
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు.
రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు
రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్‌లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు.
కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment