ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు గత నెలలో భారీగా ఎగశాయి. జూలైలో రెట్టింపునకు పైగా జంప్‌చేసి 9.5 బిలియన్ డాలర్లను(సుమారు రూ. 70,530 కోట్లు) తాకాయి. వెరసి గరిష్ట పెట్టుబడులుగా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 2020 జూలైలో ఇవి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే.
ప్రధానంగా ఈకామర్స్ రంగం పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించుకుంటున్నట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ సంస్థలు పీఈ, వీసీ పెట్టుబడులపై నెలవారీ నివేదికను విడుదల చేసే సంగతి తెలిసిందే. కాగా.. ఈ(2021) జూన్‌లో నమోదైన 5.4 బిలియన్ డాలర్లతో పోల్చినా.. తాజా పెట్టుబడులు 77 శాతం వృద్ధి చెందాయి. జూలైలో 10 కోట్ల డాలర్లకుపైబడిన 19 భారీ డీల్స్ ద్వారా 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. 2020 జులైలో 10 భారీ డీల్స్ ద్వారా 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదుకాగా.. జూన్‌లో 12 డీల్స్‌తో 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. జులైలో కొత్త రికార్డుకు తెర తీస్తూ మొత్తం 131 లావాదేవీలు జరిగాయి. 2020 జులైలో ఇవి 77 మాత్రమే కాగా.. ఈ జూన్‌లో 110 లావాదేవీలు నమోదయ్యాయి.
రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి పీఈ, వీసీ పెట్టుబడుల్లో 96 శాతం(9.1 బిలియన్ డాలర్లు) ప్యూర్‌ప్లేగా నివేదిక వెల్లడించింది. 2020 జులైలో ఇవి 3.8 బిలియన్ డాలర్లుకాగా.. ఈ జూన్‌లో 4.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ జూలై పెట్టుబడుల్లో ఈకామర్స్ రంగం 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! దీంతో 2021 జూన్‌కల్లా ఈకామర్స్‌లో పీఈ, వీసీ పెట్టుబడులు 10.5 బిలియన్ డాలర్లను తాకాయి.
22 డీల్స్
జూలైలో వాటా విక్రయం ద్వారా పీఈ, వీసీ సంస్థలు వైదొలగిన(ఎగ్జిట్) డీల్స్ 22కు చేరాయి. వీటి విలువ 96.5 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2020 జులైలో ఇవి 13.4 కోట్ల డాలర్లు మాత్రమే. అయితే ఈ జూన్‌లోనూ ఎగ్జిట్ డీల్స్ విలువ భారీగా 3.2 బిలయన్ డాలర్లను తాకింది.
చదవండి : ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment