ముంబై: అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై మాత్రం ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
దేశీ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రైవేట్ పెట్టుబడులను విశ్లేషించే వెంచర్ ఇంటెలిజెన్స్, పరిశ్రమ సమాఖ్య ఐవీసీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది (2022లో) 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే గతేడాది 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248కి, పరిమాణం 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది.
అయితే, నిధుల ప్రవాహం మందగించడం తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో మరింత భారీగా పెట్టుబడులు రాగలవని ఐవీసీఏ (ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రజత్ టాండన్ తెలిపారు. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య తగ్గినా భారీ స్థాయి పెట్టుబడులు రావడమనేది గణనీయమైన విలువను, స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడాన్ని సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని అంశాలు..
టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్‌లో మణిపాల్ హాస్పిటల్‌లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. తదుపరి జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి. ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్‌లో అవాడా వెంచర్స్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్‌ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్‌కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది.
► రంగాలవారీగా పరిశీలించినప్పుడు హెల్త్‌కేర్.. లైఫ్ సైన్సెస్‌లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 30.2 శాతం పెరిగాయి. అలాగే ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్‌లో (199.8 శాతం) ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయి.
► ఐటీ..ఐటీఈఎస్ రంగంలో పెట్టుబడులు 64.5 శాతం క్షీణించాయి. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా)లోకి 47.6 శాతం, తయారీలోకి 43 శాతం, ఇంజినీరింగ్.. నిర్మాణ రంగాల్లోకి 64 శాతం మేర ఇన్వెస్ట్‌మెంట్లు పడిపోయాయి. షిప్పింగ్ .. లాజిస్టిక్స్‌లోకి 60.6 శాతం, విద్యా రంగంలోకి 78.4 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 48.5 శాతం, అగ్రి బిజినెస్‌లోకి 81 శాతం, ఫుడ్ అండ్ బెవరేజెస్‌లోకి 70 శాతం, టెలికంలోకి 84 శాతం పెట్టుబడులు క్షీణించాయి.
ఇదీ చదవండి: 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
► టాప్ పీఈ నిష్క్రమణలను చూస్తే.. టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా.. ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను వాల్‌మార్ట్‌కు 1.78 బిలియన్ డాలర్లకు విక్రయించాయి. లెన్స్‌కార్ట్‌లో ఇన్వెస్టర్లు షిరాటే వెంచర్స్, ప్రేమ్‌జీఇన్వెస్ట్, యునీలేజర్ వెంచర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, టీఆర్ క్యాపిటల్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎపిక్ క్యాపిటల్ తమ వాటాలను అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి 410 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ ఇన్వెస్టర్లు సోఫినా, స్టెలారిస్ వెంచర్ పార్ట్‌నర్స్, ఫైర్‌సైడ్ వెంచర్స్, షార్ప్ వెంచర్స్ .. పబ్లిక్ ఇష్యూలో తమ వాటాలను విక్రయించి 133 మిలియన్ డాలర్లు సమీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment