న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్‌లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్‌లో మంత్రి ప్రవేశపెట్టారు.
ఎందుకు ఈ పథకం..?
ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు.
ఎవరికి వర్తిస్తుంది..
ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.
ఎంత మేర చెల్లించాలి..?
సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది.
దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది.
♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది.
అందరికీ ఈ పథకం వర్తించదండోయ్..
ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు.
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
Published Tue, Mar 3 2020 5:19 AM | Last Updated on Tue, Mar 3 2020 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment