సరిపోయారు ఇద్దరూనూ! | Funday Story On Squirrel | Sakshi
Sakshi News home page

సరిపోయారు ఇద్దరూనూ!

Nov 2 2025 12:46 PM | Updated on Nov 2 2025 12:46 PM

Funday Story On Squirrel

అనగనగా ఒక అడవిలో ఒక మర్రిచెట్టు ఉండేది. మర్రిచెట్టు తొర్రలో ఉడత, కొమ్మ మీది గూటిలో కాకి నివసించేవి.
ఉడుత, కాకి రెండూ స్నేహంగా ఉండేవి.
ఒకరోజు ఉదయం ఆహారం కోసం చెట్టు దిగింది ఉడుత.
ఒక కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చెట్టు నీడలో కాసేపు ఆయాసం తీర్చుకుంది. 
ఉడుతతో ‘మిత్రమా! నాకు చాలా దాహంగా ఉంది. చెరువుకు దారి చెప్తావా!’ మర్యాదగా అడిగింది కుందేలు.
‘చెరువుకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ తల గోక్కుంది.
చెట్టు మీదనే ఉన్న కాకి విషయం తెలుసుకొని, ‘నేరుగా వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే చెరువు వస్తుంది!’ అంది.
‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.
అప్పుడు ఉడుత వైపు వింతగా చూసింది కుందేలు.
‘నువ్వేమీ కంగారు పడకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు అడిగింది కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు తోడుగా ఉంటాను!’ అంది కాకి.
‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ చెరువు వైపు పరిగెత్తింది కుందేలు.
కాకి ఆహారం కోసం ఎగిరి బయటకి వెళ్లింది. 
ఉడుత దాచుకున్న గింజల కోసం చెట్టు తొర్రంతా వెతికింది గాని, కనపడలేదు. ఏదో గుర్తొచ్చి చెట్టుకిందకు దూకింది.
నేల తవ్వి అక్కడ దాచుకున్న గింజలు తింటుండగా నక్క అక్కడికి వచ్చింది.
‘మిత్రమా! నేను పక్క అడవి నుంచి వస్తున్నాను. పులిరాజు గుహకు దారి చెపుతావా!’ అని అడిగింది.
‘పులిరాజు గుహకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ నెత్తి గోక్కుంది. 
అప్పుడే ఆహారంతో తిరిగి వచ్చిన కాకి విషయం తెలుసుకుని, ‘నేరుగా వెళ్లి ఎడమ చేతి వైపు తిరిగితే పులిరాజు గుహ వస్తుంది!’ అంది కాకి
‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.
అప్పుడు ఉడుత వైపు విచిత్రంగా చూసింది నక్క.
‘నువ్వేమీ అనుకోకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు వచ్చిన సంగతి కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు సాయంగా ఉంటాను!’ అంది కాకి.
‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ గుహ వైపు నడిచింది నక్క.
నక్క పులిరాజు గుహకు దారి అడగటంతో..
ఉడుత చెట్టు పైకి చూసి, ‘మిత్రమా! నీకు చెప్పటం మరచా! నీకోసం మంత్రి ఎలుగుబంటి వచ్చింది. పులిరాజు చాటింపు వేయమన్నాడని చెప్పమంది’ అంది ఉడుత. 
‘ఏమి చాటింపు?’ అడిగింది కాకి.
‘చాటింపు ఏమిటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ బుర్ర గోక్కుంది.
‘పులిరాజు ఏమి పురమాయించాడో గుర్తుకు తెచ్చుకుని చెప్పకపోయావో నా చేతిలో నీచావు తప్పదు!’ అంది కోపంగా కాకి.
‘ఆ.. చావంటే గుర్తొచ్చింది. రేపు పులిరాజు తల్లి చనిపోయిన రోజట! అడవంతా విందుకు రమ్మని చాటింపు వేయమని మంత్రి ఎలుగుబంటి నీకు చెప్పమంది!’ అంది ఉడుత. 
కాకి వెంటనే అడవంతా చాటింపు వేసింది.
మరునాడు అడవి జీవులన్నీ పులిరాజు గుహకు చేరాయి. అక్కడ పులిరాజు చిట్టి కూన పుట్టిన రోజు వేడుక జరుగుతోంది. కాకి తప్పు చాటింపు వేశాడని వేడుకకు వచ్చిన అడవి జీవులన్నీ గుసగుసలాడుకున్నాయి. ఆ విషయం ఎలుగుబంటికి, పులికి కూడా తెలిసింది. ఎలుగుబంటి ఉడుతను, కాకిని పిలిచింది. పులిరాజు చేతిలో చచ్చామనుకున్నాయి. కాకి, ఉడుత భయంతో వణుక్కుంటూ వెళ్లాయి. ఉడుత మతిమరపు విషయం చెప్పింది కాకి. పొరపాటుకు క్షమించమని పులి కాళ్లు పట్టుకున్నాయి కాకి, ఉడుత.
‘భయపడకండి! మీరు మంచే చేశారు. ఈరోజు నా చిట్టికూన పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా! 
మా అమ్మే గత యేడు చనిపోయి, చిట్టి కూనగా పుట్టింది. మతిమరపు ఉడుతది కాదు, కూన పుట్టిన ఆనందంలో మరచిన నాదే!’ అంది పులిరాజు.
కాకి, ఉడుతలకు విలువైన కానుకలిచ్చాడు పులిరాజు. అడవి జీవులన్నీ కమ్మటి విందు చేశాయి. చేతిలో విలువైన కానుకలతో తిరుగుతున్న కాకి, ఉడుతలను చూసి అడవి జీవులన్నీ ‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకున్నాయి. పులిరాజు రాజ వైద్యుడు కోతితో ఉడుతకు వైద్యం చేయించి, మతిమరపు పోగొట్టాడు.
 

∙ముద్దు హేమలత  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement