![PM Gati Shakti to play big role in development of modern infrastructure - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/1/NARENDRA-MODI.jpg.webp?itok=toU_UxOy)
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్‌ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్‌ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు.
సిసలైన పీపీపీ విధానం..
ఇన్‌ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్‌ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది.
దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్‌ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్‌పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు.
పుష్కలంగా డేటా..
గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment