ఇది పీపీపీ బడ్జెట్: వినోద్
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు.
రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత
రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు.
రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు.
మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్‌రెడ్డి
‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్‌ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’
సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల
కేంద్ర సాధారణ బడ్జెట్‌ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్‌పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్‌ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు.
జనాకర్షణకు స్వస్తి: జేపీ
జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ
రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్‌లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్‌లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు
కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్‌లో దక్కిందేమీ లేదన్నారు.
రైల్వే బడ్జెట్‌పై.. నేతల అభిప్రాయాలు
Published Wed, Jul 9 2014 3:43 AM | Last Updated on Thu, Aug 9 2018 8:51 PM
Advertisement
Advertisement