సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ నిధులు తగ్గించలేదని, ఏ రాష్ట్రాన్ని కూడా చిన్నచూపు చూడాలన్న ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 42% నుంచి 41 శాతానికి తగ్గించింది తాము కాదని, ఆర్థిక సంఘం సిఫారసు మేరకే నిధులు కేటాయించామని చెప్పారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గిన కారణంగా ఆ నిధులను అన్ని రాష్ట్రా లకూ పంచామని, అదే విధంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడంతో వాటికి నిధుల కేటాయింపునకుగాను పన్నుల వాటా తగ్గించాలన్న ఆర్థిక సం ఘం సిఫారసునే అమలు చేశామ న్నారు. కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాలతో సమావేశ మయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్ విలే కరుల సమావేశంలో మాట్లాడారు.
పన్నుల వాటా తగ్గించలేదు...
‘2011 జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక సంఘం వచ్చే ఏడాదికి సంబంధించిన సిఫారసులు మాత్రమే చేసింది. మరో నాలుగేళ్లకుగాను త్వరలోనే సిఫారసులు ఇస్తుంది’ అని నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్రాలకు తాము సహకరించడం లేదనేది సరికాదని, పన్నుల వాటా కేంద్రం తగ్గించలేదని చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలు విన్నా...!
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నాయకులు మాట్లా డింది తాను విన్నానని, ఓ మంత్రి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది అనడం సరికాదని, అది తమ హక్కు అని వ్యాఖ్యానించడం తన దృష్టికి వచ్చిందని నిర్మలా సీతారామన్ పరోక్షంగా కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దేశ ప్రగతి కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు. కేంద్రానికి చెల్లించే పన్నుల్లో తెలంగాణ వాటా ప్రశంసనీయమని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే కేంద్రం ఇచ్చింది అనే పదం చెప్పడానికి పార్లమెంటు అనుమతి ఉందని, ఇచ్చింది అనే పదం సరైంది కాదనే భావన ఉంటే ఆ విషయం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని, ఇచ్చింది అనే పదం అన్‌పార్లమెంటరీ అని స్పీకర్‌ను చెప్పమనాలని సూచించారు. అలా చేయకుండా మీరు ఇచ్చారంటారేంటి? మేం మా వాటా ఇస్తున్నాం కదా... అని అనడం ఒక రకంగా అనిపించిందని నిర్మల వ్యాఖ్యానించారు.
సమాఖ్య స్ఫూర్తే ప్రధాని ఉద్దేశం...
ఏ రాష్ట్రాన్నీ తగ్గించి చూడాలన్నది తమ ఉద్దేశం కాదని, సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలతో సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని నిర్మలా సీతారామన్ వివరించారు. 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క పథకానికీ నిధులు తగ్గించలేదని ఆమె చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల డిమాండ్‌ను బట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో కొత్త విధానాన్ని తీసుకువచ్చామని, రాయితీలు లేని స్పష్టమైన, సులభతరమైన పన్ను రేటు తగ్గింపే కేంద్రం ఉద్దేశమని చెప్పారు. అయితే ఏ విధానంలో పన్ను చెల్లించాలన్నది చెల్లింపుదారుల ఇష్టమని, ఫలానా విధానం ద్వారానే ఐటీ చెల్లించాలని తాము ఒత్తిడి చేయబోమని స్పష్టం చేశారు.
జీఎస్టీ పరిహారం అందరికీ నిలిపేశాం...
జీఎస్టీ పరిహారం నిధులు ఒక్క తెలంగాణకే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ నిలిపివేశామని నిర్మలా చెప్పారు. జీఎస్టీ చట్టం ప్రకారం పరిహారం నిధులను వసూలైన పరిహారం సెస్ నుంచే చెల్లించాల్సి ఉందని, ఇప్పటివరకు తమకు వచ్చిన సెస్ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేశామని, అదనంగా చెల్లించేందుకు తమ వద్ద సెస్ నిల్వ లేదని వివరించారు. సెస్ వసూళ్లను బట్టి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, రూ. 2 వేల నోట్లు రద్దవుతున్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని నిర్మల చెప్పారు.
తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ సిఫార్సు వాస్తవమే...
తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఏ పద్దు ద్వారా చెల్లించాలి, గతంలో ఈ పద్ధతి ఉందా... చెల్లింపులకు వీలవుతుందా అనే అంశాలను పరిశీలించాలని తిరిగి ఆర్థిక సంఘానికే ఈ ప్రతిపాదన పంపినట్లు నిర్మల చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రైల్వే పనులు నిలిచిపోయాయన్న వాదనలో నిజం లేదని, తాము నిధులు ఇస్తున్నామని, స్థానిక సమస్యల కారణంగానే రైల్వే పనులు నిలిచిపోయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఫలానా పని ఆగిపోయిందని తన దృష్టికి తెస్తే రైల్వే శాఖకు పంపుతామని చెప్పారు. బడ్జెట్‌పై ఇప్పటివరకు పర్యటించిన మూడు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ఎక్కువగా ఐటీ చెల్లింపు విధానం, ఐటీ వివాదాల పరిష్కారం లాంటి అంశాలపైనే పారిశ్రామిక వర్గాలు వివరాలు అడుగుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మల చెప్పారు.
నాది ‘టూటా బూటా’ హిందీ
విలేకరుల సమావేశంలో భాగంగా ఓ హిందీ విలేకరి, మరో తెలుగు విలేకరి కలిపి అడిగిన ప్రశ్నకు నిర్మల ఆంగ్లం, తెలుగులో జవాబిచ్చారు. ఆ తర్వాత హిందీ విలేకరిని ఉద్దేశించి ‘మీకు హిందీలో చెప్పలేదు కదా...! నాది టూటా బూటా హిందీ.... అందుకే చెప్పలేదు’ అంటూ చమత్కరించారు. అయితే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులు దాటవేశారు. కేంద్ర ఆర్థిక విధానాల వల్లే తెలంగాణ నష్టపోతోందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది కదా అని ప్రశ్నించగా, తాను సమాధానం చెప్పదల్చుకోలేదని నిర్మల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీలకు అనుగుణంగా నిధుల కేటాయింపు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధుల కోసం నీతీ ఆయోగ్ సిఫారసులు తదితర ప్రశ్నలకు కూడా ఆమె చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు.
తెలంగాణకు నిధులు 128 శాతం పెరిగాయి..
దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా తెలంగాణకు కేంద్రం నిధుల కేటాయింపు చేస్తోందని కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ చెప్పారు. 2010–15 వరకు రాష్ట్రానికి మొత్తం రూ. 46,747 కోట్ల పన్నులు, గ్రాంట్లు, ఇతర రూపాల్లో ఇవ్వగా 2015–20 వరకు అది రూ. 1,06,606 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రాష్ట్రం తీసుకొనే అప్పుల పరిమితిని కూడా 3 నుంచి 3.5 శాతానికి పెంచామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
చదవండి : బడ్జెట్ గురించి అందరికీ తెలియాలి
Comments
Please login to add a commentAdd a comment