న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత సంపదలో భారతీయ కుబేరులు గ్లోబల్ బిలియనీర్లనుదాటి ట్రిలియనీర్లుగా దూసుకు పోతున్నారు. దేశంలో 12 మంది అపర కుబేరుల నికర విలువ రూ. ఒక ట్రిలియన్ కంటే ఎక్కువేనని తాజా నివేదిక తేల్చింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే అదానీ గత ఏడాది రోజుకు 1,600 కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ రూ. 10.9 ట్రిలియన్లకు పైగా నికర విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో మూడో ధనవంతుడిగా ఉన్నారు. ఇటీవల అదానీ ప్రపంచంలో రెండో రిచెస్ట్‌పర్సన్‌గా నిలిచిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అదానీ, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ , బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాత భూమిపై మూడో అత్యంత ధనవంతుడు.
అంబానీకి షాకిచ్చిన అదానీ
సంపద నిర్వహణ సంస్థ ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌ల ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ రూ. 10,94,400 కోట్ల నికర విలువతో సంపన్న భారతీయుల జాబితాలో టాప్‌లో ఉన్నారు. తద్వారా గతేడాది జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టేశారు. అంబానీ రూ. 7,94,700 కోట్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 జాబితా బుధవారం వెల్లడైంది. 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని నివేదించింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్, రాధాకిషన్ దమానీ పేర్లు ఉన్నాయి.
2022లో బొగ్గు-పోర్ట్-టు-ఎనర్జీ సంస్థ అదానీ గ్రూపు సంపద అప్రతిహతంగా ఎగిసింది. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు, ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక కంపెనీ అదానీ అని హురున్ ఇండియా ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. అంతేకాదు రూ. 1.6 ట్రిలియన్ల నికర విలువతో అదానీ తమ్ముడు వినోద్ అదానీ కూడా ఆరో స్థానంలో ఉన్నారు.
ఇక ఈ జాబితాలో సీరం వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా ,హెచ్‌సీఎల్ శివ్ నాడార్ ఉన్నారు. వీరి సంపద వరుసగా రూ. 2 ట్రిలియన్లు, రూ. 1.85 ట్రిలియన్లుగా ఉంది. అలాగే ట్రిలియనీర్ల జాబితాలో రాధాకిషన్ దమానీ, ఎస్పీ హిందుజా, ఎల్‌ఎన్ మిట్టల్, దిలీప్ షాంఘ్వీ, ఉదయ్ కోటక్, కుమార్ మంగళం బిర్లా , నీరాజ్ బజాజ్ ఉన్నారు. వీరితో పాటు షాంఘ్వీ ,కోటక్ ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
జాబితాలో క్విక్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జెప్టో వ్యవస్థాపకురాలు అతి పిన్న వయస్కురాలు 19 ఏళ్ల కైవల్య వోహ్రా, మరొక స్టార్టప్ వ్యవస్థాపకురాలు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ ఉన్నారు. వీరిద్దరూ బయోకాన్ ఎండీ కిరణ్ మంజుందార్-షాను అధిగమించి మరీ " రిచెస్ట్‌సెల్ఫ్ మేడ్ ఇండియన్ విమెన్" గా నిలిచారు. వేదాంత్ ఫ్యాషన్ వ్యవస్థాపకుడు రవి మోడీ నికర విలువలో 376 శాతం జంప్‌తో జాబితాలో అత్యధికంగా సాధించిన వారిగా నిలిచారు. సంపన్నుల జాబితాలో 283 మంది వ్యక్తులతో ముంబై టాప్‌లో ఉంది. ఆ తరువాత న్యూ ఢిల్లీలో 185 మంది , బెంగళూరు 89 మంది రూ. 1,000 కోట్లకు పైగా నికర విలువను కలిగి ఉన్నారని నివేదిక తేల్చింది. 100 మంది స్టార్టప్ వ్యవస్థాపకుల నికర విలువ 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక చూపింది.
Comments
Please login to add a commentAdd a comment