న్యూఢిల్లీ: కొంతకాలంగా బూమింగ్‌లో ఉన్న దేశీ స్టార్టప్‌ల పరిశ్రమ వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్‌ను భారీగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఏడాది జనవరి–జులై మధ్య కాలంలో ఏకంగా 17.2 బిలియన్ డాలర్ల(రూ. 1.26 లక్షల కోట్లు) పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇవి గత రెండేళ్లలో తొలి 7 నెలల్లో లభించిన పెట్టుబడులతో పోలిస్తే అత్యధికంకావడం విశేషం! 2020 జనవరి–జులై మధ్య దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి 11.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించగా.. 2019 తొలి 7 నెలల్లో 13 బిలియన్ డాలర్లు లభించాయి. దేశీ పీఈ, వీసీ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) సంయుక్తంగా విడుదల చేసిన గణాంకాలివి.
అతిపెద్ద డీల్స్..
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నమోదైన అతిపెద్ద వీసీ డీల్స్‌లో ఉడాన్, లెన్స్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫార్మ్‌ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జెటా, క్రెడ్, రేజర్‌పే, హెల్తిఫైమి, బైజూస్, అన్‌అకాడమీ, ఎరూడిటస్, వేదాంతు, డంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, యెల్లో.ఏఐ, ఎంట్రోపిక్ తదితరాలున్నాయి. ఈ బాటలో ద్వితీయార్థంలోనూ స్టార్టప్ వ్యవస్థలోకి మరిన్ని పెట్టుబడులు ప్రవహించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏఐ, ఎంఎల్, ఎడ్‌టెక్, ఫుడ్‌టెక్ విభాగాలు వీసీ ఫండ్స్‌ను ఆకట్టుకోనున్నట్లు పేర్కొన్నారు.
క్యూ2లో స్పీడ్
ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో దేశీ స్టార్టప్‌లకు 6.5 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. నాస్కామ్–పీజీఏ ల్యాబ్స్ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ కాలంలో 11 సంస్థలు యూనికార్న్ హోదాను పొందాయి. 2021 క్యూ1(జనవరి–మార్చి)తో పోలిస్తే 2 శాతం అధికంగా ఫండింగ్ 160 డీల్స్ నమోదుకాగా.. పరిశ్రమ వృద్ధిని ప్రతిబింబిస్తూ లభించిన నిధులు సైతం 71 శాతం జంప్ చేశాయి. ఈ కాలంలో 80 కోట్ల డాలర్ల(రూ. 5,930 కోట్లు)తో స్విగ్గీ అతిపెద్ద డీల్‌గా నమోదైంది. ఈ బాటలో షేర్‌చాట్(50.2 కోట్ల డాలర్లు), బైజూస్(34 కోట్ల డాలర్లు), ఫార్మ్‌ఈజీ(32.3 కోట్ల డాలర్లు), మీషో(30 కోట్ల డాలర్లు) తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఇక పైన్ ల్యాబ్స్(28.5 కోట్ల డాలర్లు), డెల్హివరీ(27.7 కోట్ల డాలర్లు), జెటా(25 కోట్ల డాలర్లు), క్రెడ్(21.5 కోట్ల డాలర్లు), అర్బన్ కంపెనీ(18.8 కోట్ల డాలర్లు) సైతం జాబితాలో చోటు సాధించాయి.
వృద్ధి బాటలో
2021 జూన్‌వరకూ 53 సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగినట్లు పీజీఏ ల్యాబ్స్ పేర్కొంది. ఇందుకు క్యూ2 మరింత దోహదం చేసినట్లు తెలియజేసింది. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఫిన్‌టెక్, ఫుడ్‌టెక్, హెల్త్‌టెక్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నట్లు వివరించింది. క్యూ2లో జరిగిన డీల్స్ విలువలో ఫిన్‌టెక్ విభాగం 27 శాతం విలువను సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇదేవిధంగా ఫుడ్‌టెక్ 13 శాతం, ఎంటర్‌ప్రైజ్ టెక్ 11 శాతం, ఎడ్‌టెక్ 10 శాతం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ 8 శాతం చొప్పున పెట్టుబడుల్లో వాటాను పొందాయి. మొత్తం డీల్స్ లో వృద్ధి దశ ఫండింగ్ 61 శాతంగా నమోదైంది.
యూనికార్న్ జాబితా
క్యూ2లో 100 స్టార్టప్‌లు తొలి దశ నిధులను అందుకున్నాయి. ఇవి మొత్తం పెట్టుబడుల్లో 9 శాతం వాటాకు సమానం. తాజాగా బిలియన్ డాలర్ల విలువను సాధించిన యూనికార్న్ సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, క్రెడ్, మీషో, గ్రో, షేర్‌చాట్, ఫార్మ్‌ఈజీ, జెటా, బ్రౌజర్‌స్టాక్, మాగ్లిక్స్, గప్‌షుప్, చార్జ్‌బీ చేరాయి. ఈ కాలంలో స్టార్టప్‌లకు టైగర్ గ్లోబల్ అత్యధికంగా 64 శాతం పెట్టుబడులను సమకూర్చింది. బీటూబీ స్టార్టప్‌లు 85 డీల్స్ ద్వారా 1.9 బిలయన్ డాలర్లు అందుకున్నాయి. సగటు డీల్ పరిమాణం 22 మిలియన్ డాలర్లు. వీటిలో జెటా, రేజర్‌పే, యాక్స్‌ట్రియా టాప్ త్రీ సంస్థలుగా నిలిచాయి. ఇక బీటూసీ సంస్థలు 75 డీల్స్ ద్వారా 4.2 బిలియన్ డాలర్లు పొందాయి. డీల్ సగటు పరిమాణం 56 మిలియన్ డాలర్లు. వీటిలో స్విగ్గీ, షేర్‌చాట్, బైజూస్ అగ్రస్థానంలో నిలిచాయి. కాగా.. 29 డీల్స్ ద్వారా డీప్‌టెక్ స్టార్టప్‌లకు 450 మిలియన్ డాలర్లు లభించాయి.
స్టార్టప్ పెట్టుబడులకు వీసీ ఫండ్స్ క్యూ
Published Thu, Sep 30 2021 4:12 AM | Last Updated on Thu, Sep 30 2021 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment