దేశానికో చంద్రుడు! | A Gift from Nixon: A Moon Pebble for Each Head of State 135 Countries | Sakshi
Sakshi News home page

దేశానికో చంద్రుడు!

Nov 2 2025 10:04 AM | Updated on Nov 2 2025 10:04 AM

A Gift from Nixon: A Moon Pebble for Each Head of State 135 Countries

ఇప్పటికీ ఎవరైనా కొత్తగా అమెరికా వెళ్లొస్తే అక్కడి నుండి చాక్లెట్స్‌ తెస్తారు. ఇక్కడ నలుగురికీ పంచుతారు. అమెరికా వెళ్లొచ్చిన వారికి, అమెరికా చాక్లెట్‌లు కానుకగా అందుకున్న వారికి.. ఇద్దరికీ అదొక ‘తీపి’ జ్ఞాపకం. అదే విధంగా యాభై ఐదేళ్ల క్రితం ‘నాసా’ తొలిసారి ‘చంద్ర శిలల్ని’ భూమి మీదకు తెచ్చినప్పుడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రపంచ దేశాలకు తలా ఒక శిలా ఖండాన్ని ‘దేశానికో చంద్రుడి’లా గుడ్‌విల్‌ గిఫ్టు పంపారు. 

మనకూ ఒక చాక్లెట్‌... అదే, మనకూ ఒక రాయి (ఆ తర్వాత ఇంకో రాయి కూడా) బహుమతిగా లభించింది.  రాయితో పాటుగా నిక్సన్‌.. ‘మానవ ప్రయత్నాలలోని ఐక్యతకు చిహ్నం’ అని ఒక సందేశాన్ని కూడా జత చేశారు. నాడు ఆ ఘనత సాధించిన ‘నాసా’.. ఇప్పుడు మరో ప్రయత్నానికి సమాయత్తం అవుతోంది. చంద్రుడి పైన చంద్ర శిలల్ని తవ్వేందుకు ఒక జేసీబీని తయారు చేస్తోంది. ఈ సందర్భంగా ‘చంద్ర శిల’ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.  

చంద్ర శిలలపై శాస్త్ర పరిశోధనలు

‘నాసా’కు చెందిన అపోలో మిషన్‌ వ్యోమగాములు చంద్రుని పైకి వెళ్లినప్పుడు అక్కడి నుండి భూమి మీదకు అద్భుతమైన ‘జ్ఞాపకాలను’ మోసుకొచ్చారు. అవే.. చంద్ర శిలలు!

విజయవంతం అయిన 6 అపోలో యాత్రల నుంచి 12 మంది వ్యోమగాములు దాదాపు 382 కిలోల బరువున్న 2,196 శిలా శకలాలను సేకరించారు.

చంద్ర శిలలు కేవలం విజయ చిహ్నాలు మాత్రమే కాదు. వీటిపై భూమి మీద శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని సందర్శకుల కోసం మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. మరికొన్ని ప్రపంచ దేశాలకు బహుమతులుగా వెళ్లాయి. 

నాసా చేపట్టిన మొత్తం అపోలో యాత్రల సంఖ్య 17. ఈ యాత్రలను నాసా 1969–1972 మధ్యకాలంలో నిర్వహించింది. వీటిల్లో మొత్తం 11 మానవ సహిత యాత్రలు కాగా,  వాటిలో ఆరు యాత్రలు చంద్రుని పైకి వ్యోమగాములను విజయవంతంగా దింపాయి. అవి అపోలో 11, 12, 14, 15, 16, 17. ఈ ఈరు యాత్రల వ్యోమగాములు తెచ్చినవే ఈ చంద్రశిలలు. 

ఏయే దేశాలలో ఉన్నాయి?

చంద్రుడి పైకి వ్యోమగాముల మొదటి ల్యాండింగ్‌ 1969 జూలైలో ‘అపోలో 11’ ద్వారా విజయవంతమైంది. అందులోనే నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌ ఉన్నారు. 

ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌ భూమిపైకి తెచ్చిన చంద్ర శిలలతో పాటు చంద్రుడి పైకి 1972లో ‘అపోలో 17’ ద్వారా జరిగిన వ్యోమగాముల చివరి ల్యాండింగ్‌ వరకు అసంఖ్యాకంగా శిలలు భూమికి చేరాయి. 

ఆ శిలల్లోని 50,000 శిలా శకలాలను ప్రపంచంలోని 15 దేశాలలోని 500 ప్రయోగశాలలకు నాసా పంపించింది. నిజానికి, వ్యోమగామలు తెచ్చిన చంద్రశిలల్లో ఇంకా 80 శాతం అలాగే, ఎవరూ కదలించకుండా ఉన్నాయి. 

ఈ 80 శాతంలో 15 శాతం చంద్రశిలల్ని ‘నాసా’, హ్యూస్టన్‌లోని తన ప్రధాన స్థావరానికి దూరంగా, న్యూ మెక్సికోలో ఒక దుర్భేద్యమైన భాండాగారంలో భద్రపరచింది. 

మానవులే స్వయంగా తెచ్చినవి
·చంద్రుడి నుండి భూమి మీదకు కేవలం రాళ్లు మాత్రమే రాలేదు. మట్టి, ధూళిని కూడా వ్యోమగాములు తీసుకొచ్చారు. వీటిల్లో అపోలో చంద్ర శిలలు ఎందుకు ఇంత ప్రత్యేకమైనవి అంటే, మానవులు వాటిని తమ స్వహస్తాలతో చంద్రుడి పైనుంచి సేకరించుకుని వచ్చినవి కావటం. 

సోవియట్‌ యూనియన్‌ కూడా కొన్ని రాళ్ల నమూనాలను సేకరించింది.  కానీ, అవి.. చంద్రుడి పైకి సోవియట్‌ యూనియన్‌ పంపిన మానవ రహిత అంతరిక్ష నౌకలోని రోబో మిషన్లు కిందికి తీసుకు వచ్చినవి. 

అలాగే, కొన్ని చంద్రశిలలు వాటంతటవే ఉల్కపాతంలా భూమిపై పడినవి. అయితే అవి చంద్రుడి లోని  ఏ నిర్దిష్ట ప్రదేశం నుండి పడ్డాయో గుర్తించటం కష్టం. ఆ కారణంగా కొన్ని రకాల పరిశోధనలకు ఆ రాళ్లు  తక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. 

ప్రపంచదేశాలకు నిక్సన్‌ గిఫ్ట్‌
1969లో అపోలో 11 చంద్రయానం ద్వారా తొలిసారి వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల నమూనాలను అప్పటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 135 దేశాలకు బహుమతిగా పంపించారు. అయితే ఆ దేశాలలో సోవియట్‌ యూనియన్‌ లేదు!

తిరిగి 1972లో, అపోలో 17 ద్వారా వచ్చిన చంద్ర శిలల్ని నిక్సన్‌ మళ్లీ అన్ని దేశాలకూ కానుకగా పంపించారు. ఈసారి సోవియట్‌కు ఆ అపురూపమైన బహుమతి పంపించారు.   

కాగా, ఇలా రెండుసార్లు నిక్సన్‌ పంపిన శిలా బహుమతులను ఆయా దేశాలు ఏం చేశాయో తెలీదు! కొన్ని దేశాలు ప్రదర్శనకు ఉంచాయి. కొన్ని దేశాలు పోగొట్టుకున్నాయి. కొన్ని చోరీ అవగా, మరికొన్ని దేశాలు స్టోర్‌ రూమ్‌లో పడేసినట్లు తెలుస్తోంది. 

భారతదేశానికి కూడా నిక్సన్‌ ఒక చంద్రశిలను కానుకగా పంపారు. 1973లో ఆ కానుక ఇండియా చేరింది. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆ చంద్రశిలను న్యూఢిల్లీలోని పార్లమెంటు మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయించారు. 

అంతకు ముందరి అపోలో 11 గుడ్‌ విల్‌ ‘రాక్‌’ను కూడా అమెరికా ఇండియాకు బహుకరించింది. అదిప్పుడు రాష్ట్రపతి భవన్‌ మ్యూజియంలో ఉంది. వివిధ దేశాలకు నిక్సన్‌ పంపిన ఈ చంద్రశిలా కానుకలతో పాటు, ‘మానవ ప్రయత్నాలలో ఐక్యతకు చిహ్నం’ అనే సందేశం కూడా జతపరిచి ఉంది.
కొన్ని 

శిలలైతే ఎక్కడివక్కడే!

అపోలో వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల్లో కొన్నింటిని నేటికీ కదల్చనేలేదు. అవి ఇప్పటికీ చంద్రునిపై ఉన్నట్లుగానే ఉండిపోయాయి!

ర్యాన్‌ జీగ్లర్‌ వంటి శాస్త్రవేత్తలు ఈ విలువైన చంద్రశిలల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాటిపై సరైన విధంగా పరిశోధనలు జరుగుతున్నాయా లేదా అని తరచు నిర్ధారించుకుంటూ ఉంటారు. 

అపోలో వ్యోమగాముల తీసుకొచ్చిన రాళ్లలో కొన్ని 400 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని 200 కోట్ల సంవత్సరాల నాటివి. 

ఈ రాళ్లను భూవాతావరణం, సూక్ష్మక్రిములు, కాలుష్యం నుండి సంరక్షించటానికి నత్రజని నింపిన గదులలో భద్రపరచారు.  

(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement