venture capital
-
అంకురాలకు తగ్గుతున్న ఆదరణ.. కానీ..
ముంబై: అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై మాత్రం ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దేశీ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రైవేట్ పెట్టుబడులను విశ్లేషించే వెంచర్ ఇంటెలిజెన్స్, పరిశ్రమ సమాఖ్య ఐవీసీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది (2022లో) 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే గతేడాది 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248కి, పరిమాణం 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, నిధుల ప్రవాహం మందగించడం తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో మరింత భారీగా పెట్టుబడులు రాగలవని ఐవీసీఏ (ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రజత్ టాండన్ తెలిపారు. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య తగ్గినా భారీ స్థాయి పెట్టుబడులు రావడమనేది గణనీయమైన విలువను, స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడాన్ని సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్‌లో మణిపాల్ హాస్పిటల్లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. తదుపరి జూన్‌లో హెచ్డీఎఫ్సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి. ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్‌లో అవాడా వెంచర్స్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్‌ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్‌కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది. ► రంగాలవారీగా పరిశీలించినప్పుడు హెల్త్‌కేర్.. లైఫ్ సైన్సెస్‌లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 30.2 శాతం పెరిగాయి. అలాగే ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్‌లో (199.8 శాతం) ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. ► ఐటీ..ఐటీఈఎస్ రంగంలో పెట్టుబడులు 64.5 శాతం క్షీణించాయి. అలాగే బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా)లోకి 47.6 శాతం, తయారీలోకి 43 శాతం, ఇంజినీరింగ్.. నిర్మాణ రంగాల్లోకి 64 శాతం మేర ఇన్వెస్ట్మెంట్లు పడిపోయాయి. షిప్పింగ్ .. లాజిస్టిక్స్‌లోకి 60.6 శాతం, విద్యా రంగంలోకి 78.4 శాతం, ఎఫ్ఎంసీజీలో 48.5 శాతం, అగ్రి బిజినెస్‌లోకి 81 శాతం, ఫుడ్ అండ్ బెవరేజెస్లోకి 70 శాతం, టెలికంలోకి 84 శాతం పెట్టుబడులు క్షీణించాయి. ఇదీ చదవండి: 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. ► టాప్ పీఈ నిష్క్రమణలను చూస్తే.. టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా.. ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను వాల్‌మార్ట్‌కు 1.78 బిలియన్ డాలర్లకు విక్రయించాయి. లెన్స్‌కార్ట్‌లో ఇన్వెస్టర్లు షిరాటే వెంచర్స్, ప్రేమ్‌జీఇన్వెస్ట్, యునీలేజర్ వెంచర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, టీఆర్ క్యాపిటల్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎపిక్ క్యాపిటల్ తమ వాటాలను అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 410 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ ఇన్వెస్టర్లు సోఫినా, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్, ఫైర్‌సైడ్ వెంచర్స్, షార్ప్ వెంచర్స్ .. పబ్లిక్ ఇష్యూలో తమ వాటాలను విక్రయించి 133 మిలియన్ డాలర్లు సమీకరించాయి. -
దేశీ స్టార్టప్స్‌లోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్‌లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది 38 శాతం క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నిధుల సమీకరణ, పెట్టుబడుల కార్యకలాపాలపై ప్రభావం పడటమే ఇందుకు కారణం. డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021లో 33.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 1,715 డీల్స్ కుదరగా 2022లో 1,726 ఒప్పందాలు కుదిరినా పెట్టుబడుల పరిమాణం 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. టాప్ 4 మార్కెట్లలో భారత్.. వీసీ పెట్టుబడుల పరిమాణం, విలువపరంగా చైనా తర్వాత ఆసియా–పసిఫిక్ దేశాల్లో భారత్ కీలక మార్కెట్‌గా ఉందని గ్లోబల్‌డేటా లీడ్ అనలిస్ట్ అరోజ్యోతి బోస్ తెలిపారు. అంతర్జాతీయంగా టాప్ 4 మార్కెట్లలో (అమెరికా, బ్రిటన్, చైనా, భారత్) ఒకటిగా ఉందని పేర్కొన్నారు. 2022లో అంతర్జాతీయంగా వీసీ ఫండింగ్‌లో విలువపరంగా 5.1 శాతం, పరిమాణంపరంగా 6.3 శాతం మేర భారత్ వాటా దక్కించుకుంది. అమెరికా, బ్రిటన్, చైనాలో 2022లో డీల్స్ పరిమాణం క్షీణించగా భారత్ మాత్రం 0.6 శాతం వృద్ధితో ప్రత్యేకంగా నిల్చింది. గ్లోబల్‌డేటా ప్రకారం 2021లో వీసీ ఫండింగ్ డీల్ సగటు విలువ 19.7 బిలియన్ డాలర్లుగా ఉండగా 2022లో 12.1 మిలియన్ డాలర్లకు తగ్గింది. అలాగే 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య 2021లో 86గా ఉండగా గతేడాది 42కి తగ్గింది. ఇన్వెస్టర్లకు గణనీయంగా రాబడులు ఇవ్వగలిగే కంపెనీల కొరత కూడా వీసీ పెట్టుబడుల తగ్గుదలకు కారణమైందని బోస్ వివరించారు. వర్ధమాన దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. -
360 వన్‌కు ముంబై ఏంజెల్స్‌లో నియంత్రణ వాటా
న్యూఢిల్లీ: ఆరంభ స్థాయి కంపెనీల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే ‘ముంబై ఏంజెల్స్’లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నట్టు 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) ప్రకటించింది. ఆరంభ స్థాయి పెట్టుబడుల విభాగంలో ముంబై ఏంజెల్స్ ప్రముఖ సంస్థగా ఉందని, ఈ కొనుగోలుతో స్టార్టప్‌లలో పెట్టుబడులను మరింత విస్తతం చేయనున్నట్టు తెలిపింది. తమ ఇన్వెస్టర్లకు మరింత విస్తృత శ్రేణి డీల్స్‌ను ఆఫర్ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం ద్వారా, తమ ఇన్వెస్టర్ల సంపద వృద్ధికి సాయపడనున్నట్టు వివరించింది. మరోవైపు ముంబై ఏంజెల్స్ రెండు నూతన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను ఈ సందర్భంగా ప్రకటించింది. ఆరంభ దశలోని కంపెనీల్లో ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను వీటి ద్వారా తమ క్లయింట్లకు అందించొచ్చని 360వన్ ఎండీ, సీఈవో కరణ్ భగత్ తెలిపారు. -
India Game Developers Conference: 8 బిలియన్ డాలర్లకు దేశీ గేమింగ్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2027 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది 2.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అలాగే, గేమ్స్ ఆడేందుకు చెల్లించే వారి సంఖ్య 12 కోట్లకు చేరింది. గేమర్లు సగటున 20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ల్యూమికాయ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) సదస్సులో దీన్ని విడుదల చేశారు. సుమారు 2,250 మంది గేమర్లు, థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లు, పరిశ్రమ దిగ్గజాలపై సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గత రెండేళ్లు దేశీ గేమింగ్ సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని ల్యూమికాయ్ వ్యవస్థాపక జనరల్ పార్ట్నర్ సలోని సెహ్గల్ తెలిపారు. మూడు సంస్థలు యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగాయని, ఒక సంస్థ స్టాక్ ఎక్సే్చంజీల్లో కూడా లిస్ట్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దేశీ గేమింగ్ పరిశ్రమలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు రాబోతున్నాయని వివరించారు. నవంబర్ 3న ప్రారంభమైన ఐజీడీసీ మూడు రోజుల పాటు 5 వరకూ జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా పలు గేమింగ్ సంస్థలు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► భారత్‌లో గేమర్ల సంఖ్య 50.7 కోట్లు. ఇందులో పెయిడ్ యూజర్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. ► 1500 కోట్ల డౌన్లోడ్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొబైల్ గేమ్స్‌కు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగ దేశంగా భారత్ నిలుస్తోంది. హిట్‌వికెట్ భారీ నిధుల సమీకరణ హైదరాబాదీ గేమింగ్ యాప్ సంస్థ హిట్‌వికెట్ తాజాగా ప్రైమ్ వెంచర్ పార్ట్నర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కాశ్యప్ రెడ్డి, కీర్తి సింగ్ వెల్లడించారు. గేమింగ్ స్టూడియో, ప్రపంచ స్థాయికి క్రికెటింగ్ అనుభూతిని అందించే గేమ్‌లను తీర్చిదిద్దేందుకు వీటిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అలాగే హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గేమింగ్ విభాగంలో స్థానిక స్టార్టప్‌లు ముందు వరుసలో ఉండటం సంతోషకరమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
భారత్ ఆ ట్రెండ్‌ని మార్చింది.. ఆగస్ట్‌లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: గత నెల(ఆగస్ట్)లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ నుంచి దేశీ స్టార్టప్‌లకకు 99.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. డేటా ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా వివరాల ప్రకారం 128 స్టార్టప్‌లు నిధులను సమీకరించాయి. జులైతో పోలిస్తే ఆగస్ట్‌లో పెట్టుబడులు 9.7 శాతం ఎగశాయి. ఆగస్ట్‌లో వీసీ పెట్టుబడులు బిలియన్ డాలర్లను చేరనప్పటికీ క్షీణతకు అడ్డుకట్ట పడినట్లు గ్లోబల్ డేటా ప్రధాన నిపుణులు ఔరోజ్యో తి బోస్ పేర్కొన్నారు. లావాదేవీల పరిమాణం 2.3 శాతం తగ్గినప్పటికీ నిధుల సమీకరణలో వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇదే కాలంలో యూఎస్, యూకే తదితర గ్లోబల్ మార్కెట్లలో నిధుల సమీకరణ వెనకడుగులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ట్రెండ్‌ను ఇండియా, చైనా మాత్రమే అధిగమించినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి–ఆగస్ట్ కాలంలో 1,239 వీసీ పెట్టుబడుల డీల్స్ నమోదైనట్లు ప్రస్తావించారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీ మార్కెట్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. గత నెల(ఆగస్ట్)లో 80 శాతం పడిపోయి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇవి 19 నెలల కనిష్టంకాగా.. 2021 ఆగస్ట్‌లో 11.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించినట్లు ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నెలవారీ నివేదిక వెల్లడించింది. 2022 జులైలో 4.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించగా.. ఈ ఆగస్ట్‌లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ 3.1 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. నివేదిక ప్రకారం గత నెలలో 83 డీల్స్ ద్వారా పెట్టుబడులు లభించగా.. దేశీ కంపెనీలలో 97.2 కోట్ల డాలర్ల విలువైన ఐదు భారీ లావాదేవీలు నమోదయ్యాయి. హెల్త్‌కేర్‌ను మినహాయిస్తే అధిక రంగాలలో పెట్టుబడులు క్షీణించినట్లు ఈవై పార్టనర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు 485 శాతం జంప్‌చేయగా.. 3.1 బిలియన్ డాలర్ల విలువైన 25 ఎగ్జిట్ డీల్స్ జరిగినట్లు నివేదిక వివరించింది. జులైలో 32.2 కోట్ల డాలర్ల విలువైన 9 అమ్మకపు డీల్స్ మాత్రమే నమోదయ్యాయి. అయితే 2021 ఆగస్ట్‌లోనూ 7.4 బిలియన్ డాలర్ల విలువైన 42 లావాదేవీలు నమోదుకావడం గమనార్హం! -
ప్రథమార్ధంలో పెట్టుబడుల జోరు!
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే 28 శాతం ఎగిసి 34.1 బిలియన్ డాలర్లకు చేరాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై .. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2022 ప్రథమార్ధంలో 714 డీల్స్ కుదిరాయి. వీటిలో 92 ఒప్పందాల విలువ సుమారు 23.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వార్షికంగా చూస్తే పెరిగినప్పటికీ సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం పీఈ, వీసీ పెట్టుబడులు 32 శాతం తగ్గినట్లు ఈవై ఇండియా పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. గతేడాది ద్వితీయార్థంలో ఇవి 50.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ♦కొత్త పెట్టుబడుల్లో అత్యధికంగా 54 శాతం వాటాను అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. 506 డీల్స్ ద్వారా 13.3 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది ప్రథమార్ధంలో 327 ఒప్పందాల ద్వారా వీటిలోకి 8.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ♦ రంగాలవారీగా చూస్తే ఆర్థిక సేవల విభాగంలో అత్యధికంగా 152 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 7.3 బిలియన్ డాలర్లు. చెరి 4 బిలియన్ డాలర్లతో ఈ–కామర్స్, టెక్నాలజీ రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ–కామర్స్‌లో 101 డీల్స్, టెక్నాలజీ రంగంలో 121 ఒప్పందాలు కుదిరాయి. ఈ–కామర్స్‌లోకి పెట్టుబడులు 16 శాతం, టెక్నాలజీలోకి 20 శాతం తగ్గాయి. ♦మీడియా .. వినోదం, లాజిస్టిక్స్, విద్య రంగాలపై ఆసక్తి పెరిగింది. విద్యా రంగంలోకి 2.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. 42 డీల్స్ కుదిరాయి. ♦ప్రథమార్ధంలో వార్షికంగా చూస్తే కుదిరిన ఒప్పందాలు 37 శాతం పెరిగాయి. 522 డీల్స్ నుంచి 714కి చేరాయి. అయితే, 2021 ద్వితీయార్థంతో పోలిస్తే 748 నుంచి 4 శాతం తగ్గాయి. ♦92 భారీ ఒప్పందాలు (100 మిలియన్ డాలర్ల పైబడి) కుదిరాయి. వీటి విలువ 23.7 బిలియన్ డాలర్లు. గతేడాది ప్రథమార్ధంలో 19.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 70 డీల్స్ నమోదయ్యాయి. తాజాగా కుదిరిన ఒప్పందాల్లో వయాకామ్18లో బోధి ట్రీ 40 శాతం వాటాలు తీసుకోవడం (విలువ 1.8 బిలియన్ డాలర్లు), డైలీహంట్‌లో సుమేరు వెంచర్స్ మొదలైన ఇన్వెస్టర్లు 805 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిన డీల్స్ ఉన్నాయి. ♦ఐపీవోలు, ఇతరత్రా మార్గాల్లో వాటాలు విక్రయించుకుని పీఈ/వీసీలు కొన్ని సంస్థల నుంచి నిష్క్రమించాయి. ఈ కోవకు చెందిన 120 డీల్స్ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ♦ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు, కఠిన పరపతి విధానాలు, ధరల పెరుగుదల వంటి ప్రతికూలాంశాలతో సీక్వెన్షియల్‌గా పోలిస్తే పెట్టుబడులు తగ్గినప్పటికీ ప్రథమార్ధంలో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. నెలకు దాదాపు 6 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. -
స్టార్టప్‌లతో 10 కోట్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్ క్యాపిటల్ సంస్థ సెకోయా క్యాపిటల్ ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్‌లు ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్‌పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్ చేసిన భారత్‌పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్ డాలర్లు, అలాగే భారత స్టార్టప్ సంస్థల్లోకి 40 బిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్‌లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. -
రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు
ముంబై: దేశీయంగా గత నెలలో పీఈ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 2021 మే నెలతో చూస్తే 42 శాతం ఎగసి 5.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 7.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 29 శాతం క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం డీల్ పరిమాణం భారీగా పెరిగింది. గతేడాది మేలో నమోదైన 66 నుంచి 109కు డీల్స్ సంఖ్య ఎగసింది. ఈ ఏప్రిల్‌లో మాత్రం ఇంతకంటే అధికంగా 117 లావాదేవీలు జరిగాయి. 2022 మే నెలలో ప్రధానంగా రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు అధిక పెట్టుబడులను సాధించాయి. 1.7 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. ఇక 10 కోట్ల డాలర్ల విలువైన 14 భారీ డీల్స్ సైతం మే నెలలో జరిగాయి. వీటి మొత్తం విలువ 3.9 బిలియన్ డాలర్లుకాగా.. అపోలో గ్లోబల్ నుంచి అదానీ గ్రూప్ నిర్వహణలోని ముంబై ఎయిర్పోర్ట్ సమీకరించిన 75 కోట్ల డాలర్లు వీటిలో కలసి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. -
స్టార్టప్స్‌లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు
ముంబై: గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో అంకుర సంస్థల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్‌లో 1.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్‌లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్ వివరించారు. పెట్టుబడులకు రిస్కులు.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఏప్రిల్‌లో వర్స్ ఇన్నోవేషన్స్ అత్యధికంగా 805 మిలియన్ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్. ► భారీ స్థాయి డీల్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 2.7 బిలియన్ డాలర్లు. ► ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది. ► ఏప్రిల్‌లో 16 ఫండ్లు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్ డాలర్లు సేకరించాయి. భారత్‌లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్ క్యాపిటల్ ఫండ్ ఈసారి అత్యధికంగా 670 మిలియ్ డాలర్లు దక్కించుకుంది. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: ఈ మార్చిలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు 22 శాతం క్షీణించాయి. 107 డీల్స్ ద్వారా 4.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక జనవరి–మార్చి కాలంలో లావాదేవీల పరిమాణం 54 శాతం జంప్‌చేసి 15.5 బిలియన్ డాలర్లను అధిగమించింది. 360 డీల్స్ జరిగాయి. ప్రధానంగా స్టార్టప్ విభాగం ఇందుకు దోహదపడినట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నెలవారీ నివేదిక పేర్కొంది. పీఈ, వీసీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ మార్కెట్‌గా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు అభిప్రాయపడింది. స్థూల ఆర్థికాంశాలలో పురోభివృద్ధి, పాలసీ నిలకడ ఇందుకు మద్దతివ్వనున్నప్పటికీ భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కఠిన పరపతి విధానాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తదితర రిస్క్లున్నట్టు ఈవై పార్టనర్ వివేక్ సోనీ వివరించారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి అమ్మకాలు వీక్ గత ఐదు త్రైమాసికాల్లోనే అత్యంత తక్కువగా ఎగ్జిట్ డీల్స్ 16 శాతం నీరసించి 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. భారీ వ్యూహాత్మక, సెకండరీ డీల్స్ లోపించడం ప్రభావం చూపింది. పీఈ పెట్టుబడులుగల ఐపీవోలు సైతం తగ్గడంతో పీఈ, వీసీ విక్రయాలు మందగించాయి. పెట్టుబడుల విషయానికివస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో 10.1 బిలియన్ డాలర్ల విలువైన 45 భారీ డీల్స్ జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 6.7 బిలియన్ డాలర్ల విలువైన 30 భారీ డీల్స్ నమోదయ్యాయి. ఇక అంతక్రితం త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన 53 భారీ డీల్స్ జరిగాయి. 77 శాతం అధికం రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి చూస్తే మార్చి క్వార్టర్లో మొత్తం పెట్టుబడులు(బెట్స్) 13.9 బిలియన్ డాలర్లను తాకాయి. ఇది 77 శాతం వృద్ధికాగా.. గతేడాది ఇదే కాలంలో 7.8 బిలియన్ డాలర్లు మాత్రమే నమోదయ్యాయి. అయితే డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 21.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 36 శాతం తక్కువ. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ 255 డీల్స్ ద్వారా 7.7 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది జనవరి–మార్చిలో 175 డీల్స్ ద్వారా 2.8 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. డిసెంబర్ త్రైమాసికంలో 233 డీల్స్ ద్వారా 9.6 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల విషయంలో ఐదు రంగాలు వీటిని అందుకున్నాయి. 71 డీల్సద్వారా ఫైనాన్షియల్ సర్వీసులు గరిష్టంగా 3.2 బిలియన్ డాలర్లు పొందాయి. ఈ బాటలో 47 డీల్స్ ద్వారా ఈకామర్స్ 2.7 బిలియన్ డాలర్లు, 59 లావాదేవీల ద్వారా టెక్నాలజీ రంగం 2.6 బిలియన్ డాలర్లు సాధించాయి. మార్చి క్వార్టర్లో నిధుల సమీకరణ 4.6 బిలియన్ డాలర్లకు జంప్‌చేసింది. గతేడాది ఇదే కాలంలో ఇవి కేవలం 1.7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ క్వార్టర్లోనూ 1.6 బిలియన్ డాలర్ల సమీకరణ మాత్రమే జరిగింది. -
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా?'
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వార్త విషయంలో సెరెనా ఫోటోను ప్రచురించకుండా.. తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న సెరెనా విలియమ్స్ న్యూయార్క్ టైమ్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. 40 ఏళ్ల టెన్నిస్ స్టార్ ఈ మధ్యనే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్స్‌ను ప్రారంభించింది. దాదాపు 111 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని సేకరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడిస్తూ సెరెనాపై ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. విషయం సరిగ్గానే ఉన్నప్పటికి ఫోటో విషయంలో మాత్రం పెద్ద పొరపాటే చేసింది. సెరెనా ఫోటోకు బదులు తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు. అప్పటి సెరెనా అనుకొని.. వీనస్ ఫోటోను పబ్లిష్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టికల్తో పాటు ఫోటోను ట్యాగ్ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా స్పందించింది. ''జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి. అందుకే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్‌ను ప్రారంభించాం. దానిపై దాదాపు 111 మిలియన్ యూఎస్ డాలర్ల నిధిని సేకరించాం. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడడం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన సెరెనా ఇటీవలే పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ర్యాంకింగ్స్‌లో 2006 తర్వాత తొలిసారి టాప్ 50లో సెరెనా చోటు దక్కించుకోలేకపోయింది. 2021 నుంచి చూసుకుంటే సెరెనా కేవలం ఆరు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంది. వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సెరెనా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఫిట్నెస్ కారణాలతో తప్పుకుంది. చదవండి: Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్ Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! No matter how far we come, we get reminded that it's not enough. This is why I raised $111M for @serenaventures. To support the founders who are overlooked by engrained systems woefully unaware of their biases. Because even I am overlooked. You can do better, @nytimes. pic.twitter.com/hvfCl5WUoz — Serena Williams (@serenawilliams) March 2, 2022 -
పీఈ, వీసీ ఇన్వెస్టర్లతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఆచరణాత్మక సిఫార్సులను ప్రశంసించిన ప్రధాని .. వారు లేవనెత్తిన సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. సమావేశం సందర్భంగా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు .. దేశీయంగా వ్యవస్థాపక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, భారత స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని పీఈ, వీసీ ఫండ్ల ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. భారత్‌లో పెట్టుబడుల వాతావరణం మరింత సానుకూలంగా మారిందని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి మునీష్ వర్మ చెప్పారు. దేశంలోకి పెట్టుబడులు పుష్కలంగా వస్తుండటం, ఎదుగుతున్న ఎంట్రప్రెన్యూర్లు, స్టాక్ ఎక్సే్చంజీల్లో కంపెనీలు పెద్ద సంఖ్యలో లిస్టవుతుండటం తదితర అంశాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు ఇటువంటి సమావేశాలు స్ఫూర్తినిస్తాయని జనరల్ అట్లాంటిక్ ప్రతినిధి సందీప్ నాయక్ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వచ్చే పదేళ్లలో 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన వివరించారు. అంకుర సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ మోదీని ’స్టార్టప్ ప్రధానమంత్రి’ అంటూ 3వన్4 ప్రతినిధి సిద్ధార్థ్ పాయ్ అభివర్ణించారు. -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్‌తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్‌తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్‌తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది. -
స్టార్టప్ పెట్టుబడులకు వీసీ ఫండ్స్ క్యూ
న్యూఢిల్లీ: కొంతకాలంగా బూమింగ్‌లో ఉన్న దేశీ స్టార్టప్‌ల పరిశ్రమ వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్‌ను భారీగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఏడాది జనవరి–జులై మధ్య కాలంలో ఏకంగా 17.2 బిలియన్ డాలర్ల(రూ. 1.26 లక్షల కోట్లు) పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇవి గత రెండేళ్లలో తొలి 7 నెలల్లో లభించిన పెట్టుబడులతో పోలిస్తే అత్యధికంకావడం విశేషం! 2020 జనవరి–జులై మధ్య దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి 11.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించగా.. 2019 తొలి 7 నెలల్లో 13 బిలియన్ డాలర్లు లభించాయి. దేశీ పీఈ, వీసీ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) సంయుక్తంగా విడుదల చేసిన గణాంకాలివి. అతిపెద్ద డీల్స్.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నమోదైన అతిపెద్ద వీసీ డీల్స్‌లో ఉడాన్, లెన్స్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫార్మ్ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జెటా, క్రెడ్, రేజర్‌పే, హెల్తిఫైమి, బైజూస్, అన్అకాడమీ, ఎరూడిటస్, వేదాంతు, డంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, యెల్లో.ఏఐ, ఎంట్రోపిక్ తదితరాలున్నాయి. ఈ బాటలో ద్వితీయార్థంలోనూ స్టార్టప్ వ్యవస్థలోకి మరిన్ని పెట్టుబడులు ప్రవహించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏఐ, ఎంఎల్, ఎడ్టెక్, ఫుడ్‌టెక్ విభాగాలు వీసీ ఫండ్స్‌ను ఆకట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. క్యూ2లో స్పీడ్ ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో దేశీ స్టార్టప్‌లకు 6.5 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. నాస్కామ్–పీజీఏ ల్యాబ్స్ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ కాలంలో 11 సంస్థలు యూనికార్న్ హోదాను పొందాయి. 2021 క్యూ1(జనవరి–మార్చి)తో పోలిస్తే 2 శాతం అధికంగా ఫండింగ్ 160 డీల్స్ నమోదుకాగా.. పరిశ్రమ వృద్ధిని ప్రతిబింబిస్తూ లభించిన నిధులు సైతం 71 శాతం జంప్ చేశాయి. ఈ కాలంలో 80 కోట్ల డాలర్ల(రూ. 5,930 కోట్లు)తో స్విగ్గీ అతిపెద్ద డీల్‌గా నమోదైంది. ఈ బాటలో షేర్‌చాట్(50.2 కోట్ల డాలర్లు), బైజూస్(34 కోట్ల డాలర్లు), ఫార్మ్ఈజీ(32.3 కోట్ల డాలర్లు), మీషో(30 కోట్ల డాలర్లు) తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఇక పైన్ ల్యాబ్స్(28.5 కోట్ల డాలర్లు), డెల్హివరీ(27.7 కోట్ల డాలర్లు), జెటా(25 కోట్ల డాలర్లు), క్రెడ్(21.5 కోట్ల డాలర్లు), అర్బన్ కంపెనీ(18.8 కోట్ల డాలర్లు) సైతం జాబితాలో చోటు సాధించాయి. వృద్ధి బాటలో 2021 జూన్‌వరకూ 53 సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగినట్లు పీజీఏ ల్యాబ్స్ పేర్కొంది. ఇందుకు క్యూ2 మరింత దోహదం చేసినట్లు తెలియజేసింది. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఫిన్‌టెక్, ఫుడ్‌టెక్, హెల్త్‌టెక్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నట్లు వివరించింది. క్యూ2లో జరిగిన డీల్స్ విలువలో ఫిన్‌టెక్ విభాగం 27 శాతం విలువను సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇదేవిధంగా ఫుడ్‌టెక్ 13 శాతం, ఎంటర్ప్రైజ్ టెక్ 11 శాతం, ఎడ్టెక్ 10 శాతం, మీడియా, ఎంటర్టైన్మెంట్ 8 శాతం చొప్పున పెట్టుబడుల్లో వాటాను పొందాయి. మొత్తం డీల్స్ లో వృద్ధి దశ ఫండింగ్ 61 శాతంగా నమోదైంది. యూనికార్న్ జాబితా క్యూ2లో 100 స్టార్టప్‌లు తొలి దశ నిధులను అందుకున్నాయి. ఇవి మొత్తం పెట్టుబడుల్లో 9 శాతం వాటాకు సమానం. తాజాగా బిలియన్ డాలర్ల విలువను సాధించిన యూనికార్న్ సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, క్రెడ్, మీషో, గ్రో, షేర్‌చాట్, ఫార్మ్ఈజీ, జెటా, బ్రౌజర్‌స్టాక్, మాగ్లిక్స్, గప్‌షుప్, చార్జ్బీ చేరాయి. ఈ కాలంలో స్టార్టప్‌లకు టైగర్ గ్లోబల్ అత్యధికంగా 64 శాతం పెట్టుబడులను సమకూర్చింది. బీటూబీ స్టార్టప్‌లు 85 డీల్స్ ద్వారా 1.9 బిలయన్ డాలర్లు అందుకున్నాయి. సగటు డీల్ పరిమాణం 22 మిలియన్ డాలర్లు. వీటిలో జెటా, రేజర్‌పే, యాక్స్ట్రియా టాప్ త్రీ సంస్థలుగా నిలిచాయి. ఇక బీటూసీ సంస్థలు 75 డీల్స్ ద్వారా 4.2 బిలియన్ డాలర్లు పొందాయి. డీల్ సగటు పరిమాణం 56 మిలియన్ డాలర్లు. వీటిలో స్విగ్గీ, షేర్‌చాట్, బైజూస్ అగ్రస్థానంలో నిలిచాయి. కాగా.. 29 డీల్స్ ద్వారా డీప్‌టెక్ స్టార్టప్‌లకు 450 మిలియన్ డాలర్లు లభించాయి. -
స్టార్టప్‌లకు జోరుగా వెంచర్ క్యాపిటల్ నిధులు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు (ఆరంభ దశలోని కంపెనీలు) వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు అండగా నిలుస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు 16.9 బిలియన్ డాలర్ల (రూ.1.26 లక్షల కోట్లు సుమారు) నిధులను భారత స్టార్టప్‌లు సమీకరించాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ.. వీసీ ఇన్వెస్టర్లు భారత స్టార్టప్ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ‘గ్లోబల్ డేటా’ అనే డేటా అనలైటిక్స్ సంస్థ తెలిపింది. నిధుల సమీకరణలో భారత స్టార్టప్‌లు చైనా స్టార్టప్‌ల సరసనే నిలుస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 828 వీసీ ఫండింగ్ (పెట్టుబడులు) ఒప్పందాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాల విలువ 16.9 బిలియన్ డాలర్లు. వీటిల్లో ఫ్లిప్‌కార్ట్ 3.6 బిలియన్ డాలర్లు, మొహల్లా టెక్ (షేర్‌చాట్) 502 మిలియన్ డాలర్లు, జొమాటో 500 మిలియన్ డాలర్లు, థింక్ అండ్ లెర్న్ (బైజూస్) 460 మిలియన్ డాలర్ల సమీకరణ పెద్ద ఒప్పందాలుగా ఉన్నాయి. భారత్‌లో వీసీ ఫండింగ్ ఒప్పందాల సంఖ్య క్షీణించినా కానీ, విలువ పరంగా వృద్ధి నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. -
ఈ రంగంలోనే ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారంట
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు గత నెలలో భారీగా ఎగశాయి. జూలైలో రెట్టింపునకు పైగా జంప్‌చేసి 9.5 బిలియన్ డాలర్లను(సుమారు రూ. 70,530 కోట్లు) తాకాయి. వెరసి గరిష్ట పెట్టుబడులుగా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 2020 జూలైలో ఇవి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రధానంగా ఈకామర్స్ రంగం పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించుకుంటున్నట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ సంస్థలు పీఈ, వీసీ పెట్టుబడులపై నెలవారీ నివేదికను విడుదల చేసే సంగతి తెలిసిందే. కాగా.. ఈ(2021) జూన్‌లో నమోదైన 5.4 బిలియన్ డాలర్లతో పోల్చినా.. తాజా పెట్టుబడులు 77 శాతం వృద్ధి చెందాయి. జూలైలో 10 కోట్ల డాలర్లకుపైబడిన 19 భారీ డీల్స్ ద్వారా 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. 2020 జులైలో 10 భారీ డీల్స్ ద్వారా 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదుకాగా.. జూన్‌లో 12 డీల్స్‌తో 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. జులైలో కొత్త రికార్డుకు తెర తీస్తూ మొత్తం 131 లావాదేవీలు జరిగాయి. 2020 జులైలో ఇవి 77 మాత్రమే కాగా.. ఈ జూన్‌లో 110 లావాదేవీలు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి పీఈ, వీసీ పెట్టుబడుల్లో 96 శాతం(9.1 బిలియన్ డాలర్లు) ప్యూర్ప్లేగా నివేదిక వెల్లడించింది. 2020 జులైలో ఇవి 3.8 బిలియన్ డాలర్లుకాగా.. ఈ జూన్‌లో 4.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ జూలై పెట్టుబడుల్లో ఈకామర్స్ రంగం 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! దీంతో 2021 జూన్‌కల్లా ఈకామర్స్‌లో పీఈ, వీసీ పెట్టుబడులు 10.5 బిలియన్ డాలర్లను తాకాయి. 22 డీల్స్ జూలైలో వాటా విక్రయం ద్వారా పీఈ, వీసీ సంస్థలు వైదొలగిన(ఎగ్జిట్) డీల్స్ 22కు చేరాయి. వీటి విలువ 96.5 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2020 జులైలో ఇవి 13.4 కోట్ల డాలర్లు మాత్రమే. అయితే ఈ జూన్‌లోనూ ఎగ్జిట్ డీల్స్ విలువ భారీగా 3.2 బిలయన్ డాలర్లను తాకింది. చదవండి : ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్ -
వ్యాపారంతో కోలాటం
దేశాల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గొంగళిపురుగు అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు స్టార్టప్‌లు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పట్టుకొమ్మలు యువతలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, సరైన చోట పెట్టుబడి పెట్టాలి... అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది... పెట్టుబడి పెట్టిన వారు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది... ఇలా అనటమే కాదు.. ఆచరణలోనూ చూపారు హైదరాబాద్‌కు చెందిన వాణి కోలా... అమెరికా నుంచి... మింత్ర, మెడ్‌ప్లస్ వంటి ఎన్నో వ్యాపార సంస్థలకు ఆమె పెట్టుబడులు సమకూర్చారు. అనతి కాలంలోనే అవి ‘ఇంతింతై’ అన్నట్లు చకచకా ఎదిగాయి. ప్రఖ్యాత సంస్థలలో ఆమె పెట్టుబడులు పెట్టి, ఆ సంస్థలతో పాటు వాణి కోలా కూడా ఎదిగారు. ఇరవై రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న వాణి కోలా 2005 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. పనులలో రిస్క్ తీసుకోవటం ఆమెకు ఇష్టం. ‘విశ్రాంతిగా గడపడానికి ఏదో విహార స్థలానికి వెళ్ళడం కంటే భారత దేశంలో గడపడమే నాకు ఇష్టం’ అంటారు వాణి కోలా. ఈ ఆలోచనే వాణి కోలా విజయానికి బాట వేసింది. ఆర్థిక సరళీకరణ వల్ల భారతదేశంలో వచ్చిన మార్పులు వాణిని ఆకర్షించాయి. కలారీ క్యాపిటల్ సంస్థను స్థాపించి, స్టార్టప్స్‌కు ఫండింగ్ చేయటం ప్రారంభించారు. ఇలా చేయటంలో తనకు చాలా ఆనందం కలుగుతుందంటారు వాణి కోలా. మింత్ర, స్నాప్‌డీల్, ఫాంటసీ స్పోర్ట్స్, కంపెనీ డ్రీమ్ – 11తో పాటు, మెడ్ ప్లస్, జివామే వంటి ఫార్మస్యుటికల్ చైన్లకు కూడా ఫండింగ్ చేశారు. 2011లో ప్రారంభమైన కలారీ క్యాపిటల్ ఇంతవరకూ 92 వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టింది. వాణి చేస్తున్న ప్రయత్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టిలో పడింది. కలారీ పరిధిలో ఉన్న జివామె, అర్బన్ ల్యాడర్ వంటి అనేక కంపెనీలను సొంతం చేసుకుంది. అక్కడితో ఆగకుండా కలారీలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ అంశాన్ని వాణి స్వయంగా ఒక ఇ–మెయిల్ ద్వారా తెలియజేశారు. సిలికాన్ వ్యాలీలో రెండు విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలకు ఫౌండర్ సిఇఓ అయిన వాణి గెలుపుకి, విజయపథంలో దూసుకుపోవటానికి కారణం... కంపెనీలను రూపొందించడం పైనే తన దృష్టిని కేంద్రీకరించటం, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం. పురుషులు అసూయ చెందారు... హైదరాబాద్‌కు చెందిన వాణీ కోలా... అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి 1980లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాలిఫోర్నియా వచ్చి, అక్కడ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. తన కంపెనీని 657 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2001లో సెర్టస్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. ఇన్ని విజయాలు సాధించటానికి ముందు వాణీ కోలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఒక మహిళ ఇన్ని విజయాలను సాధించటం నచ్చని పురుష వాణిజ్యవేత్తలు ఆమెను ఎగతాళి చేశారు. విమానాశ్రయంలో కలిసిన ఓ వ్యాపారవేత్త ‘ఏడాది కంటే తక్కువ వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి, వ్యాపారం కోసం ఇలా తిరగటం మీకు సిగ్గుగా లేదా’ అని వెటకారమాడాడు. ‘ఇలాంటి పరిస్థితులు ఆడవారికేనా.. మగవారికి మాత్రం ఉండవా. మీ ఇంట్లో ఉండే చంటి పిల్లాడిని మీరు మాత్రం వదిలేసి రావట్లేదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు వాణీ కోలా. -
2020లోనూ వీసీ పెట్టుబడుల జోరు
సాక్షి, న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థలు దేశీయంగా గతేడాది భారీ పెట్టుబడులను తీసుకువచ్చాయి. తద్వారా 7,000కుపైగా స్టార్టప్‌లకు 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 72,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చాయి. బెయిన్ అండ్ కంపెనీస్ తాజాగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ నివేదిక వెల్లడించిన వివరాలివి. నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. వీసీ పెట్టుబడుల్లో అత్యధిక శాతాన్ని కన్జూమర్ టెక్, ఎస్ఏఏఎస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు పొందాయి. వెరసి ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసీ సంస్థల నుంచి 75 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో కన్జూమర్ టెక్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం! దేశీ ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వీసీ అసోసియేషన్(ఐవీసీఏ) భాగస్వామ్యంతో రూపొందిన నివేదిక ప్రకారం.. డిజిటల్ ట్రెండ్‌పై కోవిడ్–19 ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. ఫలితంగా వివిధ రంగాలలో డిజిటల్ ఆధారిత బిజినెస్‌లకు వీసీ నిధులు అధికంగా ప్రవహించేందుకు దారి ఏర్పడింది. డీల్స్ ఎక్కువే కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలోనూ వీసీ పెట్టుబడులు కొనసాగడం గమనార్హమని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2019లో దేశీయంగా 755 డీల్స్ ద్వారా 11.1 బిలియన్ డాలర్లను వీసీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2020లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ డీల్స్ సంఖ్య 810కు పెరిగింది. ఇందు కు సగటు డీల్ పరిమాణం తగ్గడం కారణమైనట్లు నివేదిక తెలియజేసింది. గతేడాది పలు సవాళ్లు ఎదురైనప్పటికీ పెరిగిన డీల్ పరిమాణం దేశీ స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త స్టార్టప్ వ్యవస్థల్లో టాప్–5లో ఒకటిగా భారత్ కొనసాగిన ట్లు నివేదిక తెలియజేసింది. 2020లోనూ 7,000 స్టార్టప్‌లు ఊపిరిపోసుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా నివేదిక ప్రకారం గతేడాదిలో 12 స్టార్టప్‌లో కొత్తగా యూనికార్న్ హోదాను సాధించాయి. తద్వారా యూనికార్న్ హోదాను పొందిన సంస్థల సంఖ్య 37ను తాకింది. వెరసి యూఎస్, చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇది దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన 1.10 లక్షలకుపైగా స్టార్టప్‌లలో ప్రస్తుతం 9 శాతం వరకూ నిధులను పొందాయి. అంటే మరిన్ని పెట్టుబడులకు అవకాశముంది. 2019ను మినహాయిస్తే గతేడాది గరిష్ట స్థాయిలో స్టార్టప్‌లకు వీసీ నిధులు లభించాయి. కొన్ని వినూత్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి. దీంతో పలు చిన్న డీల్స్‌కు తెరలేచింది. భవిష్యత్‌లోనూ మరిన్ని వీసీ పెట్టుబడులకు వీలున్నదని నివేదికకు సహరచయితగా సేవలందించిన బెయిన్ అండ్ కంపెనీ నిపుణులు శ్రీవాస్తవన్ కృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు -
2020లోనూ స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు దేశీయంగా గతేడాది భారీ పెట్టుబడులను తీసుకువచ్చాయి. తద్వారా 7,000కు పైగా స్టార్టప్‌లకు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చాయి. బెయిన్ అండ్ కంపెనీస్ తాజాగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ నివేదిక వెల్లడించిన వివరాలివి. నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. వీసీ పెట్టుబడుల్లో అత్యధిక శాతాన్ని కన్జూమర్ టెక్, ఎస్ఏఏఎస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు పొందాయి. వెరసి ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసీ సంస్థల నుంచి 75 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో కన్జూమర్ టెక్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం! దేశీ ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వీసీ అసోసియేషన్(ఐవీసీఏ) భాగస్వామ్యంతో రూపొందిన నివేదిక ప్రకారం.. డిజిటల్ ట్రెండ్‌పై కోవిడ్-19 ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. ఫలితంగా వివిధ రంగాలలో డిజిటల్ ఆధారిత బిజినెస్‌లకు వీసీ నిధులు అధికంగా ప్రవహించేందుకు దారి ఏర్పడింది. డీల్స్ ఎక్కువే కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలోనూ వీసీ పెట్టుబడులు కొనసాగడం గమనార్హమని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2019లో దేశీయంగా 755 డీల్స్ ద్వారా 11.1 బిలియన్ డాలర్లను వీసీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2020లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ డీల్స్ సంఖ్య 810కు పెరిగింది. ఇందుకు సగటు డీల్ పరిమాణం తగ్గడం కారణమైనట్లు నివేదిక తెలియజేసింది. గతేడాది పలు సవాళ్లు ఎదురైనప్పటికీ పెరిగిన డీల్ పరిమాణం దేశీ స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను ప్రతి ఫలిస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్త స్టార్టప్ వ్యవస్థల్లో టాప్-5లో ఒకటిగా భారత్ కొనసాగిన ట్లు నివేదిక తెలియజేసింది. 2020లోనూ 7,000 స్టార్టప్‌లు ఊపిరిపోసుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా నివేదిక ప్రకారం గతేడాదిలో 12 స్టార్టప్‌లో కొత్తగా యూనికార్న్ హోదాను సాధించాయి. తద్వారా యూనికార్న్ హోదాను పొందిన సంస్థల సంఖ్య 37ను తాకింది. వెరసి యూఎస్, చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇది దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన 1.10 లక్షలకుపైగా స్టార్టప్‌లలో ప్రస్తుతం 9 శాతం వరకూ నిధులను పొందాయి. అంటే మరిన్ని పెట్టుబడులకు అవకాశముంది. 2019ను మినహాయిస్తే గతేడాది గరిష్ట స్థాయిలో స్టార్టప్‌లకు వీసీ నిధులు లభించాయి. కొన్ని వినూత్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి. దీంతో పలు చిన్న డీల్స్‌కు తెరలేచింది. భవిష్యత్‌లోనూ మరిన్ని వీసీ పెట్టుబడులకు వీలున్నదని నివేదికకు సహరచయితగా సేవలందించిన బెయిన్ అండ్ కంపెనీ నిపుణులు శ్రీవాస్తవన్ కృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు! -
చైనా పెట్టుబడులకు బ్రేక్..
ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్ అండ్ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్ నోట్ 3 (పీఎన్3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్లకు భారత్‌తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థలు మాత్రమే భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడులు 72 శాతం డౌన్.. చైనా, హాంకాంగ్ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్‌లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 814 డీల్స్ కుదిరినట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్ రిటైల్, జియోలోకే వచ్చాయి. కొత్త మార్గదర్శకాలివీ .. పీఎన్3 ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది. కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ రవీంద్ర ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్, పబ్జీ వంటి 200కి పైగా చైనా యాప్‌లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు. -
ముందుంది మరింత గడ్డుకాలం!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ఉద్దేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వ్యాపారాలు కుదేలవుతున్నాయి. స్టార్టప్ సంస్థలు మరింతగా విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని స్టార్టప్‌లకు యాక్సెల్, కలారి, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, సెకోయా వంటి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు సూచించాయి. కష్టకాలంలో ఉద్యోగాలకు కోత పెట్టకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని పేర్కొన్నాయి. జీతాలు వాయిదా లేదా తగ్గించడం వంటివి పరిశీలించాలని సూచించాయి. వీసీలు ఈ మేరకు స్టార్టప్‌లకు బహిరంగ లేఖ రాశాయి. వచ్చే 21–30 రోజుల్లో అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రణాళికల అమలుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వచ్చే ఏడాది–ఏడాదిన్నర కాలానికి ఎలా ప్రణాళిలు వేసుకోవాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు కుదేలవడంతో వ్యయాలను తగ్గించుకునేందుకు, గడ్డుకాలం గట్టెక్కేందుకు పలు స్టార్టప్ సంస్థలు, డిజిటల్ వ్యాపార సంస్థలు.. సిబ్బందిని తొలగిస్తుండటం, జీతాల్లో కోత పెడుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో తాజాగా వీసీల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వేచి చూసే ధోరణి వద్దు .. ‘భారత్‌లో తొలి దశ ఇన్వెస్టర్లుగా .. మేమంతా దేశీ స్టార్టప్ వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. మేం ఇన్వెస్ట్ చేసిన సంస్థల వ్యవస్థాపకులు, టీమ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి వారంతా బైటపడాలని కోరుకుంటున్నాము‘ అని లేఖలో వీసీ సంస్థలు పేర్కొన్నాయి. నిధుల సమీకరణ, ఉద్యోగుల నిర్వహణ, వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికలు మొదలుకుని ఇన్వెస్టర్లు, వివిధ వాటాదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి ఇందులో పలు సలహాలు, సూచనలు చేశాయి. స్థూలంగా దేశంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోగలగడం స్టార్టప్‌లకు చాలా కీలకమని పేర్కొన్నాయి. ‘అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఒకవేళ పరిస్థితి వేగంగా మెరుగుపడిన పక్షంలో దానికి తగ్గట్లుగా సర్దుకుపోవడానికి కూడా సంసిద్ధత ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత వస్తుందనే ఆశతో.. వేచి చూద్దాం, స్పష్టత వచ్చాకే ఏదో ఒక చర్య తీసుకుందాంలే అనే ధోరణి సరికాదు‘ అని వెంచర్ క్యాపిటల్ సంస్థలు సూచించాయి. ఉద్యోగులు ముఖ్యం... ఈ సందర్భంగా ఏయే అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నదీ వీసీలు వివరించాయి. ‘ముందు ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే వ్యాపారాల కొనసాగింపు, లిక్విడిటీ ఉండాలి ‘ అని పేర్కొన్నాయి. మిగతా వ్యయాలన్నింటినీ సమీక్షించుకుని, తగ్గించుకున్న తర్వాతే సిబ్బంది వ్యయాలపై దృష్టి పెట్టాలన్నాయి. సిబ్బంది తొలగింపు, జీతాల తగ్గింపు వంటి అంశాల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలని సూచించాయి. ఒకవేళ ఉద్యోగులపరమై వ్యయాలను తగ్గించుకోవాల్సి వస్తే.. రిక్రూట్‌మెంట్‌ను తాత్కాలికంగా ఆపడం, జీతాలు వాయిదా వేయడం.. తగ్గించడం, విధుల్లో మార్పుచేర్పులు చేయడం, ప్రమోషన్లు వంటి మదింపు విధానాలను సవరించుకోవడం వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించాలని తెలిపాయి. -
భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు
ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో ఏకంగా 35 శాతం అధికంగా 35.1 బిలియన్ డాలర్ల (రూ.2,45,700 కోట్లు) మేర పెట్టుబడులు తరలివచ్చాయి. భారీ డీల్స్ 2017లో చోటు చేసుకోవడమే ఈ వృద్ధికి కారణం. ఇక పీఈ/వీసీల పెట్టుబడుల ఉపసంహరణ విలువ 2018లో 26 బిలియన్ డాలర్ల (రూ.1,82,000 కోట్లు) మేర ఉంది. ఇది క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది. ‘‘పీఈ/వీసీ పెట్టుబడులు, ఉపసంహరణలకు 2018 మంచి సంవత్సరం. మేము ముందుగా అంచనా వేసిన విధంగానే పీఈ, వీసీల పెట్టుబడులు, ఉపసంహరణలు 2018లో నూతన రికార్డు స్థాయికి చేరాయి’’అని ఈవై పార్ట్నర్ వివేక్సోని తమ నివేదికలో తెలిపారు. స్టాక్ మార్కెట్లలో అస్థిరతల వల్ల 2018 ద్వితీయ భాగంలో ప్రైవేటు పెట్టుబడులకు విఘాతం కలిగినప్పటికీ... కొనుగోళ్లు, స్టార్టప్ యాక్టివిటీతో ఈ ప్రభావం తగ్గిపోయిందని వివరించారు. డీల్స్ వివరాలు... ► 2018లో 500 మిలియన్ డాలర్లు (రూ.3,500 కోట్లు), అంతకంటే ఎక్కువ విలువ కలిగిన 12 డీల్స్ జరిగాయి. ఇందులో ఎనిమిది డీల్స్ విలువ ఒక్కోటీ బిలియన్ డాలర్లపైనే ఉండడం గమనార్హం. ► 76 ఒప్పందాల విలువ 100 మిలియన్ డాలర్ల (రూ.700 కోట్లు) కంటే ఎక్కువ ఉంది. వీటి మొత్తం విలువ 25.9 బిలియన్ డాలర్లు. 2018లో వచ్చిన పీఈ, వీసీ మొత్తం పెట్టుబడుల్లో 74 శాతం. ► 2018లో మొత్తం డీల్స్ 761గా ఉన్నాయి. 2017లో ఉన్న 594 డీల్స్ కంటే 28 శాతం ఎక్కువ. ► స్టార్టప్ పెట్టుబడులు బలంగా ఉన్నాయి. సాఫ్ట్ బ్యాంకు, టెన్సెంట్, నాస్పర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇందుకు తోడ్పడింది. ► అతిపెద్ద డీల్... హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో జీఐసీ, కేకేఆర్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఓమర్స్ చేసిన 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి కావడం గమనార్హం. ► ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ప్రవేశంతో సాఫ్ట్‌బ్యాంకు, టైగర్ గ్లోబల్, మరికొంత మంది ఇన్వెస్టర్లు తప్పకున్న విషయం తెలిసిందే. ఇది 16 బిలియన్ డాలర్ల విలువైన డీల్. దేశ పీఈ/వీసీ మార్కెట్లో ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద డీల్. ► పీఈ, వీసీ పెట్టుబడుల ఉపసంహరణ డీల్స్ జరిగిన రంగాలను గమనిస్తే... ఈ కామర్స్ (16.4 బిలియన్ డాలర్లు), టెక్నాలజీ(రూ.1.8 బిలియన్ డాలర్లు), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.5 బిలియన్ డాలర్లు) ముందున్నాయి. వ్యాపారంపై తగ్గిన విశ్వాసం! జనవరి–మార్చి మధ్య పరిస్థితిపై డీఅండ్‌బీ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార ఆశావాదం జనవరి–మార్చి త్రైమాసికానికి తగ్గింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ)కాంపోజిట్ బిజినెస్ ఆప్టమిజమ్ ఇండెక్స్ ఈ త్రైమాసికానికి సంబంధించి 73.8గా ఉంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంతో పోల్చిచూస్తే, ఈ సూచీ 7 శాతం తగ్గింది. వచ్చే కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల ఫలితంపై అనిశ్చితి, సంస్కరణల అజెండా కొనసాగడంపై సందేహాలు వ్యాపార ఆశావహ సూచీ తగ్గడానికి కారణమని డీ అండ్ బీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సిన్హా పేర్కొన్నారు. అమెరికా మందగమనం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనత వంటి అంశాలూ దేశీయ వృద్ధిపై ఆందోళనలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాపార అంచనాలపై వ్యాపార ప్రతినిధులు ఆరు అంశాలపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా సూచీ కదలికలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సూచీకి సంబంధించి పరిగణనలోకి తీసుకునే మొత్తం ఆరు ప్రమాణాల్లో ఐదు ( నికర ఆదాయం, కొత్త ఆర్డర్లు, అమ్మకాల పరిమాణం, నిల్వలు, అమ్మకపు ధర) అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంతో పోల్చితే ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. దీంతో ఉపాధి కల్పనకు సంబంధించి ఆశావహ పరిస్థితి 7% పెరిగినా, మొత్తం ఫలితం ప్రతికూలంగా ఉంది.