
వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరిస్తోంది. 2024లో వీసీ పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 43 శాతం పెరిగి 13.7 బిలియన్ డాలర్లకు (రూ.1.19 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. మొత్తం 1,270 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 45 శాతం పెరుగుదల నమోదైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వీసీ పెట్టుబడులు, గ్రోత్ ఫండింగ్‌కు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నట్టు బెయిన్ అండ్ కంపెనీ, ఐవీసీఏ సంయుక్త నివేదిక వెల్లడించింది.
50 మిలియన్ డాలర్ల(రూ.400 కోట్లు)లోపు విలువైన చిన్న, మధ్య స్థాయి డీల్స్ గతేడాది మొత్తం వీసీ లావాదేవీల్లో 95 శాతంగా ఉన్నాయి. గతంలో కంటే ఇవి 1.4 రెట్లు పెరిగాయి. ఇక 50 మిలియన్ డాలర్లకుపైన విలువైన లావాదేవీలు కూడా రెట్టింపయ్యాయి. కరోనా ముందస్తు గరిష్ట స్థాయిలకు చేరాయి. 100 మిలియన్ డాలర్ల(రూ.800 కోట్లు)కు పైన విలువైన భారీ ఒప్పందాలు 1.6 రెట్లు అధికమయ్యాయి. గతేడాది మొత్తం వీసీ ఫండింగ్‌లో 60 శాతం మేర కన్జ్యూమర్ టెక్నాలజీ, సాస్ (జనరేటివ్ ఏఐ సహా), ఫిన్‌టెక్ రంగాలు ఆకర్షించాయి. అన్నింటిలోకి కన్జ్యూమర్ టెక్నాలజీ రంగం 5.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. 2023తో పోల్చితే రెట్టింపైంది.
క్విక్‌కామర్స్, ఎడ్‌టెక్ హవా..
‘క్విక్‌కామర్స్, ఎడ్‌టెక్, బీటుసీ కామర్స్‌లో వీసీ ఫండింగ్ పరంగా అధిక వృద్ధి నమోదైంది. జెప్టో 1.4 బిలియన్ డాలర్లు, మీషో 275 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 200 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి’ అని ఈ నివేదిక వెల్లడించింది. సాఫ్ట్‌వేర్, సాస్ ఫండింగ్ 1.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏంజెల్ ట్యాక్స్‌ను ఎత్తివేయడం, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును (ఎల్‌టీసీజీ) తగ్గించడం, విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడం, ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వడం వంటివి స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లలో సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లు ఈ నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
‘2024లో అమలు చేసిన విధానపరమైన చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ఇది 2025కు సానుకూల వాతావరణానికి వీలు కల్పిస్తుంది. పెట్టుబడుల లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) పేర్కొంది. 2024లో వీసీ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ సైతం పెరగడం గమనార్హం. ఈ మొత్తం 6.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీసీ ఫండింగ్ మద్దతు పొందిన కొన్ని కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లకు (ఐపీవోలు) వెళ్లినట్టు తెలిపింది. ఐపీవోలు ఏడు రెట్లు పెరిగినట్టు గుర్తు చేసింది. ప్రగతిశీల నియంత్రణలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ సదుపాయాల మద్దతుతో భారత వీసీ ఎకోసిస్టమ్ స్థిరమైన వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment