
కేప్ కెనావెరాల్: చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చేపట్టిన ఆర్టెమిస్–1 ప్రయోగం సోమవారం వాయిదా పడింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూన్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇంజిన్ నుంచి ఇంధనం లీక్ అయినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం కౌంట్‌డౌన్ ప్రారంభమైనప్పటికీ చివరి గంటలో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు.
సెప్టెంబర్ మొదటి వారంలో ఉండవచ్చని సమాచారం. ఆర్టెమిస్–1 ప్రయోగంలో భాగంగా రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్ల అతిశీతల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. 4 ఇంజిన్లు ఉన్న ఈ రాకెట్‌లో ఒకదాంట్లో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించారు. లాంచ్‌ప్యాడ్‌పై రాకెట్ ఉన్నచోట పిడుగు పడడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. సమస్యను సరిదిద్దడానికి కొంత సమయం పట్టొచ్చు. 2024లో ఆర్టెమిస్–2, 2025లో ఆర్టెమిస్–3 ప్రయోగాలు చేపట్టేందుకు నాసా సన్నద్ధమవుతోంది. చందమామపైకి వ్యోమగాములను పంపించడమే కాదు, అక్కడ మానవుల శాశ్వత నివాసానికి పునాదులు వేయడమే ఈ ప్రయోగాల లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment