
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు భూగోళ పరిశీలన డేటా సంబంధ సర్వీసులను అందించే కాంట్రాక్టు దక్కించుకుంది. 476 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, వాటిలో పిక్సెల్ కూడా ఒకటి. భూమిపై జీవనాన్ని మెరుగుపర్చేందుకు నాసా సాగిస్తున్న పరిశోధన కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఈ కంపెనీలు ఎర్త్–అబ్జర్వేషన్ డేటాను అందిస్తాయి. కాంతి తరంగధైర్ఘ్యాల వ్యాప్తంగా ఉండే డేటాను హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజ్‌ల రూపంలో సేకరించి, వాతావరణ మార్పులు, వ్యవసాయం, జీవ వైవిధ్యం, వనరుల నిర్వహణ మొదలైన వాటి సూక్ష్మ వివరాలను పిక్సెల్ టెక్నాలజీ అందిస్తుంది.
ఇదీ చదవండి: నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులు
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) కాంట్రాక్టు దక్కడంపై పిక్సెల్ సహ–వ్యవస్థాపకుడు అవైస్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష ఆధారిత భూ పరిశోధనల్లో హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ కీలకంగా మారబోతోందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరింత అధిక రిజల్యూషన్‌తో ఇమేజ్‌లు ఇచ్చే ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పిక్సెల్ తెలిపింది. భూగోళ అధ్యయనానికి అవసరమయ్యే వివరాలను తక్కువ వ్యయాలతో సేకరించేందుకు తాజా కాంట్రాక్టు ఉపయోగపడగలదని నాసా పేర్కొంది.