‘టోలు’ తీసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రోడ్డెక్కితే చాలు ‘టోలు’ తీసేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లను దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ రోడ్డువిస్తరణ కోసం పీపీపీ (ప్రభుత్వ-ప్రై వేటు భాగస్వామ్యం) ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. మొత్తం 32 రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు రూ.8,182 కోట్లతో ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో పీపీపీ ప్రాజెక్టుల కింద గుంటూరు-బాపట్ల, విజయనగరం-పాలకొండ రహదారులకుగాను రూ.1,462 కోట్లతో ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది.
దీంతో గురువారం ఈ రెండు రహదారులకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ జీవో జారీ చేశారు. టోల్ ప్లస్ యాన్యుటీ విధానంలో ఈ రెండు రహదారులకు అనుమతులిచ్చారు. గుంటూరు-బాపట్ల నాలుగు లేన్ల రహదారికి రూ.849 కోట్లు, విజయనగరం-పాలకొండ రెండు/నాలుగు లేన్ల రహదారికి రూ.613 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గుంటూరు-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.571 కోట్లు కాగా, భూ సేకరణకు రూ.207 కోట్లు, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూ.46 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.25 కోట్లు కేటాయించారు. విజయనగరం-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.434 కోట్లు.. ఇందులో సివిల్ కనస్ట్రక్షన్ ఖర్చు రూ.347.87 కోట్లు కాగా, భూమి సూకరణకు రూ.126 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.17.39 కోట్లు, కిలోమీటరుకు సివిల్ వర్కు వ్యయం రూ.4.73 కోట్లు చొప్పున కేటాయించారు.