Public private partnership
-
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
దేశీయంగా తొలి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజీ
న్యూఢిల్లీ: క్రూడాయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలోని పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు (పాడూర్ 2) ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్పీఆర్ఎల్) బిడ్లను ఆహా్వనించింది. బిడ్ల దాఖలుకు ఏప్రిల్ 22 ఆఖరు తేదీ కాగా, జూన్ 27 నాటికి ప్రాజెక్టును కేటాయిస్తారు. దీనికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ల ప్రకారం ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ పారీ్టలు స్టోరేజీని డిజైన్ చేయడం, నిర్మించడం, ఫైనాన్స్ చేయడం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాడూర్–2 స్టోరేజీని ఆపరేటరు ఏ ఆయిల్ కంపెనీకైనా లీజుకివ్వచ్చు. అందులో చమురుని నిల్వ చేసుకునే కంపెనీలు దాన్ని దేశీ రిఫైనర్లకు విక్రయించుకోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం నిల్వలను ముందుగా ఉపయోగించుకునేందుకు భారత ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఐఎస్పీఆర్ఎల్ తొలి దశలో విశాఖపట్నంతో పాటు మంగళూరు, పాడూర్‌లో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజీ యూనిట్లను ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసింది. రెండో దశలో భాగంగా అండర్‌గ్రౌండ్‌లో రూ. 5,514 కోట్ల వ్యయంతో వాణిజ్య, వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజీ యూనిట్‌ను ప్రతిపాదిస్తోంది. -
పీఎం–ఈబస్ సేవాతో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. -
9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి
ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. కోవిడ్ సమయంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రైవేటీకరణలో మరింత జాప్యం.. విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్ ఎఫెక్ట్’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ పేర్కొన్నారు. -
మౌలికానికి గతి ‘శక్తి’
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్‌ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు. సిసలైన పీపీపీ విధానం.. ఇన్ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది. దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్‌పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు. పుష్కలంగా డేటా.. గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక రైళ్లు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించడానికి 150కిపైగా మార్గాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ)లో ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ నవంబర్ 2020లో ప్రతిపాదనలు చేసిందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు సతీశ్‌చంద్ర దూబే ప్రశ్నకు ఆయన శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 12 క్లస్టర్లలో పీపీపీ పద్ధతిలో నడిచే రైళ్లు ఎంపిక చేశామన్నారు. సికింద్రాబాద్ తదితర క్లస్టర్లలో తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల మీదుగా పీపీపీ పద్ధతిలో 25 మార్గాల్లో 50 ఆధునిక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం
తిరువనంతపురం : కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలపడాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఖండించింది. తిరువనంతపురం విమానాశ్రయంతో పాటు మరో మూడు విమానాశ్రయాల నిర్వహణ హక్కులను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విమానాశ్రయ కార్యకలాపాలు, నిర్వాహణను స్పెషల్ పర్పస్ వెహికిల్ ( ఎస్పీవీ) కి బదిలీ చేయాలని కేరళ పదేపదే చేసిన చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్న ఎస్పీవీకి తిరువనంతపురం విమానాశ్రయ నిర్వాహణ బాధ్యతలను తమకు అప్పగిస్తామని 2003లో ఇచ్చిన హామీని కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. విమానాశ్రయ అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన కృషిని విస్మరించిందన్నారు. కేంద్రం తీసుకున్న ఏకపక్షంగా ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. (ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ) దేశంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిలో జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. విమానాశ్రయాలను ప్రైవేటుకు లీజుకు ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్వాగతించారు. బిజెపి ఎంపి వి మురళీధరన్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. (అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు) -
మరో 5 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య హోదా
న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) చట్టం–2017 కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇండి యన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు–2020ను తీసు కొచ్చారు. ఇప్పటికే ఈ జాబితాలో 15 ఐఐఐటీలు ఉన్నాయి. సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు తాజాగా జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. దీంతో ఈ సంస్థల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతోందని, దేశం పరిశోధనలు, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
స్థానికులకే 75% ఉద్యోగాలపై నిబంధనలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం నిబంధనలు జారీ చేసింది. వీటిని కర్మాగారాలు, పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద నడిచేవాటితోపాటు జాయింట్ వెంచర్స్‌లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతిక, అత్యంత నైపుణ్యం, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వారిని కూడా తీసుకోవాలి. జనవరి నుంచి మూడు త్రైమాసికాల్లో నియామకాలు చేయాలి. ఈ నియామకాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి కల్పన ట్రైనింగ్– ఫ్యాక్టరీస్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇండస్ట్రీస్ కమిషనర్ మెంబర్‌గా, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీలో పదేళ్లుగా నివశిస్తున్న ఎవరైనా ఈ చట్టం కింద ప్రయోజనం పొందొచ్చు. రేషన్ కార్డు, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఓటర్ ఐడీ కార్డ్, గ్యాస్ కనెక్షన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు ఉండాలి. ఇవి లేకపోతే స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ధ్రువపత్రాన్ని నివాసానికి తగిన రుజువుగా పరిగణించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కంపెనీల్లో స్థానికంగా నివశిస్తున్నవారికి 75% ఉపాధి కల్పించాలి. నైపుణ్యం లేని వారని కంపెనీలు భావిస్తే నోడల్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. నోడల్ ఏజెన్సీ అభ్యర్థులకు తగిన శిక్షణ ఇప్పించి నైపుణ్యాల మెరుగుదలకు కృషి చేస్తుంది. కంపెనీలు, సంస్థల యజమానులు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావించి చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే యజమాని నేరం చేసినట్లు భావించి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి అయితే రూ.50 వేలు జరిమానా విధిస్తారు. -
‘టోలు’ తీసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రోడ్డెక్కితే చాలు ‘టోలు’ తీసేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లను దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ రోడ్డువిస్తరణ కోసం పీపీపీ (ప్రభుత్వ-ప్రై వేటు భాగస్వామ్యం) ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. మొత్తం 32 రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు రూ.8,182 కోట్లతో ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో పీపీపీ ప్రాజెక్టుల కింద గుంటూరు-బాపట్ల, విజయనగరం-పాలకొండ రహదారులకుగాను రూ.1,462 కోట్లతో ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం ఈ రెండు రహదారులకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ జీవో జారీ చేశారు. టోల్ ప్లస్ యాన్యుటీ విధానంలో ఈ రెండు రహదారులకు అనుమతులిచ్చారు. గుంటూరు-బాపట్ల నాలుగు లేన్ల రహదారికి రూ.849 కోట్లు, విజయనగరం-పాలకొండ రెండు/నాలుగు లేన్ల రహదారికి రూ.613 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గుంటూరు-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.571 కోట్లు కాగా, భూ సేకరణకు రూ.207 కోట్లు, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూ.46 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.25 కోట్లు కేటాయించారు. విజయనగరం-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.434 కోట్లు.. ఇందులో సివిల్ కనస్ట్రక్షన్ ఖర్చు రూ.347.87 కోట్లు కాగా, భూమి సూకరణకు రూ.126 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.17.39 కోట్లు, కిలోమీటరుకు సివిల్ వర్కు వ్యయం రూ.4.73 కోట్లు చొప్పున కేటాయించారు. -
రైల్వే బడ్జెట్‌పై.. నేతల అభిప్రాయాలు
ఇది పీపీపీ బడ్జెట్: వినోద్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్చౌక్లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు. రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు. మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్‌రెడ్డి ‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్‌ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’ సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల కేంద్ర సాధారణ బడ్జెట్‌ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్‌పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్‌ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. జనాకర్షణకు స్వస్తి: జేపీ జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్లో దక్కిందేమీ లేదన్నారు.