ఆసియా కుబేరుల జాబితా విడుదల | Hurun India Rich List 2025: Mukesh Ambani Remains The Richest Person In Asia, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Hurun India Rich List 2025: ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీయే

Mar 28 2025 4:54 AM | Updated on Mar 28 2025 10:01 AM

Hurun India Rich 2025: Mukesh Ambani remains the richest person in Asia

రూ.8.6 లక్షల కోట్ల సంపదతో నంబర్‌ వన్‌ 

రూ.8.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ 

దేశంలో 284 మంది బిలియనీర్లు; ఉమ్మడి సంపద రూ.98 లక్షల కోట్లు 

దేశ జీడీపీలో మూడింట ఒక వంతు వీరిదే...

ముంబై: ఆసియా కుబేరుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద రూ.లక్ష కోట్ల మేర తరిగిపోయినప్పటికీ.. రూ.8.6 లక్షల కోట్ల నికర సంపదతో మొదటి స్థానాన్ని కాపాడుకున్నారు. కానీ, ప్రపంచ టాప్‌–10లో స్థానాన్ని కోల్పోయారు. ఇదే కాలంలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద 13 శాతం పెరిగి (రూ.లక్ష కోట్లు) 8.4 లక్షల కోట్లకు చేరుకోవడంతో ముకేశ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. 

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో సంపదను ఎక్కువగా పెంచుకున్నది అదానీయే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో 13 మంది బిలియనీర్లు దేశంలో కొత్తగా పుట్టుకొచ్చారు. 

మొత్తం బిలియనీర్లు (బిలియన్‌ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద) 284 మంది కాగా, వీరి ఉమ్మడి సంపద ఏడాది కాలంలో 10 శాతం పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది. దేశ జీడీపీలో వీరి సంపద మూడింట ఒక వంతుగా ఉంది. ఈ వివరాలతో హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ (కుబేరుల జాబితా) 2025 విడుదలైంది. వీరి సంపద లెక్కింపునకు ఈ ఏడాది జనవరి 15ను కటాఫ్‌ తేదీగా హరూన్‌ పరిగణనలోకి తీసుకుంది.  

→ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలోకి తొలిసారి వచ్చి చేరారు. కంపెనీలో 47 శాతం వాటాను ఆమె పేరిట తండ్రి శివ్‌నాడార్‌ బదిలీ చేయడం ఇందుకు దారితీసింది. ప్రపంచంలో టాప్‌–10 మహిళా కుబేరుల్లో 5వ స్థానం సొంతం చేసుకుని, ఈ గుర్తింపు సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు.  
→ రేజర్‌పే సహ వ్యవస్థాపకులైన శశాంక్‌ కుమార్‌ (34), హర్షిల్‌ మాథుర్‌ (34) చెరో రూ.8,463 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లోనే యువ బిలియనీర్లుగా ఈ జాబితాకెక్కారు.  
→ సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే బందీ అవుతోందన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఒక్కో బిలియనీర్‌ సగటు సంపద (రూ.34,514 కోట్లతో) విషయంలో భారత్‌ ప్రపంచంలో ముందుంది. రెండో స్థానంలో ఉన్న చైనాలో ఒక్కో బిలియనీర్‌ సగటు సంపద విలువ రూ.29,027 కోట్లు.   
→ గడిచిన ఏడాది కాలంలో 175 మంది భారతీయ బిలియనీర్ల సంపద నికరంగా పెరగ్గా.. 109 మంది సంపద అంతకు ముందు ఏడాదితో పోల్చితే తగ్గింది.  
→ అత్యధికంగా 90 మందితో దేశంలో బిలియనీర్ల రాజధానిగా ముంబై నిలిచింది. కానీ, 92 మంది బిలియనీర్లతో ఆసియాలో బిలియనీర్ల రాజధానిగా షాంఘై నిలిచింది. 129 మంది బిలియనీర్లతో ప్రపంచ రాజధానిగా న్యూయార్క్‌ వరుసగా రెండో ఏడాది తన స్థానాన్ని కాపాడుకుంది. 
→ టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్‌ 420 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు.   
→ అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ 266 బిలియన్‌ డాలర్లతో, మెటా చీఫ్‌  జుకెర్‌బర్గ్‌ 242 బి.డాలర్లతో ప్రపంచంలో 2,3 స్థానాల్లో ఉన్నారు.  
→ ఈ ఏడాది హరూన్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌కు 18వ ర్యాంక్‌ లభిస్తే, అదానీ 27వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. 
→ 870 మంది బిలియనీర్లతో అమెరికా ప్రపంచ కుబేరుల కేంద్రంగా నిలిస్తే, 823 మందితో చైనా రెండో స్థానంలో ఉంది.  
→ మొత్తం 9 మంది భారత మహిళలకు ప్రవేశం లభించగా, వీరి ఉమ్మడి సంపద రూ.9 లక్షల కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement