
వచ్చే 22 ఏళ్ల పాటు కొనసాగాలి
సంస్కరణలు, ఉపాధి కల్పన చేపట్టాలి
అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశం
భారత్‌పై ప్రపంచబ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్‌కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.
‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.
చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు..
‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.
అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది.