అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు! | Asia richest Mukesh Ambani, Gautam Adani following with Rs 1002 Crore in earnings per day | Sakshi
Sakshi News home page

అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!

Published Fri, Oct 1 2021 3:42 AM | Last Updated on Fri, Oct 1 2021 8:29 AM

Asia richest Mukesh Ambani, Gautam Adani following with Rs 1002 Crore in earnings per day - Sakshi

ముంబై: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్‌ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది.

దేశీయంగా ఇంత స్వల్ప కాలంలో భారీగా సంపదను కూడబెట్టుకున్న ఘనత అదానికే సొంతం. మొత్తం మీద దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య 1,007కు చేరుకుంది. ఒకవైపు కరోనా కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోగా.. ఈ 1,007 మంది ఆస్తుల విలువ సగటున 25 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. 10వ హరూన్‌ ఇండియా ఐఐఎఫ్‌ఎల్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదిక గురువారం విడుదలైంది. రూ.1,000 కోట్లకుపైన సంపద కలిగిన వారిని ఈ జాబితాలోకి తీసుకున్నారు. 1,007 మందిలోలో 894 మంది సంపదను పెంచుకోగా.. 113 మంది సంపద గడిచిన ఏడాదిలో క్షీణించింది.

ముకేశ్‌ నంబర్‌ 1
1007 మందిలో 13 మంది రూ.లక్ష కోట్లకంటే ఎక్కువే సంపద కలిగి ఉన్నారు. వరుసగా పదో ఏడాది ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. 2020 నాటి నివేదికతో పోలిస్తే ముకేశ్‌ సంపద 9 శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రూ.5,05,900 కోట్లతో గౌతమ్‌ అదానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది. 2020లో ఉన్న రూ.1,40,200 కోట్ల నుంచి అదానీ సంపద ఏకంగా 261 శాతం పెరిగింది. ఆసియాలోనూ రెండో అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ తర్వాతి స్థానానికి అదానీ చేరుకున్నారు.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రమోటర్‌ అయిన శివ్‌నాడార్‌ ఆయన కుటుంబం రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఏడాది కాలంలో వీరి సంపద 67 శాతం వృద్ధి చెందింది. ఎస్‌పీ హిందుజా, ఆయన కుటుంబం రూ.2,20,000 కోట్లతో (ఏడాదిలో 53 శాతం వృద్ధి) నాలుగో స్థానంలో, ఎల్‌ఎన్‌ మిట్టల్‌ ఆయన కుటుంబం రూ.1,74,400 కోట్లతో (ఏడాదిలో 187 శాతం పెరుగుదల) ఐదో స్థానంలో, సైరస్‌ పూనవాలా, ఆయన కుటుంబం రూ.1,63,700 కోట్లతో (ఏడాదిలో 74 శాతం వృద్ధి) ఆరో స్థానంలో ఉన్నారు.

డీమార్ట్‌ (అవెన్యూ సూపర్‌మార్ట్‌) అధినేత రాధాకిషన్‌ దమానీ, ఆయన కుటుంబం రూ.1,54,300 కోట్లతో (ఏడాదిలో77 శాతం వృద్ధి) ఏడో స్థానంలో ఉంది. వినోద్‌ శాంతిలాల్‌ అదానీ, ఆయన కుటుంబం రూ.1,31,600 కోట్లతో, కుమార మంగళం బిర్లా, ఆయన కుటుంబం రూ.1,22,200 కోట్లతో, జయ్‌చౌదరి (జెడ్‌స్కేలర్‌ కంపెనీ అధినేత) రూ.1,21,600 కోట్లతో టాప్‌–10లో నిలిచారు. జెరోదా నితిన్‌కామత్‌ ఆయన కుటుంబం రూ.25,600 కోట్లతో 63వ స్థానంలో, బడా ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఆయన కుటుంబం రూ.22,300 కోట్లతో 72వ స్థానం సంపాదించుకున్నారు.

ఐదేళ్లలో 3,000కు..: 2021 సెపె్టంబర్‌ 15 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు హరూన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహా్మన్‌ జునైద్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంలో అత్యంత సంపన్నులు పది రెట్లు పెరిగినట్టు.. 2011 నాటికి 100లోపున్న వీరి సంఖ్య 1007కు చేరుకుందని చెప్పారు. ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుకోవచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. డాలర్‌ బిలియనీర్ల పరంగా రానున్న ఐదేళ్లలో 250 మంది పెరగొచ్చని చెప్పారు.

మహిళామణులు..
ఈ జాబితాలోనూ మహిళా సంపన్నులను పరిశీలించినట్టయితే.. గోద్రేజ్‌ కుటుంబం నుంచి స్మితా వి సృష్ణ కనిపిస్తారు. ఆమె సంపద రూ.31,300 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 3 శాతం మేర ఆమె సంపద విలువ క్షీణించింది. బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సంపద విలువ రూ.28,200 కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో ఆమె సంపద సైతం 11 శాతం క్షీణించింది.  

ముంబై టాప్‌
1007 మంది అత్యంత సంపన్నుల్లో 255 మంది ముంబైకి చెందినవారే కావడం గమనార్హం. ఢిల్లీ 167 మంది, బెంగళూరులో 85 మందికి నివాస కేంద్రంగా ఉంది. 1,007 మందిలో డాలర్‌ బిలియనీర్లు 237 మంది ఉన్నారు. ఫార్మా నుంచి 40 మంది ఈ జాబితాలో నిలిచారు. ఆ తర్వాత కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ నుంచి 27 మంది, సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి 22 మంది ఉన్నారు. 100 మంది అత్యంత సంపన్నుల్లో 13 మంది 1990ల్లో జన్మించిన వారు కాగా.. వీరంతా కూడా సొంత సామర్థ్యాలతోనే ఈ స్థాయికి చేరినట్టు (వారసత్వంగా వచి్చంది కాకుండా) నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement