ఏడాదిలో 700 మిలియన్ డాలర్లు
130 దేశీ స్టార్టప్ సంస్థల భారీ నిధుల సమీకరణ
♦ 5 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన
♦ ఇన్నోవెన్ క్యాపిటల్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: రాబోయే 12 నెలల్లో సుమారు 130 దేశీ స్టార్టప్ కంపెనీలు దాదాపు 700 మిలియన్ డాలర్లు సమీకరించనున్నాయి. అలాగే సుమారు 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016 పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. స్నాప్‌డీల్, మింత్రా, ప్రాక్టో, ఫ్రీచార్జ్ తదితర 70 కంపెనీలకు ప్రారంభ దశలో ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా దాదాపు 100 పైగా రుణాలు అందించింది. తాజా నివేదికలో ఫండింగ్ దశతో సంబంధం లేకుండా రంగాలవారీగా విశ్లేషణ చేసింది. దీని ప్రకారం నియామకాలపరంగా కన్జూమర్ ఇంటర్నెట్, ఈ-కామర్స్ సంస్థలు ఎక్కువ ఆశావహంగా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన స్టార్టప్‌లలో 41 శాతం మంది వ్యవస్థాపకులు లేదా సీఎక్స్‌వో స్థాయి అధికారులు మహిళలే ఉన్నారు. ఏంజెల్ ఫండింగ్ పొందిన వాటిల్లో ఇది 29 శాతంగా ఉంది.
లాభాల బాటలోకి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సొంత నిధులతో మనుగడ సాగిస్తున్న (బూట్‌స్ట్రాప్) సంస్థల్లో 50 శాతం, ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన వాటిల్లో 45 శాతం, వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరించిన వాటిల్లో 22 శాతం స్టార్టప్‌లు లాభాల బాట పట్టనున్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యాపార, రాజకీయ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 65 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత సానుకూలంగా ఉంటుందని 76 శాతం సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 56 కింద ఏంజెల్ ట్యాక్స్ ఉంటుందన్న విషయం 74 శాతం బూట్‌స్ట్రాప్డ్, ఏంజెల్ ఫండెడ్ సంస్థలకు తెలియదని నివేదిక వెల్లడించింది.