనా వేసిన విధంగానే పీఈ, వీసీల పెట్టుబడులు, ఉపసంహరణలు 2018లో నూతన రికార్డు స్థాయికి చేరాయి’’అని ఈవై పార్ట్నర్ వివేక్సోని తమ నివేదికలో తెలిపారు. స్టాక్ మార్కెట్లలో అస్థిరతల వల్ల 2018 ద్వితీయ భాగంలో ప్రైవేటు పెట్టుబడులకు విఘాతం కలిగినప్పటికీ... కొనుగోళ్లు, స్టార్టప్ యాక్టివిటీతో ఈ ప్రభావం తగ్గిపోయిందని వివరించారు. డీల్స్ వివరాలు... ► 2018లో 500 మిలియన్ డాలర్లు (రూ.3,500 కోట్లు), అంతకంటే ఎక్కువ విలువ కలిగిన 12 డీల్స్ జరిగాయి. ఇందులో ఎనిమిది డీల్స్ విలువ ఒక్కోటీ బిలియన్ డాలర్లపైనే ఉండడం గమనార్హం. ► 76 ఒప్పందాల విలువ 100 మిలియన్ డాలర్ల (రూ.700 కోట్లు) కంటే ఎక్కువ ఉంది. వీటి మొత్తం విలువ 25.9 బిలియన్ డాలర్లు. 2018లో వచ్చిన పీఈ, వీసీ మొత్తం పెట్టుబడుల్లో 74 శాతం. ► 2018లో మొత్తం డీల్స్ 761గా ఉన్నాయి. 2017లో ఉన్న 594 డీల్స్ కంటే 28 శాతం ఎక్కువ. ► స్టార్టప్ పెట్టుబడులు బలంగా ఉన్నాయి. సాఫ్ట్ బ్యాంకు, టెన్సెంట్, నాస్పర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇందుకు తోడ్పడింది. ► అతిపెద్ద డీల్... హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో జీఐసీ, కేకేఆర్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఓమర్స్ చేసిన 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి కావడం గమనార్హం. ► ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ప్రవేశంతో సాఫ్ట్‌బ్యాంకు, టైగర్ గ్లోబల్, మరికొంత మంది ఇన్వెస్టర్లు తప్పకున్న విషయం తెలిసిందే. ఇది 16 బిలియన్ డాలర్ల విలువైన డీల్. దేశ పీఈ/వీసీ మార్కెట్లో ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద డీల్. ► పీఈ, వీసీ పెట్టుబడుల ఉపసంహరణ డీల్స్ జరిగిన రంగాలను గమనిస్తే... ఈ కామర్స్ (16.4 బిలియన్ డాలర్లు), టెక్నాలజీ(రూ.1.8 బిలియన్ డాలర్లు), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.5 బిలియన్ డాలర్లు) ముందున్నాయి. వ్యాపారంపై తగ్గిన విశ్వాసం! జనవరి–మార్చి మధ్య పరిస్థితిపై డీఅండ్‌బీ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార ఆశావాదం జనవరి–మార్చి త్రైమాసికానికి తగ్గింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ)కాంపోజిట్ బిజినెస్ ఆప్టమిజమ్ ఇండెక్స్ ఈ త్రైమాసికానికి సంబంధించి 73.8గా ఉంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంతో పోల్చిచూస్తే, ఈ సూచీ 7 శాతం తగ్గింది. వచ్చే కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల ఫలితంపై అనిశ్చితి, సంస్కరణల అజెండా కొనసాగడంపై సందేహాలు వ్యాపార ఆశావహ సూచీ తగ్గడానికి కారణమని డీ అండ్ బీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సిన్హా పేర్కొన్నారు. అమెరికా మందగమనం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనత వంటి అంశాలూ దేశీయ వృద్ధిపై ఆందోళనలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాపార అంచనాలపై వ్యాపార ప్రతినిధులు ఆరు అంశాలపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా సూచీ కదలికలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సూచీకి సంబంధించి పరిగణనలోకి తీసుకునే మొత్తం ఆరు ప్రమాణాల్లో ఐదు ( నికర ఆదాయం, కొత్త ఆర్డర్లు, అమ్మకాల పరిమాణం, నిల్వలు, అమ్మకపు ధర) అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంతో పోల్చితే ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. దీంతో ఉపాధి కల్పనకు సంబంధించి ఆశావహ పరిస్థితి 7% పెరిగినా, మొత్తం ఫలితం ప్రతికూలంగా ఉంది. -
చేతులు మారిన విశాల్ మెగా మార్ట్
న్యూఢిల్లీ: వ్యాల్యూ రిటైల్ చెయిన్ విశాల్ మెగా మార్ట్(వీఎమ్‌ఎమ్) చేతులు మారుతోంది. విశాల్ మెగా మార్ట్‌ను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పార్ట్నర్స్ గ్రూప్, కేదార క్యాపిటల్ ఫండ్లు కొనుగోలు చేయనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, టీపీజీ నుంచి విశాల్ మెగా మార్ట్‌ను ఈ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. విశాల్ మెగామార్ట్ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ డీల్ సైజు రూ.5,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 110 నగరాలు, పట్టణాల్లో విశాల్ మెగా మార్ట్ మొత్తం 229 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. మరింత వృద్ధి.. తర్వాతి స్థాయి వృద్ది కోసం తమకు సరైన భాగస్వాములు లభించారని వీఎమ్‌ఎమ్ ఎమ్డీ, సీఈఓ గునేందర్ కపూర్ చెప్పారు. పార్ట్నర్స్ గ్రూప్, కేదార క్యాపిటల్ ఫండ్ల తోడ్పాటుతో మరింత వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. కాగా విశాల్ మెగామార్ట్ కొనుగోలుకు వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది చివరకు డీల్ పూర్తవ్వగలదని పార్ట్నర్స్ గ్రూప్ పేర్కొంది. -
రియల్టీలో ‘పీఈ’ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ రియల్టీ మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థిరాస్తి రంగం రూ.16,500 కోట్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించిందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. గతేడాది క్యూ1తో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. నివాస విభాగానిదే పైచేయి.. నివాస సముదాయాల్లోకి పీఈ పెట్టుబడులు ఎక్కువ చేరాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో రూ.8,500 కోట్లు ఒక్క రెసిడెన్షియల్ సెక్టార్‌లోకే వచ్చాయి. ఆ తర్వాత ఆఫీసు విభాగంలోకి రూ.6,100 కోట్లు, ఆతిథ్య రంగంలోకి రూ.1,200 కోట్లు, రిటైల్‌లోకి రూ.250 కోట్లు, మిక్స్డ్ యూజ్ విభాగంలోకి రూ.110 కోట్లు, ఇండస్ట్రియల్ విభాగంలోకి రూ.350 కోట్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. ముంబైలోనే ఎక్కువ డీల్స్.. అత్యధిక పీఈ పెట్టుబడులను ఆకర్షించిన నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో నిలిస్తే... ఆ తర్వాత ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ నగరాలు నిలిచాయి. నివాస సముదాయంలో జరిగిన మొత్తం పీఈ డీల్స్‌లో 19 శాతం ఒక్క ముంబై నగరంలోనే కేంద్రీకృతమయ్యాయి. ముంబై రూ.6,300 కోట్ల పీఈ పెట్టుబడులను ఆకర్షించి తొలి స్థానంలో నిలిచింది. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌కు చెందిన రెండు ఆఫీసు ప్రాజెక్ట్‌ల్లో బ్లాక్‌స్టోన్ వాటాను కొనుగోలు చేయడం అతిపెద్ద డీల్‌గా నిలిచింది.