
రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్
ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు.
వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment