Wealthy businessman
-
అదానీ జోరు.. ఎలన్‌మస్క్, జెఫ్‌బేజోస్ బేజారు !
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మించిపోయారు. 2021లో ఏకంగా 49 బిలియన్ డాలర్లు (రూ.3.67 లక్షల కోట్లు) మేర తన సంపద విలువను పెంచుకున్నారు. ప్రపంచంలో టాప్–3 బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్వీఎంహెచ్) పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్‌వర్త్ వృద్ధి గతేడాది ఎక్కువగా ఉందని ‘ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022’ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ ముకేశ్ అంబానీ మొత్తం 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయునిగా ఈ జాబితాలో కొనసాగారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వార్షికంగా చూస్తే 2021లో ఆయన సంపద 24 శాతం పెరిగింది. అంబానీ తర్వాత అదానీయే ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు. ఆయన సంపద 2021లో 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరింది. గత పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ సంపద 1,830 శాతం ఎగసింది. ప్రపంచ బిలియనీర్లలో అదానీకి 12వ ర్యాంకు లభించింది. హెచ్‌సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 46వ ర్యాంకు) ఉంటే.. 26 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా, 25 బిలియన్ డాలర్ల విలువతో లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్యం గణాంకాలు.. ► గౌతమ్ అదానీ సంపద 2020లో 17 బిలియన్ డాలర్లు ఉంటే.. రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీని లిస్ట్ చేసిన తర్వాత ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ► 2021లో ముకేశ్ అంబానీ సంపద 20 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. సంపదను పెంచుకునే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ముకేశ్ ఉన్నారు. ► నైకా ప్రమోటర్ ఫాల్గుణి నాయర్ 7.6 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లోకి కొత్తగా అడుగు పెట్టారు. ► గౌతమ్ అదానీ తర్వాత గతేడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్, లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ► హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ నెట్‌వర్త్ గత పదేళ్లలో 400 శాతం వృద్ధి చెందింది. ► 23 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ, ఇంతే నెట్‌వర్త్‌తో హిందుజా గ్రూపు ప్రమోటర్ ఎస్పీ హిందుజా జాబితాలో టాప్ 100లో నిలిచారు. ► చైనాలో 1,133 బిలియనీర్లు, అమెరికాలో 716 మంది, భారత్‌లో 215 మంది ఉన్నారు. ► ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లో ఉండగా, ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మందికి భారత్ కేంద్రంగా ఉంది. ► గత పదేళ్లలో భారత బిలియనీర్లు 700 బిలియన్ డాలర్ల మేర ఉమ్మడిగా సంపదను పెంచుకున్నారు. ఇది స్విట్జర్లాండ్ జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలు. ► బిలియనీర్లకు ముంబై నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడ 72 మంది ఉంటే, ఢిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది ఉన్నారు. ► గత రెండేళ్లలో బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబం సంపద పరంగా 916 ర్యాంకులు మెరుగుపరుచుకుని జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 1083వ ర్యాంకు సొంతం చేసుకుంది. వీరి సంపద 3.3 బిలియన్ డాలర్లు. ► భారత్‌లో 40 మంది గతేడాది బిలియన్ డాల ర్లు అంతకుమించి సంపద పెంచుకున్నారు. ► ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లో మొత్తం 69 దేశాల నుంచి 3,381 బిలియనీర్లకు చోటు లభించింది. అంతక్రితం జాబితా నుంచి చూస్తే 153 మంది కొత్తగా వచ్చి చేరారు. -
అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!
ముంబై: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది. దేశీయంగా ఇంత స్వల్ప కాలంలో భారీగా సంపదను కూడబెట్టుకున్న ఘనత అదానికే సొంతం. మొత్తం మీద దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య 1,007కు చేరుకుంది. ఒకవైపు కరోనా కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోగా.. ఈ 1,007 మంది ఆస్తుల విలువ సగటున 25 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. 10వ హరూన్ ఇండియా ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్ నివేదిక గురువారం విడుదలైంది. రూ.1,000 కోట్లకుపైన సంపద కలిగిన వారిని ఈ జాబితాలోకి తీసుకున్నారు. 1,007 మందిలోలో 894 మంది సంపదను పెంచుకోగా.. 113 మంది సంపద గడిచిన ఏడాదిలో క్షీణించింది. ముకేశ్ నంబర్ 1 1007 మందిలో 13 మంది రూ.లక్ష కోట్లకంటే ఎక్కువే సంపద కలిగి ఉన్నారు. వరుసగా పదో ఏడాది ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. 2020 నాటి నివేదికతో పోలిస్తే ముకేశ్ సంపద 9 శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రూ.5,05,900 కోట్లతో గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది. 2020లో ఉన్న రూ.1,40,200 కోట్ల నుంచి అదానీ సంపద ఏకంగా 261 శాతం పెరిగింది. ఆసియాలోనూ రెండో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ తర్వాతి స్థానానికి అదానీ చేరుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ అయిన శివ్‌నాడార్ ఆయన కుటుంబం రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఏడాది కాలంలో వీరి సంపద 67 శాతం వృద్ధి చెందింది. ఎస్పీ హిందుజా, ఆయన కుటుంబం రూ.2,20,000 కోట్లతో (ఏడాదిలో 53 శాతం వృద్ధి) నాలుగో స్థానంలో, ఎల్ఎన్ మిట్టల్ ఆయన కుటుంబం రూ.1,74,400 కోట్లతో (ఏడాదిలో 187 శాతం పెరుగుదల) ఐదో స్థానంలో, సైరస్ పూనవాలా, ఆయన కుటుంబం రూ.1,63,700 కోట్లతో (ఏడాదిలో 74 శాతం వృద్ధి) ఆరో స్థానంలో ఉన్నారు. డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం రూ.1,54,300 కోట్లతో (ఏడాదిలో77 శాతం వృద్ధి) ఏడో స్థానంలో ఉంది. వినోద్ శాంతిలాల్ అదానీ, ఆయన కుటుంబం రూ.1,31,600 కోట్లతో, కుమార మంగళం బిర్లా, ఆయన కుటుంబం రూ.1,22,200 కోట్లతో, జయ్‌చౌదరి (జెడ్‌స్కేలర్ కంపెనీ అధినేత) రూ.1,21,600 కోట్లతో టాప్–10లో నిలిచారు. జెరోదా నితిన్‌కామత్ ఆయన కుటుంబం రూ.25,600 కోట్లతో 63వ స్థానంలో, బడా ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా, ఆయన కుటుంబం రూ.22,300 కోట్లతో 72వ స్థానం సంపాదించుకున్నారు. ఐదేళ్లలో 3,000కు..: 2021 సెపె్టంబర్ 15 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. గత దశాబ్ద కాలంలో అత్యంత సంపన్నులు పది రెట్లు పెరిగినట్టు.. 2011 నాటికి 100లోపున్న వీరి సంఖ్య 1007కు చేరుకుందని చెప్పారు. ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుకోవచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. డాలర్ బిలియనీర్ల పరంగా రానున్న ఐదేళ్లలో 250 మంది పెరగొచ్చని చెప్పారు. మహిళామణులు.. ఈ జాబితాలోనూ మహిళా సంపన్నులను పరిశీలించినట్టయితే.. గోద్రేజ్ కుటుంబం నుంచి స్మితా వి సృష్ణ కనిపిస్తారు. ఆమె సంపద రూ.31,300 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 3 శాతం మేర ఆమె సంపద విలువ క్షీణించింది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సంపద విలువ రూ.28,200 కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో ఆమె సంపద సైతం 11 శాతం క్షీణించింది. ముంబై టాప్ 1007 మంది అత్యంత సంపన్నుల్లో 255 మంది ముంబైకి చెందినవారే కావడం గమనార్హం. ఢిల్లీ 167 మంది, బెంగళూరులో 85 మందికి నివాస కేంద్రంగా ఉంది. 1,007 మందిలో డాలర్ బిలియనీర్లు 237 మంది ఉన్నారు. ఫార్మా నుంచి 40 మంది ఈ జాబితాలో నిలిచారు. ఆ తర్వాత కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ నుంచి 27 మంది, సాఫ్ట్వేర్ రంగం నుంచి 22 మంది ఉన్నారు. 100 మంది అత్యంత సంపన్నుల్లో 13 మంది 1990ల్లో జన్మించిన వారు కాగా.. వీరంతా కూడా సొంత సామర్థ్యాలతోనే ఈ స్థాయికి చేరినట్టు (వారసత్వంగా వచి్చంది కాకుండా) నివేదిక పేర్కొంది. -
ఫలంలోని మాధుర్యమంతా శ్రమలోనిదే!
సంపన్న వ్యాపారస్తుడు, పరోపకార పారిశ్రామికవేత్త అయిన అజీమ్ ప్రేమ్‌జీ తరచు ఒక మాట చెబుతుంటారు. దొరికిన ఐదు రూపాయల కన్నా, సంపాదించిన రూపాయి ఎక్కువ విలువైనదని! ఎవరినైనా అడిగి చూడండి, ‘‘మీ జీవితంలో మరపురాని విజయం ఏది?’’ అని. సాధారణంగా అది ఎంతో శ్రమకు ఓర్చిన విజయం అయి ఉంటుంది. అసలు ఆ శ్రమ కారణంగానే వారు పొందిన విజయం సంతోషకరమైనది, మరపురానిది, మధురమైనదీ అవుతుంది. పెద్దవాళ్లు ఇంకో మాట కూడా అంటుంటారు, తేలిగ్గా వచ్చింది తేలిగ్గా పోతుందని. ఆ మాట ఎలా ఉన్నా, ప్రేమ్‌జీ అన్నట్లు కష్టపడి సంపాదించిన దానికి విలువెక్కువ. విలువ ఎక్కువ కాబట్టి కష్టపడి దాని నిలుపుకుంటాం. అంటే తేలిగ్గా పోదు అని. ఒకవేళ పోయినా, అది అవసరంలో ఉన్నవారికే చేరుతుంది. ‘‘నువ్వు సృష్టించిన సంపద మొదట అవసరంలో ఉన్నవారికి, సహాయానికి విలువ ఇచ్చేవారికి అందాలి’’ అంటారు మరో పరోపకార సంపన్నుడు బిల్ గేట్స్. అయితే సంపదను సృష్టించడం అంత తేలికా? కాదు. చెమటోడ్చాలి. సహనం ఉండాలి. వినయ విధేయతలు ఉండాలి. కలిసి పనిచేస్తున్నప్పుడు శ్రమ విలువలను గుర్తించగలిగి ఉండాలి. ఇవ్వవలసింది ఇవ్వాలి. అప్పుడే పొందవలసింది పొందుతాం. దీన్నంతా ఒక చిన్న కథగా చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకావిడకు కొత్తగా తెరచిన దుకాణంలోకి వెళ్లినట్టు కలొచ్చింది. కౌంటర్లో సాక్షాత్తూ ఆ దేవుడే ఉన్నాడు! ‘‘ఇక్కడ మీరేం అమ్ముతారు?’’ అని అడిగింది ఆవిడ. ‘‘నీ మనసు కోరుకున్నది ఏదైనా ఇక్కడ దొరుకుతుంది’’ అని చెప్పాడు దేవుడు. ఆవిడ బాగా ఆలోచించి, ‘‘నాకు మనశ్శాంతి కావాలి. ప్రేమ కావాలి. సంతోషం కావాలి. వివేకం కావాలి. అన్ని భయాల నుంచి విముక్తి కావాలి’’ అని అడిగింది. దేవుడు నవ్వాడు. ‘‘అమ్మా, ఇక్కడ పండ్లు దొరకవు. విత్తనాలు మాత్రమే లభ్యమౌతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా మారి, చెట్టుగా ఎదిగితే అప్పుడు వాటి నుంచి నీకు ఫలాలు వస్తాయి’’ అని చెప్పాడు. ‘‘విత్తనాలా?’’ అంది ఆవిడ నిరుత్సాహంగా. ‘‘అవును. ఈ విత్తనాలు తీసుకెళ్లి నాటుకోవాలి. మొలకెత్తాక ఏపుగా పెరగడానికి ఎరువులు వేయాలి. పిట్టల్నుంచి, పశువుల నుంచి ఆ మొక్కలను కాపాడుకోవాలి. చిత్తశుద్ధితో, అంకితభావంతో, ప్రేమతో వాటిని పెంచుకోవాలి. ఫలాలు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం సహనం. పురుగు పట్టినప్పుడు, తెగులు చేరినప్పుడు కష్టపడి వాటిని వదిలించాలి. మళ్లీ చేరకుండా జాగ్రత్తలు వహించాలి. అంటే వాటి కోసం శ్రమించాలి. అప్పుడే నీ శ్రమ ఫలిస్తుంది’’ అని చెప్పాడు దేవుడు. కష్టపడందే ఫలితం ఉండదని ఇందులోని అంతరార్థం. కష్టపడి సాధించిన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకుంటామని పరమార్థం. సుఖసంతోషాలైనా, సంపదలైనా శ్రమకోర్చి సంపాదించుకున్నవైతేనే కలకాలం నిలుస్తాయి.