కొందరే దేశాన్ని శాసించడం ప్రజాస్వామ్యానికి ముప్పే
వీడ్కోలు ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోందని, ఇది నిజంగా ప్రమాదకరమైన పరిణామం అని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ధనవంతులు దేశాన్ని శాసించే పరిస్థితి రావడం సరైంది కాదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే బడాబాబులు పెత్తనం సాగించే అవకాశం ఉండొద్దని చెప్పారు. బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఆయన అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్‌కు అప్పగించబోతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం శ్వేతసౌధంలో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసు నుంచి జో బైడెన్ ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ శిక్ష నుంచి తప్పించే అవకాశం ప్రస్తుతం ఉందని, ఈ పరిస్థితి కచి్చతంగా మారాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు.
ట్రంప్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన దోషిగా తేలిన సంగతిని పరోక్షంగా ప్రస్తావించారు. శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం అధ్యక్షుడికి ఇవ్వొద్దని పేర్కొన్నారు. పిడికెడు మంది సంపన్నులు, బలవంతుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం ప్రమాదకరమని వెల్లడించారు. వారు అధికార దురి్వనియోగానికి పాల్పడితే ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే అలాంటివారిని నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావితం చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలి
సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం పట్ల బైడెన్ స్పందించారు. సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం అనే ఊబిలో అమెరికా కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా అనేది కనుమరుగు అవుతోందని, ఎడిటర్లు అనేవారు కనిపించడం లేదని అన్నారు.
సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ అనేది లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. అసత్యాల వెల్లువలో సత్యం మరుగునపడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు స్వార్థపరులు అధికారం, లాభార్జన కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారని బైడెన్ ఆరోపించారు. మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, అధికార దురి్వనియోగం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలని స్పష్టంచేశారు.
తగిన నిబంధనలు, రక్షణలు అమల్లో లేకపోతే కృత్రిమ మేధ(ఏఐ) కోరలు మరింతగా విస్తరిస్తాయని, మానవ హక్కులకు, గోప్యతకు భంగం వాలిల్లుతుందని హెచ్చరించారు. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము విత్తనాలు నాటామని, వాటి ఫలితాలు తర్వాత కనిపిస్తాయని జో బైడెన్ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment