సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఆ విధానంలో స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన నిధులు కేటాయించాలి. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదు. ఆన్‌లైన్‌లో విద్య పై జీఎస్టీ 18% చాలా ఎక్కువ. మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలి. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి.’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దవ్యోల్బణం 3.3 శాతం నుంచి 7.35 శాతానికి పెరగడం మంచిది కాదని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి స్థూల జాతీయ ఆదాయం (జీఏవీ) వరసగా పడిపోతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఇవాళ్టికి కూడా దాదాపు 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్న విషయం మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా 2020–21లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని 6.5 శాతంగా అంచనా వేస్తున్నారని, ద్రవ్యలోటును నియంత్రించడం కోసం ఆహార సబ్సిడీని, వ్యవసాయ రుణాల మాఫీని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం జరుగుతన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందువల్ల వాటిపై ఆలోచన చేయాల్సి ఉందని కేంద్రాన్ని కోరారు. ఇక ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఆర్థిక సర్వేలో నెట్వర్క్ ఉత్పత్తులనే ప్రస్తావించారని, వాటితో పాటు సంప్రదాయ ఉత్పత్తులు.. కాఫీ, టీ, స్పైసెస్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సంపద సృష్టిపై దృష్టి పెట్టారని, ఆ ప్రక్రియలో భాగంగా ఏపీ వంటి రాష్ట్రాలలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని కేంద్రం ప్రకటించాలని సూచించారు.
బడ్జెట్ ఎలా ఉంది?
ఈ బడ్జెట్లో కొన్ని సానుకూలం గానూ, మరి కొన్ని ప్రతికూలంగానూ ఉన్నాయని శ్రీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో డిపాజిటర్ల ఇన్సూరెన్స్ కవరేజీని (డీజీసీసీ) లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పెంచారని, దీని వల్ల చిన్న డిపాజిటర్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ బడ్జెట్లో ద్రవ్య లోటును 3.8 శాతంగా అంచనా వేశారని, కానీ ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 3 శాతమే ఉండాలన్న ఆయన, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
రాష్ట్ర వాటా ఇవ్వాలి
వ్యవసాయ రుణాలను రూ.15 లక్షల కోట్లుగా ప్రతిపాదించారని గుర్తు చేసిన వైయస్సార్సీపీ పీపీ నేత, ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి, నిష్పాక్షికంగా రాష్ట్రానికి చెందవలసిన వాటా ఇవ్వాలని కోరారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తామని ప్రధానిగా మోదీ తొలిసారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారని శ్రీ వి.విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అయితే ఇప్పటికే మనం 2020లోకి వచ్చామన్న ఆయన, మరి వచ్చే రెండేళ్లలో దాన్ని ఎలా సాధిస్తారని ప్రస్తావించారు. ఇన్నేళ్లు గడిచినా ఎంత వరకు సాధించామన్న ఆయన, ఆ లక్ష్య సాధనకు సంబంధించి విధి విధానాలు ఏవి అని ప్రశ్నించారు.
జీఎస్టీ తగ్గాలి
విద్య, శిక్షణ రంగాలలో మానవ వనరుల అభివృద్ధి ఇంకా జరగాలన్న వైయస్సార్సీపీ పీపీ నేత, గల్ఫ్ దేశాలకు కూడా అవి తోడ్పడాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ విద్యపై 18 శాతం జీఎస్టీ ఉందని, కాబట్టి దాన్ని తగ్గించాలని సూచించారు. ఇంకా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారానే నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ నిర్ణయం అభినందనీయమని, కామర్స్ రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయింపు మంచిదని చెప్పారు. కొత్తగా 6 న్యూ నెట్వర్క్ సైట్స్ అన్నది మంచి నిర్ణయమన్న శ్రీ వి.విజయసాయిరెడ్డి, అయితే వాటిలో మొబైల్ రంగంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, కాబట్టి ఇప్పటికే ఉన్న వాటిపైనా దృష్టి పెట్టాలని కోరారు.
అంత బడ్జెట్ సాధ్యమా?
‘రూ.100 లక్షల కోట్లు మౌలిక వసతులు, సంబంధిత రంగాలపై ఖర్చు చేస్తామన్నారు. హౌసింగ్, మెట్రో, విద్య, విమానాశ్రయాల వంటి రంగాలపై ఆ మొత్తం ఖర్చు చేస్తామన్నారు. కానీ మన పూర్తి బడ్జెట్ చూస్తే కేవలం రూ.24 లక్షల కోట్ల నుంచి రూ.28 లక్షల కోట్లు మాత్రమే ఉంది. మరి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఎలా ఖర్చు చేస్తారు’ అని సూటిగా ప్రశ్నించారు.
ఏపీకి కూడా వాటా రావాలి
ఇంకా రైల్వే బడ్జెట్లో ఏపీకి ఒక్క కొత్త ప్రాజెక్టు ఇచ్చినట్లు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా అభివృద్ధి చేయనున్న 100 విమానాశ్రయాలలో ఏపీకి కూడా వాటా రావాలని కోరారు. ‘బేటీ బచావో–బేటీ పడావో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఓ)లో బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది సంతోషకర విషయం. అదే విధంగా రూ.28,600 కోట్లు మహిళా సంక్షేమానికి, ఎస్సీ, ఎస్టీ లకు కేటాయింపులు అభినందనీయం’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా-రాయితీలు ఇస్తారని ఎదురు చూశాం..
‘ఏపీకి సంబంధించి చాలా ఆశించాము. కానీ కేంద్రం మొండిచెయ్యి చూపింది. కేంద్రం పక్షపాత ధోరణి చూపకుండా, దేశమంతా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అన్న కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని, పథకాలు సమానంగా పంచాలని.. కానీ, పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతో చూడడం అభినందించే విషయం కాదన్నది కేంద్రం గుర్తించాలి. ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురుచూశాం. వైయస్సార్సీపీ ఎప్పటి నుంచో దాని కోసం పోరాడుతోంది. ఇంకా పలు రాయితీలు ఇస్తారని చూశాం. ఆదాయపన్ను కానీ, జీఎస్టీ కానీ, బీమాలో కానీ ఎన్నో వస్తాయని చూశాం. కానీ ఏదీ లేదు’ అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.
వెనుకబడిన జిల్లాల నిధుల ఊసే లేదు
రాష్ట్రంలో వెనకబడిన 7 జిల్లాలకు సంబంధించి మొత్తం రూ.24,350 కోట్లు రావాల్సి ఉందని, వాటిపై విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా, ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదని అన్నారు. చివరకు కనీసం రూ.2100 కోట్లు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. పోలవరం ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి, ఈ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలు అందిన తర్వాత, సమగ్రంగా విశ్లేషించి మళ్లీ స్పందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment