చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.
చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.
చైనా కంటే భారత్‌లో పెరుగుదల
చైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: కొత్త అప్‌డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!
చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్
హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్‌లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment