అభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ పాత్ర కీలకం
అనంతపురం కల్చరల్ : పేదరిక నిర్మూలన, దేశాభివద్ధిలో స్పేస్ టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఇస్రో (అంతరిక్ష కేంద్రం) ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవ కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగాయి. ఈ సందర్భంగా షార్ కేంద్రం వారు ఏర్పాటు చేసిన రాకెట్ నమూనాలు, అంతరిక్ష రహస్యాలను తెలిపే చిత్రాల ప్రదర్శనను ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, జడ్పీ చైర్మన్ చమన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ ఇలాంటి అరుదైన ఎగ్జిబిషన్ అభినందనీయమని నిర్వాహకుల కషిని ప్రశంసించారు.
అనంతరం శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి విచ్చేసిన ఎంబీఎన్ మూర్తి, నాగరాజు, ముఖేష్ తదితరులు మాట్లాడుతూ అంతరిక్షంలో ఉండే రహస్యాలను సామాన్యుడికి కూడా తెలియాలన్న ఉద్దేశ్యంతోనే 1999 నుంచి∙వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈసారి అనంతలో ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ఒక బందంగా ఏర్పాటు చేసి షార్ కేంద్రానికి స్టడీ టూర్‌గా పంపిస్తామని, అందుకు షార్ అధికారులు అనుమతించాలన్నారు. అనంతరం స్పేస్‌పై నిర్వహించిన పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలనందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగత్రిశూలపాణి, ఆర్డీవో మలోలా తదితరులు పాల్గొన్నారు.