ఫలంలోని మాధుర్యమంతా శ్రమలోనిదే!
సంపన్న వ్యాపారస్తుడు, పరోపకార పారిశ్రామికవేత్త అయిన అజీమ్ ప్రేమ్‌జీ తరచు ఒక మాట చెబుతుంటారు. దొరికిన ఐదు రూపాయల కన్నా, సంపాదించిన రూపాయి ఎక్కువ విలువైనదని! ఎవరినైనా అడిగి చూడండి, ‘‘మీ జీవితంలో మరపురాని విజయం ఏది?’’ అని. సాధారణంగా అది ఎంతో శ్రమకు ఓర్చిన విజయం అయి ఉంటుంది. అసలు ఆ శ్రమ కారణంగానే వారు పొందిన విజయం సంతోషకరమైనది, మరపురానిది, మధురమైనదీ అవుతుంది.
పెద్దవాళ్లు ఇంకో మాట కూడా అంటుంటారు, తేలిగ్గా వచ్చింది తేలిగ్గా పోతుందని. ఆ మాట ఎలా ఉన్నా, ప్రేమ్‌జీ అన్నట్లు కష్టపడి సంపాదించిన దానికి విలువెక్కువ. విలువ ఎక్కువ కాబట్టి కష్టపడి దాని నిలుపుకుంటాం. అంటే తేలిగ్గా పోదు అని. ఒకవేళ పోయినా, అది అవసరంలో ఉన్నవారికే చేరుతుంది.
‘‘నువ్వు సృష్టించిన సంపద మొదట అవసరంలో ఉన్నవారికి, సహాయానికి విలువ ఇచ్చేవారికి అందాలి’’ అంటారు మరో పరోపకార సంపన్నుడు బిల్ గేట్స్. అయితే సంపదను సృష్టించడం అంత తేలికా? కాదు. చెమటోడ్చాలి. సహనం ఉండాలి. వినయ విధేయతలు ఉండాలి. కలిసి పనిచేస్తున్నప్పుడు శ్రమ విలువలను గుర్తించగలిగి ఉండాలి. ఇవ్వవలసింది ఇవ్వాలి. అప్పుడే పొందవలసింది పొందుతాం. దీన్నంతా ఒక చిన్న కథగా చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది.
ఒకావిడకు కొత్తగా తెరచిన దుకాణంలోకి వెళ్లినట్టు కలొచ్చింది. కౌంటర్‌లో సాక్షాత్తూ ఆ దేవుడే ఉన్నాడు! ‘‘ఇక్కడ మీరేం అమ్ముతారు?’’ అని అడిగింది ఆవిడ. ‘‘నీ మనసు కోరుకున్నది ఏదైనా ఇక్కడ దొరుకుతుంది’’ అని చెప్పాడు దేవుడు. ఆవిడ బాగా ఆలోచించి, ‘‘నాకు మనశ్శాంతి కావాలి. ప్రేమ కావాలి. సంతోషం కావాలి. వివేకం కావాలి. అన్ని భయాల నుంచి విముక్తి కావాలి’’ అని అడిగింది. దేవుడు నవ్వాడు. ‘‘అమ్మా, ఇక్కడ పండ్లు దొరకవు. విత్తనాలు మాత్రమే లభ్యమౌతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా మారి, చెట్టుగా ఎదిగితే అప్పుడు వాటి నుంచి నీకు ఫలాలు వస్తాయి’’ అని చెప్పాడు.
‘‘విత్తనాలా?’’ అంది ఆవిడ నిరుత్సాహంగా.
‘‘అవును. ఈ విత్తనాలు తీసుకెళ్లి నాటుకోవాలి. మొలకెత్తాక ఏపుగా పెరగడానికి ఎరువులు వేయాలి. పిట్టల్నుంచి, పశువుల నుంచి ఆ మొక్కలను కాపాడుకోవాలి. చిత్తశుద్ధితో, అంకితభావంతో, ప్రేమతో వాటిని పెంచుకోవాలి. ఫలాలు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం సహనం.
పురుగు పట్టినప్పుడు, తెగులు చేరినప్పుడు కష్టపడి వాటిని వదిలించాలి. మళ్లీ చేరకుండా జాగ్రత్తలు వహించాలి. అంటే వాటి కోసం శ్రమించాలి. అప్పుడే నీ శ్రమ ఫలిస్తుంది’’ అని చెప్పాడు దేవుడు. కష్టపడందే ఫలితం ఉండదని ఇందులోని అంతరార్థం. కష్టపడి సాధించిన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకుంటామని పరమార్థం. సుఖసంతోషాలైనా, సంపదలైనా శ్రమకోర్చి సంపాదించుకున్నవైతేనే కలకాలం నిలుస్తాయి.