హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2027 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది 2.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అలాగే, గేమ్స్ ఆడేందుకు చెల్లించే వారి సంఖ్య 12 కోట్లకు చేరింది. గేమర్లు సగటున 20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు.
వెంచర్ క్యాపిటల్ ఫండ్ ల్యూమికాయ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) సదస్సులో దీన్ని విడుదల చేశారు. సుమారు 2,250 మంది గేమర్లు, థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లు, పరిశ్రమ దిగ్గజాలపై సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
గత రెండేళ్లు దేశీ గేమింగ్ సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని ల్యూమికాయ్ వ్యవస్థాపక జనరల్ పార్ట్‌నర్ సలోని సెహ్‌గల్ తెలిపారు. మూడు సంస్థలు యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగాయని, ఒక సంస్థ స్టాక్ ఎక్సే్చంజీల్లో కూడా లిస్ట్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దేశీ గేమింగ్ పరిశ్రమలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు రాబోతున్నాయని వివరించారు. నవంబర్ 3న ప్రారంభమైన ఐజీడీసీ మూడు రోజుల పాటు 5 వరకూ జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా పలు గేమింగ్ సంస్థలు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
► భారత్‌లో గేమర్ల సంఖ్య 50.7 కోట్లు. ఇందులో పెయిడ్ యూజర్ల సంఖ్య దాదాపు 12 కోట్లు.
► 1500 కోట్ల డౌన్‌లోడ్‌లతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొబైల్ గేమ్స్‌కు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగ దేశంగా భారత్ నిలుస్తోంది.
హిట్‌వికెట్ భారీ నిధుల సమీకరణ
హైదరాబాదీ గేమింగ్ యాప్ సంస్థ హిట్‌వికెట్ తాజాగా ప్రైమ్ వెంచర్ పార్ట్‌నర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కాశ్యప్ రెడ్డి, కీర్తి సింగ్ వెల్లడించారు. గేమింగ్ స్టూడియో, ప్రపంచ స్థాయికి క్రికెటింగ్ అనుభూతిని అందించే గేమ్‌లను తీర్చిదిద్దేందుకు వీటిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అలాగే హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గేమింగ్ విభాగంలో స్థానిక స్టార్టప్‌లు ముందు వరుసలో ఉండటం సంతోషకరమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment