Desi startup company
-
ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్‌లపై ప్రభావం పడలేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సత్వరం పూనుకుని చర్యలు తీసుకోవడం వల్ల సిలికాన్ వేలీ బ్యాంకు (ఎస్వీబీ) సంక్షోభ ప్రభావాలు దేశీ స్టార్టప్‌లపై పడలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. ఇండియా గ్లోబల్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎస్వీబీ కుప్పకూలినప్పుడు.. అందులో నిధులు ఉన్న భారతీయ స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. అది చిన్నపాటి సంక్షోభమైనప్పటికీ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క అంకుర సంస్థపైనా ప్రతికూల ప్రభావం పడకుండా .. మొత్తం ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేసిందని వైష్ణవ్ చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా మాత్రమే ఉన్న భారత్.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌లో ముందుకు పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు చాలా మటుకు అంతర్జాతీయ డెవలపర్లు భారత స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను తమ భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నారని మంత్రి వివరించారు. భారత్ కూడా చాట్‌జీపీటీ లాంటివి తయారు చేయగలదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మరికొద్ది వారాలు ఆగండి. ఒక భారీ ప్రకటన ఉండబోతోంది‘ అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఎకానమీకి భారత్ వంటి విశ్వసనీయ భాగస్వామి చాలా అవసరమని వైష్ణవ్ పేర్కొన్నారు. క్వాంటమ్ ఆధారిత టెలికం నెట్వర్క్ .. దేశీయంగా తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత సురక్షితమైన టెలికం నెట్వర్క్ లింక్ ప్రస్తుతం న్యూఢిల్లీ సీజీవో కాంప్లెక్స్‌లోని సంచార్ భవన్, ఎన్ఐసీ మధ్య అందుబాటులోకి వచ్చిందని వైష్ణవ్ చెప్పారు. ఈ వ్యవస్థ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయగలిగే ఎథికల్ హ్యాకర్లకు రూ. 10 లక్షల బహుమతి ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సీ–డాట్ రూపొందించినట్లు మంత్రి వివరించారు. -
స్టార్టప్ పెట్టుబడులకు వీసీ ఫండ్స్ క్యూ
న్యూఢిల్లీ: కొంతకాలంగా బూమింగ్‌లో ఉన్న దేశీ స్టార్టప్‌ల పరిశ్రమ వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్‌ను భారీగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఏడాది జనవరి–జులై మధ్య కాలంలో ఏకంగా 17.2 బిలియన్ డాలర్ల(రూ. 1.26 లక్షల కోట్లు) పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇవి గత రెండేళ్లలో తొలి 7 నెలల్లో లభించిన పెట్టుబడులతో పోలిస్తే అత్యధికంకావడం విశేషం! 2020 జనవరి–జులై మధ్య దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి 11.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించగా.. 2019 తొలి 7 నెలల్లో 13 బిలియన్ డాలర్లు లభించాయి. దేశీ పీఈ, వీసీ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) సంయుక్తంగా విడుదల చేసిన గణాంకాలివి. అతిపెద్ద డీల్స్.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నమోదైన అతిపెద్ద వీసీ డీల్స్‌లో ఉడాన్, లెన్స్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫార్మ్ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జెటా, క్రెడ్, రేజర్‌పే, హెల్తిఫైమి, బైజూస్, అన్అకాడమీ, ఎరూడిటస్, వేదాంతు, డంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, యెల్లో.ఏఐ, ఎంట్రోపిక్ తదితరాలున్నాయి. ఈ బాటలో ద్వితీయార్థంలోనూ స్టార్టప్ వ్యవస్థలోకి మరిన్ని పెట్టుబడులు ప్రవహించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏఐ, ఎంఎల్, ఎడ్టెక్, ఫుడ్‌టెక్ విభాగాలు వీసీ ఫండ్స్‌ను ఆకట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. క్యూ2లో స్పీడ్ ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో దేశీ స్టార్టప్‌లకు 6.5 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. నాస్కామ్–పీజీఏ ల్యాబ్స్ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ కాలంలో 11 సంస్థలు యూనికార్న్ హోదాను పొందాయి. 2021 క్యూ1(జనవరి–మార్చి)తో పోలిస్తే 2 శాతం అధికంగా ఫండింగ్ 160 డీల్స్ నమోదుకాగా.. పరిశ్రమ వృద్ధిని ప్రతిబింబిస్తూ లభించిన నిధులు సైతం 71 శాతం జంప్ చేశాయి. ఈ కాలంలో 80 కోట్ల డాలర్ల(రూ. 5,930 కోట్లు)తో స్విగ్గీ అతిపెద్ద డీల్‌గా నమోదైంది. ఈ బాటలో షేర్‌చాట్(50.2 కోట్ల డాలర్లు), బైజూస్(34 కోట్ల డాలర్లు), ఫార్మ్ఈజీ(32.3 కోట్ల డాలర్లు), మీషో(30 కోట్ల డాలర్లు) తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఇక పైన్ ల్యాబ్స్(28.5 కోట్ల డాలర్లు), డెల్హివరీ(27.7 కోట్ల డాలర్లు), జెటా(25 కోట్ల డాలర్లు), క్రెడ్(21.5 కోట్ల డాలర్లు), అర్బన్ కంపెనీ(18.8 కోట్ల డాలర్లు) సైతం జాబితాలో చోటు సాధించాయి. వృద్ధి బాటలో 2021 జూన్‌వరకూ 53 సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగినట్లు పీజీఏ ల్యాబ్స్ పేర్కొంది. ఇందుకు క్యూ2 మరింత దోహదం చేసినట్లు తెలియజేసింది. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఫిన్‌టెక్, ఫుడ్‌టెక్, హెల్త్‌టెక్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నట్లు వివరించింది. క్యూ2లో జరిగిన డీల్స్ విలువలో ఫిన్‌టెక్ విభాగం 27 శాతం విలువను సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇదేవిధంగా ఫుడ్‌టెక్ 13 శాతం, ఎంటర్ప్రైజ్ టెక్ 11 శాతం, ఎడ్టెక్ 10 శాతం, మీడియా, ఎంటర్టైన్మెంట్ 8 శాతం చొప్పున పెట్టుబడుల్లో వాటాను పొందాయి. మొత్తం డీల్స్ లో వృద్ధి దశ ఫండింగ్ 61 శాతంగా నమోదైంది. యూనికార్న్ జాబితా క్యూ2లో 100 స్టార్టప్‌లు తొలి దశ నిధులను అందుకున్నాయి. ఇవి మొత్తం పెట్టుబడుల్లో 9 శాతం వాటాకు సమానం. తాజాగా బిలియన్ డాలర్ల విలువను సాధించిన యూనికార్న్ సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, క్రెడ్, మీషో, గ్రో, షేర్‌చాట్, ఫార్మ్ఈజీ, జెటా, బ్రౌజర్‌స్టాక్, మాగ్లిక్స్, గప్‌షుప్, చార్జ్బీ చేరాయి. ఈ కాలంలో స్టార్టప్‌లకు టైగర్ గ్లోబల్ అత్యధికంగా 64 శాతం పెట్టుబడులను సమకూర్చింది. బీటూబీ స్టార్టప్‌లు 85 డీల్స్ ద్వారా 1.9 బిలయన్ డాలర్లు అందుకున్నాయి. సగటు డీల్ పరిమాణం 22 మిలియన్ డాలర్లు. వీటిలో జెటా, రేజర్‌పే, యాక్స్ట్రియా టాప్ త్రీ సంస్థలుగా నిలిచాయి. ఇక బీటూసీ సంస్థలు 75 డీల్స్ ద్వారా 4.2 బిలియన్ డాలర్లు పొందాయి. డీల్ సగటు పరిమాణం 56 మిలియన్ డాలర్లు. వీటిలో స్విగ్గీ, షేర్‌చాట్, బైజూస్ అగ్రస్థానంలో నిలిచాయి. కాగా.. 29 డీల్స్ ద్వారా డీప్‌టెక్ స్టార్టప్‌లకు 450 మిలియన్ డాలర్లు లభించాయి. -
ఏడాదిలో 700 మిలియన్ డాలర్లు
130 దేశీ స్టార్టప్ సంస్థల భారీ నిధుల సమీకరణ ♦ 5 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన ♦ ఇన్నోవెన్ క్యాపిటల్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: రాబోయే 12 నెలల్లో సుమారు 130 దేశీ స్టార్టప్ కంపెనీలు దాదాపు 700 మిలియన్ డాలర్లు సమీకరించనున్నాయి. అలాగే సుమారు 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016 పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. స్నాప్‌డీల్, మింత్రా, ప్రాక్టో, ఫ్రీచార్జ్ తదితర 70 కంపెనీలకు ప్రారంభ దశలో ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా దాదాపు 100 పైగా రుణాలు అందించింది. తాజా నివేదికలో ఫండింగ్ దశతో సంబంధం లేకుండా రంగాలవారీగా విశ్లేషణ చేసింది. దీని ప్రకారం నియామకాలపరంగా కన్జూమర్ ఇంటర్నెట్, ఈ-కామర్స్ సంస్థలు ఎక్కువ ఆశావహంగా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన స్టార్టప్‌లలో 41 శాతం మంది వ్యవస్థాపకులు లేదా సీఎక్స్‌వో స్థాయి అధికారులు మహిళలే ఉన్నారు. ఏంజెల్ ఫండింగ్ పొందిన వాటిల్లో ఇది 29 శాతంగా ఉంది. లాభాల బాటలోకి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సొంత నిధులతో మనుగడ సాగిస్తున్న (బూట్‌స్ట్రాప్) సంస్థల్లో 50 శాతం, ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన వాటిల్లో 45 శాతం, వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరించిన వాటిల్లో 22 శాతం స్టార్టప్‌లు లాభాల బాట పట్టనున్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యాపార, రాజకీయ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 65 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత సానుకూలంగా ఉంటుందని 76 శాతం సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 56 కింద ఏంజెల్ ట్యాక్స్ ఉంటుందన్న విషయం 74 శాతం బూట్స్ట్రాప్డ్, ఏంజెల్ ఫండెడ్ సంస్థలకు తెలియదని నివేదిక వెల్లడించింది.