న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్ వచ్చే 25 సంవత్సరాలకు వృద్ధికి పునాదులు వేసిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతికి కీలకమైన ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి కేంద్ర బడ్జెట్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కరోనా వైరెస్‌తో అతలాకుతలం అయిన ఎకానమీ పురోగతికి 2022–23 వార్షిక బడ్జెట్ దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నెలకొన్న సంక్లిష్ట ప్రక్రియను సరళతరం చేయడం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రక్రియ మరింత క్రమబద్ధీకరిణ జరుగుతుందని ఆయన తెలిపారు.
స్వాతంత్య్ర సముపార్జనకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 2047లో భారత్ సమోన్నత స్థితి లక్ష్యంగా 2022–23 బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. అప్పటికి భారత్ అన్ని సాంకేతిక విభాగాల్లో అగ్ర స్థానంలో ఉంటుందని, వృద్ధి ప్రయోజనాలు ప్రజలందరికీ ప్రత్యేకించి నిరుపేదలకూ అందుబాటులోకి వస్తాయని రాజీవ్ కుమార్ తెలిపారు. మౌలిక పరిశ్రమల నుంచి అభివృద్ధిలోకి వస్తున్న రంగాల వరకూ పటిష్ట పురోగతి, సాంకేతికాభివృద్ధి తాజా బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పన్ను కోతల రూపంలో మధ్య తరగతికి ఎటువంటి ప్రయోజనాలూ కల్పించలేదన్న విమర్శకు సమాధానమిస్తూ ఈ విషయంలో ప్రస్తుత రేట్లు సజావుగానే ఉన్నాయని రాజీవ్ కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment