
ఆర్థిక బిల్లుపై చర్చలో విత్తమంత్రి సీతారామన్ సుదీర్ఘ ప్రసంగం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.
దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్‌లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.
ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.
రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం
‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్‌లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.
వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు
‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.
35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
పన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్‌మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment