సాక్షి, న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థలు దేశీయంగా గతేడాది భారీ పెట్టుబడులను తీసుకువచ్చాయి. తద్వారా 7,000కుపైగా స్టార్టప్‌లకు 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 72,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చాయి. బెయిన్ అండ్ కంపెనీస్ తాజాగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ నివేదిక వెల్లడించిన వివరాలివి. నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. వీసీ పెట్టుబడుల్లో అత్యధిక శాతాన్ని కన్జూమర్ టెక్, ఎస్‌ఏఏఎస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు పొందాయి. వెరసి ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసీ సంస్థల నుంచి 75 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో కన్జూమర్ టెక్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం! దేశీ ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వీసీ అసోసియేషన్(ఐవీసీఏ) భాగస్వామ్యంతో రూపొందిన నివేదిక ప్రకారం.. డిజిటల్ ట్రెండ్‌పై కోవిడ్–19 ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. ఫలితంగా వివిధ రంగాలలో డిజిటల్ ఆధారిత బిజినెస్‌లకు వీసీ నిధులు అధికంగా ప్రవహించేందుకు దారి ఏర్పడింది.
డీల్స్ ఎక్కువే
కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలోనూ వీసీ పెట్టుబడులు కొనసాగడం గమనార్హమని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2019లో దేశీయంగా 755 డీల్స్ ద్వారా 11.1 బిలియన్ డాలర్లను వీసీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2020లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ డీల్స్ సంఖ్య 810కు పెరిగింది. ఇందు కు సగటు డీల్ పరిమాణం తగ్గడం కారణమైనట్లు నివేదిక తెలియజేసింది. గతేడాది పలు సవాళ్లు ఎదురైనప్పటికీ పెరిగిన డీల్ పరిమాణం దేశీ స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త స్టార్టప్ వ్యవస్థల్లో టాప్–5లో ఒకటిగా భారత్ కొనసాగిన ట్లు నివేదిక తెలియజేసింది. 2020లోనూ 7,000 స్టార్టప్‌లు ఊపిరిపోసుకున్నట్లు వెల్లడించింది.
కొత్తగా
నివేదిక ప్రకారం గతేడాదిలో 12 స్టార్టప్‌లో కొత్తగా యూనికార్న్ హోదాను సాధించాయి. తద్వారా యూనికార్న్ హోదాను పొందిన సంస్థల సంఖ్య 37ను తాకింది. వెరసి యూఎస్, చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇది దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకున్న పటిష్టతను సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన 1.10 లక్షలకుపైగా స్టార్టప్‌లలో ప్రస్తుతం 9 శాతం వరకూ నిధులను పొందాయి. అంటే మరిన్ని పెట్టుబడులకు అవకాశముంది. 2019ను మినహాయిస్తే గతేడాది గరిష్ట స్థాయిలో స్టార్టప్‌లకు వీసీ నిధులు లభించాయి. కొన్ని వినూత్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి. దీంతో పలు చిన్న డీల్స్‌కు తెరలేచింది. భవిష్యత్‌లోనూ మరిన్ని వీసీ పెట్టుబడులకు వీలున్నదని నివేదికకు సహరచయితగా సేవలందించిన బెయిన్ అండ్ కంపెనీ నిపుణులు శ్రీవాస్తవన్ కృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment