space technology
-
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
దేశీ స్టార్టప్‌కు నాసా కాంట్రాక్టు
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు భూగోళ పరిశీలన డేటా సంబంధ సర్వీసులను అందించే కాంట్రాక్టు దక్కించుకుంది. 476 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, వాటిలో పిక్సెల్ కూడా ఒకటి. భూమిపై జీవనాన్ని మెరుగుపర్చేందుకు నాసా సాగిస్తున్న పరిశోధన కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఈ కంపెనీలు ఎర్త్–అబ్జర్వేషన్ డేటాను అందిస్తాయి. కాంతి తరంగధైర్ఘ్యాల వ్యాప్తంగా ఉండే డేటాను హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజ్‌ల రూపంలో సేకరించి, వాతావరణ మార్పులు, వ్యవసాయం, జీవ వైవిధ్యం, వనరుల నిర్వహణ మొదలైన వాటి సూక్ష్మ వివరాలను పిక్సెల్ టెక్నాలజీ అందిస్తుంది.ఇదీ చదవండి: నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులునేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) కాంట్రాక్టు దక్కడంపై పిక్సెల్ సహ–వ్యవస్థాపకుడు అవైస్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష ఆధారిత భూ పరిశోధనల్లో హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ కీలకంగా మారబోతోందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరింత అధిక రిజల్యూషన్‌తో ఇమేజ్‌లు ఇచ్చే ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పిక్సెల్ తెలిపింది. భూగోళ అధ్యయనానికి అవసరమయ్యే వివరాలను తక్కువ వ్యయాలతో సేకరించేందుకు తాజా కాంట్రాక్టు ఉపయోగపడగలదని నాసా పేర్కొంది. -
కాప్సూల్ ఇంట్లో కులాసాగా..
సాక్షి, అమరావతి: ఈ ఇంటిని చూస్తే.. సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలో ఇంటిలాగానో, అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేసిన స్పేస్ షిప్లాగానో ఉంది కదూ! ఈ ఇంటి లోపల చూస్తే నిజానికి అదే అనుభూతి కలుగుతుంది. స్పేస్ కాప్సూల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 20 ఏళ్ల క్రితం ‘నాసా’ స్పేస్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ తరహా మోడల్ హౌసెస్ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలైన మార్వెల్ మూవీస్‌లో సైతం కన్పిస్తుంటాయి. అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని చైనా శాస్త్రవేత్తలు అందిపుచ్చుకొని విశ్వవ్యాప్తం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సాంకేతిక, పరికరాలన్నీ చైనా నుంచే ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాతో పాటు చైనా, యూరప్, గల్ఫ్ దేశాల్లో విస్తృతంగా వాడుకలోకి ఉన్న ఈ ఇళ్ల నిర్మాణ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందుబాటులోకి వచి్చంది. రాజమహేంద్రవరానికి చెందిన సీబాక్స్ హౌసెస్ కంపెనీ రాష్ట్రానికి ఈ కొత్త ఇళ్లను పరిచయం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ అంతా విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నదే. ఇంటి అవుట్‌సైడ్ బాడీ అల్యూమినియంతోనూ, ఇన్సైడ్ బాడీ స్ట్రక్చర్ పూర్తిగా గల్వనైజ్డ్ ఐరన్తోనూ నిరి్మస్తారు. ఇక తలుపులు, కిటికీల కోసం గట్టిగా ఉండే అత్యాధునిక ప్లాస్టిక్ ఉడ్ని వాడుతున్నారు. 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. కావాల్సిన మోడల్స్‌లో సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, ట్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని అత్యంత సులువుగా నిరి్మంచుకోవచ్చు. 45 రోజుల్లో ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణానికి కేవలం 45 రోజుల సమయం పడుతుంది. మోడల్‌ను బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు అవుతుంది. ఇవి 50 ఏళ్ల వరకు చెక్కుచెదరవు. క్రేన్ సహాయంతో కంటైనర్లు తరలించే భారీ లారీలపై ఒకచోట నుంచి మరొక చోటకు అత్యంత సులభంగా తరలించుకుపోవచ్చు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లో నిరి్మంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ నిర్మాణానికి ఇవి ఎంతగానో అనుకూలం. మడత పెట్టే ఫోల్డెడ్ హౌసెస్ మడత పెట్టే కురీ్చలు, మంచాల మాదిరిగానే దేశంలోనే తొలిసారి మడతపెట్టే పోల్డెడ్ హౌసెస్ కూడా మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం గంటలోనే వీటిని ఫిక్స్ చేయవచ్చు. 1 బీహెచ్‌కే నుంచి 4 బీహెచ్‌కే ఫోల్డబుల్ హౌసెస్ నిర్మించుకోవచ్చు. వీటి నిర్మాణానికి జీఏ మెటీరియల్‌ను వినియోగించడం వలన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కేవలం రూ. 11.5 లక్షల్లోనే ఆకర్షణీయమైన ఇల్లు అందుబాటులోకి వస్తుంది. కంటైనర్ హౌసెస్ కాదు» ఇవి కంటైనర్ హౌసెస్ లాంటివి కాదు. పూర్తి రక్షణతో కూడుకున్న గృహాలు. » ఇవి సన్ ప్రూఫ్‌తో పాటు ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్ కూడా. నిర్మాణంలో అన్బ్రేకబుల్ డీజే గ్లాసెస్‌ను వినియోగిస్తున్నారు. » సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా తనకు తానుగా మార్చుకునే ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఫ్లోర్ ఈ ఇంటి ప్రత్యేకం. » ఆహ్లాదం గొలిపేలా అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఇంటీరియర్స్ ఉంటాయి. » అత్యంత లగ్జరీగా ఉండే లివింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్స్, బాత్ రూమ్స్, స్మార్ట్ టాయిలెట్, రిమోట్‌తో పనిచేసే ఆటోమేటిక్ కర్టెన్స్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఇళ్ల సొంతం. దేశంలోనే తొలి ప్రయోగంఏడాది క్రితం చైనాకు వెళ్లినప్పుడు ఈ తరహా మోడల్స్ చూశాం. చాలా బాగున్నాయనిపించి వీటిని మన దేశానికి తీసుకురావాలన్న సంకల్పంతో సీబాక్స్ హోమ్స్‌ను ప్రారంభించాం. మన దేశంలో స్పేస్ టెక్నాలజీతో ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. మెటీరియల్ పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 8 ఇళ్ల నిర్మాణానికి ఆర్డర్స్ వచ్చాయి. రాజమహేంద్రవరంలోని జేఎన్రోడ్లో మోడెల్ హౌసెస్‌ను ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఫోల్డెడ్ హౌసెస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ తరహా ఇళ్ల నిర్మాణం దేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. ఏడాది పాటు సరీ్వస్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత సరీ్వస్ చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం కోసం చైనాలో శిక్షణ పొందిన 10 మంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – ఎం.ప్రదీప్, మేనేజర్, సీబాక్స్ హోమ్స్ -
స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం..
కాలేజీ రోజుల్లో కల కనని వారు అంటూ ఉండరు. ఆ కలకు కష్టం, అంకితభావం తోడైతే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘దిగంతర’ నిరూపించింది. అనిరుథ్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్ అనే కుర్రవాళ్లు కాలేజీ రోజుల్లో కన్న కలను స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం చేసుకొని తిరుగు లేని విజయాన్ని సాధించారు..‘దిగంతర మొదలైనప్పుడు, ఇప్పటికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు వినిపించే జవాబు... ‘దిగంతర’ అంటే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే సంస్థగానే ఎక్కువ గుర్తింపు ఉండేది. తాజా విషయానికి వస్తే... వినియోగదారులకు సేవలు అందించడం మాత్రమే కాకుండా మన దేశ రక్షణ ప్రయోజనాల విషయంలో మౌలిక సదు΄ాయాలను అందించే సంస్థగా అభివృద్ధి చెందింది. ‘అంతరిక్షంలో ఏం జరుగుతుంది?’ అనేది అర్థం చేసుకోవడానికి స్పేస్ డొమైన్ అవేర్నెస్ కంపెనీగా ఎదిగింది.దిగంతరకు సంబంధించిన ఐడియా కాలేజీ రోజుల్లోనే అనిరు«థ్ శర్మ, రాహుల్ రావత్‌లకు వచ్చింది. బెంగళూరులో శాటిలైట్ క్లబ్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్‌తో కలిసి ‘దిగంతర’ కలను సాకారం చేసుకున్నారు. విమానయానం, సముద్ర నావిగేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలు, నియమాలు ఉన్నాయి. అంతరిక్షానికి సంబంధించి అలాంటివి లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘స్పేస్ డొమైన్ అవేర్నెస్’కు ప్రాధాన్యత ఇస్తోంది దిగంతర.దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పేస్ డొమైన్ అవేర్నెస్ వల్ల అంతరిక్షంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. స్పేస్–మ్యాప్ (స్పేస్ మిషన్ ఎష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్), స్టార్స్(స్పేస్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్సాన్స్ సూట్) అనే రెండు సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేసింది కంపెనీ. అంతరిక్ష ఆధారిత సెన్సర్లు, గ్రౌండ్ ఆధారిత టెలిస్కోపిక్ అబ్జర్వేటరీల కాంబినేషన్‌ను ఉపయోగిస్తోంది దిగంతర.ఈ అబ్జర్వేటరీలలో మొదటిది లద్దాఖ్‌లో రానుంది. సెన్సర్ల నుంచి తీసుకున్న డెటా, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతరత్రా సంస్థల నుంచి సేకరించిన డేటాతో తన సొంత లైబ్రరీలను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ లైబ్రరీలను ఉపయోగించి విశ్లేషణలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.‘దిగంతర’కు ‘సింగపూర్ స్పేస్ అండ్ టెక్నాలజీ’లాంటి అంతర్జాతీయ కస్టమర్లు ఉన్నారు. మైత్రి(మిషన్ ఫర్ ఆస్ట్రేలియా–ఇండియా టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్)లో భాగంగా ఆప్టికల్ సెన్సర్ల సప్లైకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన స్పేస్ మెషిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఆపరేషన్స్, సిచ్యుయేషనల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కటింగ్–ఎడ్జ్ టెక్నాలజీతో దూసుకు΄ోతున్న ‘దిగంతర’ అంతరిక్షానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ‘వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్’ అనేది ముగ్గురు మిత్రులకు ఇష్టమైన మాట. ఆ మాటకు అర్థం ఏమిటో ‘దిగంతర’ విజయం చెప్పకనే చెబుతోంది.ఇవి చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
భూమి మీద సరే.. చంద్రుడిపై టైం, తేదీలను ఎలా లెక్కిస్తారు?
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్ ప్రకారం జరగాల్సిందే. వాచీలోనో, ఫోన్లోనో టైమ్ చూసుకుంటూ జీవితాన్ని పరుగెత్తించాల్సిందే. మనం అనుకున్నదేదైనా జరగకుంటే ‘టైం’ బాగోలేదని వాపోవడమే. ఇది సరేగానీ.. భూమిపై ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. ఇండియాకు పగలు అయితే.. అమెరికాకు రాత్రి అవుతుంది. మరి అంతరిక్షంలో ఏ టైమ్, తేదీ పాటించాలి? చంద్రుడిపై సమయం, తేదీలను లెక్కించేదెలా? ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా.. వీటికి సమాధానాలేమిటో తెలుసుకుందామా.. అప్పట్లో చుక్కలను చూస్తూ.. మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. తర్వాతి కాలంలో గడియారాలతో సమ యాన్ని లెక్కించడం మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో తేడాకు అనుగుణంగా.. భూమిని వివిధ టైమ్ జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు సమయాలను వినియోగిస్తున్నారు. మనుషులు భూమికే పరిమితమైనంత కాలం ఇది బాగానే ఉంది. కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్య త్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.. ఏ ‘టైమ్’ను అనుసరించాలనే తిప్పలు మొదలయ్యాయి.\ ఇప్పుడు స్పేస్‌లో వాడుతున్నది ఏ ‘టైమ్’? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్) భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ఈ సమయంలో పదహారు సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశంపై ఉంటుంది. మరి టైమ్ ఎలా!?.. దీని కోసం ‘యూనివర్సల్ టైమ్ (యూటీ)’ను పాటిస్తున్నారు. - భూమ్మీద టైమ్ జోన్లను ఏర్పాటు చేసు కున్నప్పుడు బ్రిటన్‌లోని గ్రీన్ విచ్ ప్రాంతాన్ని మూలంగా తీసుకున్నారు. అక్కడ మొదలయ్యే మొదటి టైమ్ జోన్‌ను ‘గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి దీనినే ‘యూనివర్సల్ టైమ్’గా పాటిస్తున్నారు. - అయితే ఈ ‘యూటీ’ కేవలం భూమి చుట్టూ ఉన్న స్పేస్ వరకే.. చంద్రుడిపై, అంగారకుడిపై టైమ్‌ను లెక్కించేందుకు ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలూ లేవు. స్పేస్ ప్రయోగాలకు.. ‘ఎంఈటీ’.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వాటిని లాంచ్ చేసిన క్షణం నుంచి.. ఎంతెంత సమయం గడిచిన కొద్దీ ఏమేం జరిగిందనేది కీలకమైన అంశం. ఈ క్రమంలోనే స్పేస్ ప్రయోగాల్లో ప్రత్యేకంగా ‘మిషన్ ఎలాప్స్‌డ్ టైమ్ (ఎంఈటీ)’ని వాడుతారు. అంటే ఒక రాకెట్ లాంచ్ అయినప్పటి నుంచీ టైమ్ లెక్కించడం మొదలుపెడతారు. దీనినే ‘టీ ప్లస్ టైమ్’గా చూపిస్తారు. - ఉదాహరణకు ఒక చంద్రుడి వద్దకు కృత్రిమ ఉపగ్రహాన్ని పంపి, 2రోజుల 5 గంటల పది నిమి షాలు అయితే.. ఆ శాటిలైట్‌కు సంబంధించిన టైమ్‌ను ‘టీ+ 2డేస్ 5 హవర్స్ 10 మినట్స్’గా లెక్కిస్తారు. ఈ విధానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టినప్పటి నుంచీ వాడుతున్నారు. అప్పట్లో దీనిని ‘గ్రౌండ్ ఎలాప్స్‌డ్ టైమ్ (జీఈటీ)’గా పిలిచారు. తర్వాత ఎంఈటీగా మార్చారు. చంద్రుడిపై ఇలా లెక్కిస్తే సరి అంటూ.. - స్పేస్ ప్రయోగాల వరకు సరేగానీ.. చంద్రుడిపై నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ ‘టైమ్’ ఎలాగనే సందేహాలు మొదలయ్యాయి. భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే కష్టం. - సాధారణంగా సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పగలు.. అప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం వరకు రాత్రి. ఈ లెక్కన చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి (భూమ్మీది సమయం ప్రకారం). అంటే చంద్రుడిపై ఒక రోజు (మూన్ డే) అంటే.. మనకు నెల రోజులు అన్నమాట. - ఈ సమస్యను అధిగమించడానికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఉంది. చంద్రుడిపై సెకన్లు, నిమిషాలు, గంటలను యథాతథంగా లెక్కిస్తూనే.. రోజు (24 గంటల సమయం)ను మాత్రం ఒక సైకిల్‌గా పిలవాలని, 30 సైకిల్స్ కలిస్తే ఒక పూర్తి మూన్డేగా పరిగణించాలని ఆలోచన. అంటే మనకు ఒక నెల ఒక మూన్డే.. మనకు ఒక రోజు ఒక మూన్ సైకిల్‌గా లెక్కించొచ్చు. దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తెలంగాణ ‘స్పేస్’ రేస్!
సాక్షి, హైదరాబాద్: విశ్వాన్వేషణ, అంతరిక్ష సాంకేతిక రంగాల ‘రేస్’లో తెలంగాణను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రూపొందించింది. దీనిని ఈ 18న వర్చువల్ ప్రపంచమైన ‘మెటావర్స్’వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలతో.. ‘స్పేస్ టెక్’కు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి తుదిరూపు దిద్దుతోంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. స్పేస్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్ వ్యవస్థల తయారీకి ఊతమిచ్చే విధానాలను తేనుంది. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికతను వ్యవసాయం, బీమా, పట్టణ ప్రణాళిక అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, పర్యావరణం, సహజ వనరులు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ రంగాల్లో వినియోగించేందుకు అవసరమైన ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెట్టనుంది. స్పేస్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ అంతరిక్ష సాంకేతికత పరిశ్రమకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా అందులో భారత్ వాటా కేవలం రెండు శాతమే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు వచ్చే ఆర్డర్లు మాత్రమే.. మన దేశ అంతరిక్ష పరిశ్రమకు ఊతంగా నిలుస్తున్నాయి. అయితే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం వేర్వేరు స్పేస్ పాలసీలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కూడా ఈ రేస్‌లో నిలిచేలా ప్రత్యేక పాలసీ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రానికి గుర్తింపుతోపాటు సాంఘిక, ఆర్థికాభివృద్ధికీ తోడ్పడుతుందని భావిస్తోంది. అనుకూల పరిస్థితులతో.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్, హార్డ్‌వేర్, జనరల్ ఇంజనీరింగ్ పార్కులు, అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ ‘టీ–హబ్’ఉన్నాయి. ఇవన్నీ అంతరిక్ష రంగ కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంగారక గ్రహం వద్దకు ఇస్రో పంపిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’విడిభాగాల్లో 30 శాతం హైదరాబాద్‌లో తయారైనవేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ‘మెటావర్స్’వేదికగా.. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఆధునికమైనదిగా భావిస్తున్న ‘మెటావర్స్’ద్వారా ‘స్పేస్‌టెక్ పాలసీ’ని రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయనుంది. ప్రపంచాన్ని వర్చువల్ (మిథ్య)గా మన ముందుంచే టెక్నాలజీతో రూపొందినదే ‘మెటావర్స్’. కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో మెటావర్స్‌ను రూపొందించారు. ఇందులో ఎవరైనా తమ ‘అవతార్’తో వర్చువల్ ప్రపంచంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. నేరుగా హాజరైన అనుభూతిని పొందవచ్చు. ఏప్రిల్ 18న ‘మెటావర్స్’వేదికగా జరిగే ‘స్పేస్ టెక్ పాలసీ’విడుదల కార్యక్రమంలో.. అతిథులతో పాటు ఐటీ శాఖ అధికారులు, స్పేస్‌టెక్ రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు వర్చువల్‌గా తమ ‘అవతార్’లతో పాల్గొననున్నారు. కాగా స్పేస్‌టెక్ పాలసీ ప్రత్యేకతలు, మెటావర్స్ ద్వారా విడుదలకు సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. -
మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించేందుకు స్పేస్ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు. అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు. స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి.. స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్.. ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్ వంటి సర్వీస్ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్ చెప్పారు. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.. స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్లైన్లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తదితరులు కోరారు. దిగ్గజాలకు సభ్యత్వం.. ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్అండ్టీ నెక్సŠట్ సీనియర్ ఈవీపీ జయంత్ పాటిల్ చైర్మన్‌గాను, భారతి ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వత్స్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, నెల్కో (టాటా గ్రూప్), మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది. -
భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారత స్పేస్ అసోసియేషన్‌ని(ఐఎస్‌పీఏ) ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతినిధులతో ప్రధాని నేడు భేటి కానున్నారు. పైగా ఇది భారత అంతరిక్షరంగం ప్రాముఖ్యతను తెలియజేసే అత్యున్నత సంస్థ. ఈ మేరకు ఐఎస్‌పీఏ న్యాయపరమైన విధానాలను చేపట్టి వాటిని తన సంస్థ వాటాదారులతో పంచుకుంటుందని తెలిపింది. ఐఎస్‌పీఏ దేశంలోని అంతరిక్ష పరిశ్రమలో వివిధ సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలతో ముందుకు రానుంది. భారత అంతరిక్ష సంస్థ అసోసియేషన్ ప్రధానమంత్రి 'ఆత్మనిర్భర్ భారత్'పై దృష్టిని సారించేలా ప్రతిధ్వనిస్తోంది. (చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు") భారతదేశాన్ని స్వయంశక్తితో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగానే కాక అంతరిక్ష రంగంలో ఒక కీలక పాత్ర పోషిస్తోందని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్‌మై ఇండియా, వాల్ చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు గోద్రేజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బిఎస్టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఇఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా వంటి ఇతర ప్రధాన కంపెనీల భాగస్వామ్యం కూడా ఉంది. (చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక) -
స్పేస్ టెక్నాలజీ హబ్‌గా రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసిన ఐటీ శాఖ... దీనిపై ఈ నెల 25లోగా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. రోజువారీ సమస్యలకు పరిష్కారాలు... ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలకు చూపడంలో అంతరిక్ష సాంకేతికత అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘స్పేస్‌కామ్ పాలసీ 2020’, ‘స్పేస్ ఆర్ఎస్ పాలసీ 2020’, ‘జియో స్పేషియల్ పాలసీ 2021’తదితరాలను విడుదల చేసింది. దీంతో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్), ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’(ఇన్‌స్పేస్) వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక రంగంలో ప్రైవేటు రంగం మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను సిద్ధం చేసింది. తద్వారా ప్రపంచ స్పేస్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధి, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు పరీక్ష కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలను ఆహ్వానించడం వంటి లక్ష్యాలను ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మౌలిక వసతులు, వాణిజ్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణల కోసం అనేక విధాన నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగంలో పేరొందిన అనంత్ టెక్నాలజీస్, వీఈఎం టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్ వంటి సంస్థలు, స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లతోపాటు డీఆర్డీఓ, ఎన్ఆర్ఎస్, అడ్రిన్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఆర్డినెన్స్ ప్యాక్టరీ వంటి రక్షణ రంగ పరిశోధన, తయారీ సంస్థలు హైదరాబాద్‌లో అంతరిక్ష సాంకేతిక వాతావరణానికి ఊతమివ్వనున్నాయి. అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఉంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లోని 30 శాతం విడిభాగాలు రాష్ట్రంలోనే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర టెక్నాలజీ పాలసీ ఆశించిన ఫలితాలను రాబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
DNA నష్టాలను సరిచేసుకునే దిశగా తొలి అడుగు!
జన్యువులను మన అవసరానికి తగ్గట్టు కత్తిరించేందుకు, భాగాలను చేర్చేందుకు, తొలగించేందుకు క్రిస్పర్ టెక్నాలజీ ఉపయగపడుతుంది. కేన్సర్ సహా అనేక వ్యాధులకు క్రిస్పర్ టెక్నాలజీ చికిత్స కల్పించగలదని అంచనా. ఇలాంటి టెక్నాలజీని తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనూ విజయవంతంగా ఉపయోగించారు. ఈ కేంద్రంలో వ్యోమగాములకు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గమూ లేదు. రేడియో ధార్మికత, గుండెజబ్బులు, మతిమరుపు వ్యోమగాములకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించేందుకు క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జీన్స్ ఇన్ స్పేస్’ పేరుతో శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలుపెట్టారు. రేడియో ధార్మికత కారణంగా సంభవించే డీఎన్ఏ నష్టాన్ని క్రిస్పర్ సాయంతో అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్‌లో కలిగించారు. అప్పుడు వాటిల్లో కలిగే మార్పులను.. భూమ్మీద ఉంచిన ఈస్ట్‌లోని మార్పులతో పోల్చి చూశారు. డీఎన్ఏ నష్టం పూర్తిగా బాగైతే ఈస్ట్ సమూహం మొత్తం ఎర్రగా మారేలా క్రిస్పర్ కిట్‌లో ప్రత్యేక భాగాన్ని జత చేశారు. ప్రయోగం చేపట్టిన ఆరు రోజులకు అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్ సమూహాల్లో చాలా వరకు ఎర్రగా మారిపోయాయి. డీఎన్ఏ నష్టాలను సరిచేసుకునే దిశగా ఇది తొలి అడుగని శాస్త్రవేత్త సెబాస్టియన్ క్రేవ్స్ తెలిపారు. -
అంతరిక్షంలో వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములు అక్కడ తినడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆ తిండి పదార్థాలకు బదులు అంతరిక్షంలోనే పండించిన సహజమైన ఆహారాన్ని వారు ఆస్వాదించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. సుదూర గ్రహాలపై వ్యవసాయం చేసేందుకు సాయం చేసే వినూత్న బ్యాక్టీరియాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్)తో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ గుర్తించినట్లు విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే నౌకల్లో పలుచోట్ల కొత్తరకం బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మిథైలోబ్యాక్టీరియేజ్ అని పిలిచే ఈ బ్యాక్టీరియాలో ఒక రకం మిథైలోరూబ్రమ్ రోడిసియానమ్ కాగా, ఇప్పటివరకూ గుర్తించని బ్యాక్టీరియా రకాలు మరో మూడు ఉన్నాయి. వీటికి భారత్‌లో కనిపించే మిథైలోబ్యాక్టీరియమ్ ఇండికమ్‌తో దగ్గరి పోలికలు ఉన్నట్లు భారతీయ శాస్త్రవేత్త, అణ్ణామలై యూనివర్సిటీ మాజీ అధ్యాపకులు డాక్టర్ అజ్మల్ ఖాన్ గుర్తించారు. ఈ కారణంగా ఆ బ్యాక్టీరియాకు మిథైలోబ్యాక్టీరియమ్ అజ్మలీ అని పేరు కూడా పెట్టారు. ఈ అజ్మలీ రకం బ్యాక్టీరియాలో మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే జన్యువులు ఉన్నట్లు తదుపరి పరిశోధనల ద్వారా తెలిసింది. జేపీఎల్‌కు చెందిన కస్తూరి వెంకటేశన్, సి.సి.వాంగ్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు, సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్‌లు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివరించింది. పరిశోధన వివరాలు ఫ్రాంటియర్స్ ఆఫ్ మైక్రోబయాలజీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఇతర గ్రహాల బాట పట్టాల్సిందే! భూమ్మీది వనరులు ఏదో ఒకరోజు అంతరించే పరిస్థితి ఉండటం, జనాభాతోపాటు అవసరాలూ పెరిగిపోనున్న నేపథ్యంలో మనిషి ఇంకో వందేళ్లకైనా ఇతర గ్రహాల బాట పట్టాల్సిందేనని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇందుకోసమే ఒకవైపు భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతూండగా.. ఇంకోవైపున భూ వాతావరణం లేని గ్రహాల్లోనూ మనిషి మనుగడ సాగించేందుకు అవసరమైన వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ వంటి వారు ఇంకో ఐదేళ్లలోనే అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని ఏర్పాటు చేస్తానని రెండేళ్ల క్రితమే ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బిగ్ ఫాల్కన్ రాకెట్ ద్వారా దశలవారీగా సామగ్రిని పంపి అంగారకుడిపైన వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చి కాలనీని ఏర్పాటు చేస్తానని, వ్యవసాయంతోపాటు అన్ని రకాల వ్యవస్థల ఏర్పాటుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని మస్క్ చెబుతున్నారు. వీటి మాటెలా ఉన్నా.. మనిషి కనీస అవసరాలైన ఆహారం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అతితక్కువ గురుత్వాకర్షణ ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా ప్రవర్తిస్తాయి? వాటి ఎదుగుదల ఎలా ఉంటుంది? వంటి అంశాలపై పలు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నాసాల సంయుక్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా వ్యవసాయంలో బ్యాక్టీరియా పాత్రపై సామాన్యులకు తెలిసింది తక్కువే. మొక్కల వేళ్ల వద్దకు పోషకాలను చేర్చడంలో బ్యాక్టీరియా కీలకపాత్ర పోషిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు గుర్తించిన అజ్మలీ రకం బ్యాక్టీరియా మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ప్రాథమికంగా తెలిసినా... మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే అంతరిక్షంలో మన కూడుకు ఢోకా లేనట్లే!! కాకపోతే ఈ విషయం తెలిసేందుకు మరికొంత సమయం పడుతుంది!! -
ఆరుబయట మందు తాగితే డీజీపీ ఆఫీస్‌కు సమాచారం
సాక్షి, హైదరాబాద్ : టెక్నాలజీ సాయంతో నేర దర్యాప్తులో దేశంలోనే నం.1గా ఉన్న తెలంగాణ పోలీసు శాఖ విప్లవాత్మక ముందడుగు వేసింది. నేరాల నియంత్రణకు స్పేస్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదం జరిగినా.. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా క్షణాల్లో డీజీపీ కార్యాలయంలో తెలిసిపోతుంది. వెంటనే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో నేర నియంత్రణ, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, అన్ని పోలీస్ స్టేషన్ సరిహద్దుల నిర్ధారణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ అంశాలపై డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) కార్యాలయంలో ట్రాక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాక్ సైంటిఫిక్ ఇంజనీర్లతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేందర్, సాయుధ బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ కూడా పాల్గొన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్రంలో నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికిగాను ‘ట్రాక్’తో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో.. రిమోట్ సెన్సింగ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్, తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవించే ప్రాంతాలు, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ని ట్రాక్ సాయంతో చేపట్టనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేయాలని కూడా నిర్ణయించారు. తద్వారా పోలీస్ స్టేషన్ల సరిహద్దుల పేర్లు స్పష్టంగా తెలియడంతో పాటు ఫిర్యాదుల నమోదుకు సరైన పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకునే అవకాశం ప్రజలకు ఏర్పడుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్ చేయాలని డీజీపీ కోరారు. ఆయా ప్రదేశాలను హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. తద్వారా మహిళలపై జరిగే నేరాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు ఉన్న స్థలాలు, స్టేషన్లు, కార్యాలయ భవనాలు, ఇతర శాశ్వత ఆస్తుల పరిరక్షణకు వాటిని జియోఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేయాలని ట్రాక్ అధికారులకు డీజీపీ సూచించారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25వేల కిలోమీటర్ల వెంట ఆవాసాలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే రిమోట్ సెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోండి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మేరీ సడక్ యాప్‌తో పాటు స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. మౌలిక రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధి పనులపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. కార్యక్రమానికి నీతి ఆయోగ్, రోడ్లు, హైవేలు, రైల్వే శాఖల అధికారులు హాజరయ్యారు. రోడ్లు, రైల్వే రంగాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడానికి సమగ్ర విధానం ఉండాలని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన్ మంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 130 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు వివరించారు. హరిత సాంకేతికతతో 4000 కిలో మీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని, ప్లాస్టిక్ వ్యర్థాలు, కోల్డ్ మిక్స్, జియో టెక్స్టైల్స్, ఫ్లైయాష్, ఐరన్, కాపర్ల వినియోగాన్ని రోడ్ల నిర్మాణంలో ప్రోత్సహిస్తున్నట్లు పీఎంఓ వెల్లడించింది. చార్ధామ్ ప్రాజెక్టు, క్వాజిగుండ్–బానీహల్ సొరంగం, చీనాబ్ రైల్వే బ్రిడ్జి, జిరిబామ్–ఇంఫాల్ ప్రాజెక్టు, ఈస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాజెక్టుల పురోగతిని మోదీ సమీక్షించారు. -
అంతరిక్ష పరిజ్ఞానంతో అద్భుత ఫలితాలు
ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి సాక్షి, హైదరాబాద్: భారతీయ అంతరిక్ష పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోందని, దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతిని గడించిందని, గొప్ప, గొప్ప దేశాలు సైతం మనకు సాటిరావని ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి అన్నారు. దేశం ఎన్నోరంగాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించి అద్భుత ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఐక్యరాజ్యసమితి-ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం నగరంలోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. వివిధ రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణంలో సమాచార విశ్లేషణ కోసం అంతరిక్ష పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారన్నారు. అంతరిక్షం నుంచి ఉపగ్రహాల సహాయంతో భూఉపరితలం, సముద్రాలు, వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వివిధ అవసరాల కోసం వినియోగించేందుకు ఈ పరిజ్ఞానం దోహదపడుతోందని అన్నారు. అంతరిక్ష పరిజ్ఞానంతో సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ఆహారభద్రత, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అధ్యయనం, విపత్తుల నిర్వహణ, సహజ వనరుల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ విషయంలో ఇస్రో సహకారం అందిస్తోందని అన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానం ఆధారంగా స్టార్టప్‌లను నెలకొల్పేందుకు కొత్త ఐడియాలతో వచ్చే విద్యార్థులను ఇస్రో ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెలలో నగరంలోని జీడిమెట్లలో ఇస్రో ఆధ్వర్యంలో ఇల్యుమేషన్ కేంద్రాన్ని ఏర్పా టు చేసి 360 ఖగోళ యంత్రాలను విద్యార్థుల సందర్శకుల కోసం ఉంచనున్నామని తెలిపారు. సెమినార్లో భారత ఖగోళ శాస్త్ర సంచాలకులు రఘునందన్ కుమార్, ప్రిన్సిపాల్ బి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ పాత్ర కీలకం
అనంతపురం కల్చరల్ : పేదరిక నిర్మూలన, దేశాభివద్ధిలో స్పేస్ టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఇస్రో (అంతరిక్ష కేంద్రం) ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవ కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగాయి. ఈ సందర్భంగా షార్ కేంద్రం వారు ఏర్పాటు చేసిన రాకెట్ నమూనాలు, అంతరిక్ష రహస్యాలను తెలిపే చిత్రాల ప్రదర్శనను ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, జడ్పీ చైర్మన్ చమన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ ఇలాంటి అరుదైన ఎగ్జిబిషన్ అభినందనీయమని నిర్వాహకుల కషిని ప్రశంసించారు. అనంతరం శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి విచ్చేసిన ఎంబీఎన్ మూర్తి, నాగరాజు, ముఖేష్ తదితరులు మాట్లాడుతూ అంతరిక్షంలో ఉండే రహస్యాలను సామాన్యుడికి కూడా తెలియాలన్న ఉద్దేశ్యంతోనే 1999 నుంచి∙వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈసారి అనంతలో ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ఒక బందంగా ఏర్పాటు చేసి షార్ కేంద్రానికి స్టడీ టూర్‌గా పంపిస్తామని, అందుకు షార్ అధికారులు అనుమతించాలన్నారు. అనంతరం స్పేస్‌పై నిర్వహించిన పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలనందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగత్రిశూలపాణి, ఆర్డీవో మలోలా తదితరులు పాల్గొన్నారు. -
ఖనిజ వనరుల పర్యవేక్షణకు స్పేస్ టెక్నాలజీ
ఎన్ఎండీసీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఖనిజ వనరులను స్పేస్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు నగరంలో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ కేంద్రం డెరైక్టర్ జనరల్ బీపీ ఆచార్య ఢిల్లీలో చెప్పారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞానకేంద్రంలో ‘పరిపాలనలో స్పేస్ టెక్నాలజీ విధానాన్ని ప్రోత్సహించడం’పై జరిగిన జాతీయ సదస్సు లో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లను రిమోట్ సెన్సింగ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్, స్పేస్ విభాగం కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, కేంద్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నట్లు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
సామాన్యుడికి సాయపడాలి
ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలకు ప్రధాని సూచన సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి సాయపడే ఆవిష్కరణలు చేయాలని అధికారులు, శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చులో సరళమైన విధానంతో పేదలకు టెక్నాలజీ అందించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. ‘స్పేస్ టెక్నాలజీకి, సామాన్యుడికి మధ్య స్పేస్ (అంతరం)’ ఉండకూడదన్నారు. సుపరిపాలనలో టెక్నాలజీదే కీలక పాత్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పరిధిలో సాంకేతిక రంగాల్లో అన్వేషణలకు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘స్పేస్ టెక్నాలజీ’పై అంతరిక్ష విభాగం సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఒకే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1,600 మంది అధికారులు, శాస్త్రవేత్తలు హాజరై స్పేస్ టెక్నాలజీపై మేధోమథనం చేయడం ఇదే తొలిసారి.. * విశ్వవ్యాప్తంగా దేశం గర్వించే స్థాయిలో అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు లక్ష్యాన్ని సాధించారు. * మనం ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నామో విమాన పైలట్‌కు మానిటర్లో ఎలాగైతే ముందుగా తెలుస్తుందో, అలాగే మానవరహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద మానిటర్లు ఏర్పాటు చేసి శాటిలైట్‌కు అనుసంధానం చేస్తే రైల్వే డ్రైవర్లు అప్రమత్తమవుతారు. తద్వారా ఘోరప్రమాదాలను నివారించవచ్చు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇంజనీర్లు ఈ దిశగా కొత్త టెక్నాలజీని అభివృద్ధిచేశారు. ఇది త్వరలో అమల్లోకి తెస్తాం. * పోస్టల్ నెట్‌వర్క్‌ను శాటిలైట్‌తో అనుసంధానం చేసి చాలా సాధించవచ్చు. సామాన్యుల అవసరాలకు తగ్గట్లు విజ్ఞానం, విద్యావిధానం, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలలో టెక్నాలజీని ఉపయోగించాలి. * కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల కోసం యువతను ఆహ్వానించాలి. ప్రభుత్వ విభాగాల్లో సెల్ ఏర్పాటు చేసి ఆవిష్కరణలకు దారిచూపే ఆలోచనలను స్వీకరించాలి. * మాంఝీ అనే వ్యక్తి 45 ఏళ్ల పాటు కొండను తొలచి 50 కి.మీ ప్రయాణాన్ని 2కి.మీ. ప్రయాణానికి తగ్గించాడు. అప్పుడంటే టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీని వాడి దగ్గరిదారులు(షార్ట్వే) తెరవచ్చు. * ఎర్రచందనం అక్రమ రవాణాపై హై రిజల్యూషన్ కెమెరాలతో నిఘా పెట్టొచ్చు. ఖనిజాల తవ్వకం, రోడ్డు పన్ను వసూళ్లు, జాతీయ రహదారుల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను శాటిలైట్ అనుసంధానం ద్వారా నిరోధించవచ్చు. * సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేదాకా ప్రజాప్రతినిధులను సాంకేతికపై అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలి. * విశాఖలో హుద్‌హుద్ తుపానుపై శాటిలైట్ సాయంతో ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చారు. దీంతో తక్కువ నష్టం జరిగింది. * ఈ క్యాలెండర్ ఇయర్లోనే పేదలకు సాయపడేలా ఒక్క స్పేస్ అప్లికేషన్‌ను అయినా అభివృద్ధిచేయాలి. * విక్రమ్ సారాభాయ్ గొప్ప దార్శనికుడు. ప్రపంచవిపణిలో పోటీపడేందుకే భారత్ అంతరిక్షరంగంలో అడుగుపెట్టిందని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సామాన్యుల జీవితాలను బాగు చేసేందుకే అంతరిక్ష పరిజ్ఞానాన్ని భారత్ వినియోగిస్తోందని ఆయన నిరూపించారు. -
గ్రహశకలంపైకి సందేశం పంపండి!
వాషింగ్టన్: గ్రహశకలంపైకి సంక్షిప్త సందేశాలు, ఫొటోలను పంపాలని ఉందా? అంతరిక్ష టెక్నాలజీ గురించి జోస్యం చెప్పాలని ఉందా? అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మిషన్‌తో ఈ అరుదైన అవకాశం మీకు సొంతం కానుంది. ఇందుకు చేయవల్సిందల్లా ఒక్కటే. ట్విట్టర్లో ‘ఓసిరిస్-రెక్స్’ ఆస్టరాయిడ్ టైమ్ క్యాప్సూల్ కు ట్వీట్లు, ఫొటోలను సమర్పించడమే. గతేడాది జరిగిన అంతరిక్ష పరిశోధనలు, 2023 నాటికి సాకారమయ్యే అంతరిక్ష సాంకేతికతల గురించిన టాపిక్లే ఎంచుకోవాలి. అయితే వీటన్నింటిలో 50 ట్వీట్లను, 50 ఫొటోలను, భవిష్యత్తు అంచనాలను మాత్రమే నాసా ఎంపిక చేస్తుంది. వాటిని ఓ టైమ్ క్యాప్సూల్‌లో ఉంచి క్యాప్సూల్‌ను ఓసిరిస్-రెక్స్ వ్యోమనౌకపై అమర్చి 2016లో అంతరిక్షానికి పంపిస్తుంది. ఈ వ్యోమనౌక 1,760 అడుగుల సైజున్న బెన్నూ అనే గ్రహశకలాన్ని 2019 లో చేరి, దానిపై రెండేళ్లపాటు అధ్యయనం చేస్తుంది. తర్వాత భూమిపై పరిశోధనలు చేసేందుకు గ్రహశకలంపై 60 గ్రాముల పదార్థాన్ని సేకరించి 2023 నాటికి భూమికి తీసుకువస్తుంది. అప్పుడు టైం క్యాప్సూల్‌ను తెరిచి అందులోని ట్వీట్లు, ఫొటోలు, అంచనాలను నాసా శాస్త్రవేత్తలు బయటపెడతారట. ఎవరెవరు ఏ సందేశాలు ఉంచారు? ఏమేమి అంచనా వేశారు? వాటిలో ఏవి నిజమయ్యాయి? అన్నవి ప్రకటిస్తారట. -
అంతరిక్షం.. అవకాశాల తరంగం
దేశ ప్రగతిలో భాగం పంచుకుని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకునేవారికి అద్భుతమైన రంగం అంతరిక్షం. మన దేశం ఇప్పటికే వందకుపైగా ప్రయోగాలు చేసింది. ఇటీవలే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించి ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రికార్డు పుటలకెక్కింది. ఈ క్రమంలో అంతరిక్ష శాస్త్రం అవకాశాలకు ఆలంబనగా మారింది. స్పేస్ సైన్స్/ఇంజనీరింగ్‌ను అభ్యసిస్తే కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సంబంధిత కోర్సులు అందిస్తున్న సంస్థలు, అర్హతలు, కావాల్సిన స్కిల్స్‌పై ఫోకస్.. స్పేస్ సైన్స్/ఇంజనీరింగ్.. ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతున్న సబ్జెక్టు. అంతరిక్షానికి సంబంధించిన వివిధ అంశాలను గురించి చేసే అధ్యయనాన్ని స్పేస్ సైన్స్ అంటారు. ఇందులోనే వివిధ స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి.. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, గెలాక్టిక్ సైన్స్, స్టెల్లర్ సైన్స్, స్పేస్ డిఫెన్స్, స్పేస్ కొలనైజేషన్, జీఐఎస్, శాటిలైట్ మెటియొరాలజీ, గ్లోబల్ క్లైమేట్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ మొదలైనవి. ఆస్ట్రోనాట్స్, రాకెట్ సైంటిస్టులు, మెటియొరాలజిస్టులను కలిపి స్పేస్ సైంటిస్టులుగా వ్యవహరిస్తారు. ఏయే విభాగాలు: రాకెట్ రూపకల్పన నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపేవరకు ఎన్నో దశలుంటాయి. ముందుగా ఉపగ్రహ వాహక నౌక/రాకెట్ నమూనా రూపొందించడం, డిజైనింగ్, వాటి తయారీ వరకు ఎన్నో ప్రక్రియలుంటాయి. అదేవిధంగా రాకెట్లో వాడే వివిధ యంత్ర పరికరాలు, చిన్న చిన్న విడి విభాగాలు ప్రతిదీ కీలకమే. రాకెట్‌ను మండించడానికి ఎంత ఇంధనం వాడాలి? కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనుసరించాల్సిన విధివిధానాలు తెలిసి ఉండాలి. తర్వాత ఆ ఉపగ్రహాన్ని సంబంధిత వ్యవస్థలకు అనుసంధానించడం, ఉపగ్రహ పనితీరును పరిశీలించడం ఇలా ప్రతి అంశం.. కత్తి మీద సామే. ఈ నేపథ్యంలో ప్రతి విభాగంలో సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఎవరు అర్హులు: ఫిజిక్స్, మ్యాథ్స్ సూత్రాలపై పట్టు ఉండి, ధైర్యసాహసాలు, సానుకూల దృక్పథం ఉన్నవారు స్పేస్ సైంటిస్ట్ కావచ్చు. ఇందుకోసం ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంఎస్సీలో స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఎంచుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే బీటెక్‌లో ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ వంటి కోర్సులు అభ్యసించాలి. ఆ తర్వాత స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ పూర్తిచేయాలి. తర్వాత పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కావాల్సిన నైపుణ్యాలు: గణితం, భౌతిక శాస్త్రం సూత్రాలపై పట్టు ఉండాలి. విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉండాలి. తార్కిక పరిజ్ఞానం కష్టపడి పనిచేయడం, అంకిత భావం ధైర్యసాహసాలు, సహనం. సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఉండాలి. నిరంతరం వివిధ అంశాలను నేర్చుకుంటుండాలి. అందించే సంస్థలు: మన దేశంలో ఐఐటీలు మొదలుకుని వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల వరకు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కోర్సులు అందిస్తున్నాయి. మన దేశంలో ఐఐటీ- మద్రాస్ (వెబ్సైట్: www.iitm.ac.in), ఐఐటీ-బాంబే (వెబ్సైట్: www.iitb.ac.in), ఐఐటీ-కాన్పూర్ (వెబ్సైట్: www.iitk.ac.in), ఐఐటీ-ఖరగ్‌పూర్‌లు (వెబ్సైట్: www.iitkgp.ac.in) బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్‌లు ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. మన రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (వెబ్సైట్: www.uohyd.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ (వెబ్సైట్: www.andhrauniversity.edu.in), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (వెబ్సైట్: www.svuniversity.in), జేఎన్టీయూ- హైదరాబాద్ (వెబ్సైట్: www.jntuh.ac.in), ఉస్మానియా యూనివర్సిటీ (వెబ్సైట్: www.osmania.ac.in), జేఎన్టీయూ- కాకినాడ (వెబ్సైట్: www.jntk.edu.in) మొదలైనవి సంస్థను బట్టి.. ఏరోనాటికల్/ఏరో స్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎస్టీ: అంతరిక్ష రంగానికి సంబంధించిన కోర్సులను అందించడంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)కి మంచిపేరుంది. పూర్తిస్థాయిలో అంతరిక్ష కోర్సులను ఆఫర్ చేస్తోన్న ఈ సంస్థ 2007లో ఏర్పడింది. ఆసియాలోనే ఈ తరహా కోర్సులను అందిస్తోన్న తొలి ఇన్స్టిట్యూట్గా ఐఐఎస్టీ ప్రసిద్ధిగాంచింది. యూజీ నుంచి డాక్టోరల్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. 70 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు అర్హులు. గతేడాది వరకు ఐశాట్ ద్వారా ప్రవేశాలు కల్పించేవారు. ఈ ఏడాది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఎంఎస్‌లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి. మంచి అకడెమిక్ రికార్డ్‌తో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఇస్రోలో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఐఐఎస్టీ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. కోర్సుల గురించి క్లుప్తంగా.. బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక విభాగాల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్‌ను నేర్చుకునేలా కోర్సును రూపొందించారు. లాంచ్ వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ల డిజైన్, డెవలప్మెంట్పై బోధన ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌ల గురించి, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏరో డైనమిక్స్, ప్లైట్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఆటోమేటిక్ కంట్రోల్ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బీటెక్ ఏవియానిక్స్: ఇందులో ప్రాథమికంగా విద్యార్థుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్‌లో శిక్షణ అందిస్తారు. ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానం పొందేలా కోర్సు కరిక్యులం, సిలబస్ ఉంటుంది. కోర్సులో భాగంగా కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సిస్టమ్స్‌తోపాటు అనుబంధ సబ్జెక్టులను విద్యార్థులు అభ్యసించాల్సి ఉంటుంది. శాటిలైట్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్, వీఎల్ఎస్ఐ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మొదలైనవి కోర్సులో ఉంటాయి. బీటెక్ ఫిజికల్ సెన్సైస్: కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, ఎర్త్ సిస్టమ్ సైన్స్, కెమికల్ సిస్టమ్స్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నియామకాలు: ఇస్రో, డీఆర్డీవో, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదితర సంస్థలు వాటిల్లో ఖాళీల భర్తీకి ఎంప్లాయ్మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్ యోజన, వివిధ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటాయి. సంబంధిత వెబ్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కెరీర్: ఇప్పటివరకు మనదేశం 109 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించింది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రయోగాలు నిర్వహించనుంది. వీటిల్లో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పేస్ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇస్రోతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు, రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో అపార అవకాశాలున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇవి అంతరిక్ష పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో కూడా శాస్త్రవేత్తలుగా పనిచేయొచ్చు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల్లో కూడా అవకాశాలు పొందొచ్చు. మన దేశంలో ఇస్రో, షార్, డీఆర్డీవో వంటి సంస్థల్లో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. మొదట జూనియర్ శాస్త్రవేత్త/ట్రైనీ సైంటిస్ట్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి సీనియర్ శాస్త్రవేత్తగా పదోన్నతి లభిస్తుంది. పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేసేవారు సంబంధిత విభాగం చీఫ్, డెరైక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇంకా సైన్స్ మ్యూజియం, ప్లానెటోరియంలలో, అబ్జర్వేటరీ, స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలలో, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలుంటాయి. ఈ సంస్థల్లో అవకాశాలు: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం, ఇస్రో శాటిలైట్ సెంటర్- బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ - అహ్మదాబాద్, షార్- శ్రీహరికోట, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్- తిరువనంతపురం, బెంగళూరు, మహేంద్రగిరి, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్- బెంగళూరు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏరోస్పేస్ సిస్టమ్స్ పరిశ్రమల్ల్లో శాస్త్రవేత్తలుగా ఉద్యోగం పొందొచ్చు. మహిళలు ముందుకు రావాలి.. నేను తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించాను. కోర్సు పూర్తయ్యాక అకడెమిక్ రికార్డు ఆధారంగా షార్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాను. షార్‌లో పని రెండు విధాలుగా ఉంటుంది. అవి.. టెక్నికల్ వర్క్, రీసెర్చ్ వర్క్. సైంటిస్ట్/ఇంజనీర్లు రెండు పనులు చేస్తారు. రాకెట్ రీసెర్చ్, రాకెట్ సైన్స్, శాటిలైట్స్, స్పేస్‌సైన్స్, వివిధ యంత్రపరికరాలు, వివిధ విడి విభాగాలు మొదలైనవాటి నిర్మాణం, డిజైన్, పరిశోధన విధులను నిర్వర్తించాలి. సొంతంగా కూడా పరిశోధనలు చేయొచ్చు. అంకితభావం, కష్టపడి పనిచేయడం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అంతరిక్ష రంగాన్ని ఎంచుకోవచ్చు. విదేశాల్లో ఉన్నంతమంది మహిళా శాస్త్రవేత్తలు మనదేశంలో ఈ రంగంలో లేరు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి. పనిగంటలు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5.30కు ఆఫీస్ ముగుస్తుంది. శ్రీహరికోట వంటి పట్టణాల్లో ప్రారంభంలో నెలకు రూ. 40,000 వరకు వేతనాలు ఉంటాయి. బెంగళూరు వంటి నగరాల్లో దాదాపు 60,000 వరకు వేతనం అందిస్తారు. ఎక్కడ ఉన్నా నివాస, వైద్య, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. -సురేఖ, సైంటిస్ట్/ఇంజనీర్-సీ, షార్, శ్రీహరికోట టాప్ ర్యాంకు విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు ఏయూలో స్పేస్ ఫిజిక్స్‌లో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. వీటిలో 5 మన రాష్ట్ర విద్యార్థులకు, మరో 5 జాతీయ స్థాయిలో విద్యార్థులకు కేటాయించాం. ఇతర రాష్ట్రాల విద్యార్థులు లేకుంటే రాష్ట్ర విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తాం. ఈ కోర్సుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆసెట్లో ర్యాంకు సాధించిన వారిలో టాప్ ర్యాంకుల విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థినులు కూడా భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఐనో స్పియర్ ఫిజిక్స్, ఏరోనమీ, మాగ్నిటోస్ఫియర్ తదితర అంశాలపై బోధన ఉంటుంది. ప్రాక్టికల్స్‌కు సంబంధించి వర్సిటీలో అన్ని వసతులు ఉన్నాయి. సెకండియర్‌లో విద్యార్థులు ఏదైనా జాతీయ పరిశోధన సంస్థల్లో రెండు నెలలు ప్రాజెక్టు మీద పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారిలో ఎక్కువ మంది పీహెచ్‌డీని ఎంచుకుంటున్నారు. వివిధ పరిశోధన సంస్థలతోపాటు ఇస్రో, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ- అహ్మదాబాద్ వంటి సంస్థలలో పరిశోధనలు చేస్తున్నారు. వీరికి దేశ, విదేశాల్లో అపార అవకాశాలున్నాయి. -ఆచార్య కె.నిరంజన్, భౌతికశాస్త్ర విభాగాధిపతి, ఏయూ, విశాఖపట్నం సోలార్ యాక్టివిటీపై పరిశోధన చేయాలనుకుంటున్నా.. నేను స్పేస్ ఫిజిక్స్‌పై ఉన్న ఆసక్తితో ఈ కోర్సులో చేరాను. తక్కువ సీట్లు ఉండటంతో ఈ కోర్సుకు భారీ డిమాండ్ ఉంది. అట్మాస్ఫియరిక్ సైన్స్, ప్లాజ్మాపై అధ్యయనం చేసే విధానాలు తెలుసుకుంటున్నాను. భూమిపై ఉన్న పొరల్లో, ఆవరణంలో జరిగే మార్పులపై పరిశోధన చేయడానికి ఈ కోర్సు ఉపకరిస్తుంది. ఏరోజోల్స్, సోలార్యాక్టివిటీ, కాలుష్యం కారణంగా ఏర్పడే మార్పులపై రీసెర్చ్ చేస్తాను. -వి.సాయిగౌతమ్, స్పేస్ ఫిజిక్స్ (సెకండియర్), ఏయూ, విశాఖపట్నం.